‘ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో’- ఇది ఓ సుమధుర గీతం… నాటి నటనా పారిజాతానికి ఓ మధుర జ్ఞాపకం. ఆమె మరెవరో కాదు పదమూడేళ్ల ప్రాయంలోనే హీరోయిన్ గా పరిచయమై తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఒడియా భాషల్లో 300 సినిమాల నటి, 400 సినిమాల డబ్బింగ్ కళాకారిణి రోజారమణి. ఎవరైనా తమ కెరీర్ లో ఎదిగాక తను వచ్చిన దారిని మరచిపోతుంటారు. రోజారమణి అలా కాదు. తన కెరీర్ లో తొలినాటి దర్శకులను ఎప్పుడూ తలచుకుంటుంటారు. అంతేకాదు అవకాశం ఉంటే వారిని కలవడానికి ఏ మాత్రమూ వెనకాడరు. అలాంటి వారు ఈరోజుల్లో ఎందరుంటారు చెప్పండి.
రోజారమణి బాలనటిగా కెరీర్ ను ప్రారంభించినా హీరోయిన్ గా పరిచయమైన తొలి సినిమా మలయాళంలో ‘చంబరతి’, దాన్నే తెలుగులో ‘కన్నెవయసు’గా పునర్నిర్మించారు. ఆ తర్వాత అది తమిళంలో ‘పరువకాలం’గా తెరకెక్కింది. ఈ పారిజాతం పాట ఆ ‘కన్నెవయసు’ సినిమాలోనిదే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే ‘కన్నెవయసు’ సినిమా దాదాపు 50 వసంతాలకు చేరువైంది. ఆ సినిమా దర్శకుడు ఒ.ఎస్.ఆర్. ఆంజనేయులు, ఆ సినిమా కథానాయిక రోజారమణిలకు ఆ మధ్య విశాఖపట్నంలో ఘనంగా సన్మానం కూడా జరిగింది. దర్శకుడు ఆంజేయులు ఇటీవలే మరణించారు. నిజానికి ఈ 50 వసంతాల వేడుకను ఘనంగా నిర్వహించాలని కూడా అనుకున్నారు.
‘కన్నెవయసు’ కాకపోయినా..
‘కన్నెవయసు’ సినిమా మొదట ‘చంబరతి’గా మలయాళంలో రూపొందిన సంగతి తెలిసిందే. నిజానికి అప్పటికి ఆమెది ‘కన్నెవయసు’కూడా కాదు. 13 ఏళ్ల ప్రాయంలోనే అవకాశం వరించింది. అదెలా అంటే ఆమె మాటల్లోనే…‘‘1973లో నాది ఎటూ కాని ఏజ్. ఆ టైమ్ లో ఈ ఆఫర్ వచ్చింది. నారాయణరావు అని ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్. ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా చూస్తుండేవారు. ఒక మలయాళం సినిమా తీస్తున్నారు 12, 13 ఏళ్ల అమ్మాయి అయితే బాగుంటుంది. పాపది అదే ఏజ్ కదా అని అడిగితే నాన్న మొదట అంగీకరించలేదు.‘కథ వినండి నచ్చితేనే చేయండి’ అని నిర్మాతను, దర్శకుడిని మా ఇంటికి బలవంతంగా తీసుకొచ్చారు.
ఒకే షెడ్యూల్, పాప మీదే సినిమా ఉంటుంది అని చెప్పారు. గ్లామర్ లేని పాత్రే అది. విడుదలైన రెండుమూడు రోజుల తర్వాత నారాయణరావు బొకే పట్టుకొచ్చారు. ‘అమ్మా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సక్సెస్ టూర్ పెట్టారు వెళ్లాలి’ అన్నారు. ఆ తొలి సినిమాకే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత అదే సినిమా రైట్స్ ను భావన్నారాయణగారు కొని తెలుగులో తీశారు. దీనికి ఒ.ఎస్.ఆర్. ఆంజనేయులుగారు దర్శకులు. హీరోగా లక్ష్మీకాంత్ అనే అతను చేశాడు. విలన్ గా వైజాగ్ కు చెందిన ప్రసాద్ అనే కొత్త అతనికి అవకాశం ఇచ్చారు. తెలుగులో ఈ సినిమాకు ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాట సగం ప్లస్ అయింది.
అదే సినిమాను తమిళంలో తీయాల్సి వచ్చినప్పుడు నన్నే హీరోయిన్ గా ఎంపిక చేశారు. విలన్ గా కమల్ హాసన్ చేశారు. వైజాగ్ లో ఫంక్షన్ చేసిన వ్యక్తి సత్యశ్రీ. ఆంజనేయులుగారికి ఆయన ప్రధమ శిష్యులు. చిన్న యాక్సిడెంట్ లో ఆయన రెండు చేతులూ పోగొట్టుకున్నారు. అయినా కూడా ఆయన ఈ వేడుకను నిర్వహించడానికి పూనుకోవడం విశేషం. ‘గురు సత్కారం చేయాలనుకుంటున్నానమ్మా.. మీరూ వస్తే బాగుంటుంది’ అన్నారు. ఒక శిష్యుడు అలా చేస్తున్నాడంటే వండర్ అనిపించింది.
అలాంటి వ్యక్తికి మనం చేయాలసలు సన్మానం. తన శిష్యుడి అభిమానానానికి ఆంజనేయులుగారి కళ్లలో నీళ్లు తిరిగాయి.’’అని రోజారమణి వివరించారు. ఆంజనేయులుగారు చనిపోవడం కూడా తనకెంతో బాధ కలిగించిందని ఆమె అన్నారు. రోజారమణి హీరోయిన్ గా ‘ఓ సీత కథ’ చిత్రం కళా తపస్వి కె. విశ్వనాథ్ చేతుల్లో రూపుదిద్దుకున్నదే.ఈ సినిమాలో టైటిల్ రోల్ ఆమెదే. కె. విశ్వనాథ్ గారితో తనకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉందని ఆమె అన్నారు. తరచూ వెళ్లి ఆయనను కలుస్తుంటానని వివరించారు. నరసింహరాజు హీరోగా, రోజారమణి హీరోయిన్ గా ‘పునాదిరాళ్లు’ చిత్రాన్ని దర్శకుడు రాజ్ కుమార్ రూపొందించారు.
ఈ సినిమా ద్వారానే మెగాస్టార్ చిరంజీవి వెండితెరకు పరిచయమయ్యారు. ఈ దర్శకుడు అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనప్పుడు రజారమణి ఆయనను పరామర్శించి వచ్చారు. ఆయన చనిపోయిన సందర్భాన్ని తలచుకుంటేనే బాధ కలుగుతుందన్నారామె. అప్పుడప్పుడు ఇలాంటి మధురస్మృతులను ఆమె గుర్తుచేసుకుంటుంటారు. ఆమె కుమారుడు తరుణ్ కూడా బాలనటుడిగానే కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగారు. రోజారమణి భర్త చక్రపాణి కూడా సినిమా నటుడే. అలా చూస్తే అది సినిమా కుటుంబంగా చెప్పాలి.