ఉత్తరాంధ్ర ఏజన్సీలో కొన్ని రోజులుగా కనిపిస్తున్నవింత వ్యాధి లక్షణాలతో ఆకస్మికంగా కాలు పొంగులూ, కడుపు నొప్పి, కళ్లు ఎర్ర బడటంతో గిరిజనులు అనారోగ్యానికి గురవుతున్నారు. చికిత్స తీసుకుంటున్నా ఎటువంటి ఫలితమూ లేక రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడుతున్నారు.
ఈ వ్యాధి లక్షణాలు అంతుపట్టక వైద్యులు చేతులెత్తేస్తున్నారు. స్థానిక వైద్యులు వారి అవగాహన మేరకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోతుండటంతో విశాఖ కెజిహెచ్ కు రోగులను పంపించేస్తున్నారు. ఈ వ్యాధితో బాధపడుతూ సుమారు 20మంది గిరిజనులు ప్రస్తుతం కెజిహెచ్ లో చికిత్స పొందుతున్నారు.

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు, రంప చోడవరం, అరకు, అనంతగిరి ప్రాంతాల్లో తొలుత కనిపించిన ఈ వ్యాధి ప్రస్తుతం విజయనగరం జిల్లా ఆండ్ర, పాచిపెంట ఏజెన్సీ ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఈ వ్యాధి లక్షణాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టు తెలుస్తోంది.
కరకవలసలో మృత్యుఖేళి
విజయనగరం జిల్లా మెంటాడ, విశాఖ జిల్లా అనంతగిరి మండలాల సరిహద్దుల్లోని రొంపల్లి పంచాయతీ పరిధి మారుమూల గిరిజన గ్రామమైన కరకవలసలో ఈ వ్యాధి ప్రస్తుతం తీవ్రంగా ఉంది. ఈ వ్యాధితో బుధవారం కోటపర్తి బుచ్చయ్య ( 38 ) మృతి చెందాడు. నెలరోజుల వ్యవధిలో ఆ గ్రామానికి చెందిన నలుగురు మృతిచెందారు. అదే లక్షణాలతో ఉన్న మరో 20మందిని విశాఖ కెజిహెచ్ కు తరలించారు. వ్యాధి నిర్దారణ కాకపోవడం , విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటం వల్ల గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.











