తమిళనాడు రాజకీయాలు ఎల్లప్పుడూ ఆసక్తికరమే. గతంలో అటు డీఎంకే చీఫ్ కరుణానిధి, ఇటు అన్నాడీఎంకే చీఫ్ జయలలితలు తమదైన శైలి వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ సాగిన తమిళ రాజకీయాలు… వారిద్దరి మరణం తర్వాత మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలపై ఇప్పుడే ఆసక్తికర చర్చలు ప్రారంభమయ్యాయి.
ఈ చర్చలంతా అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న జయలలిత నెచ్చెలి శశికళ చుట్టూనే సాగుతున్నాయి. మరో వారం పది రోజుల్లో శశికళ జైలు నుంచి విడుదల కానున్నారని, సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె విడుదలవుతుండటంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ దఫా అసెంబ్లీ పోరు హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో శశికళ దోషిగా తేలడం, కింది కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించిన నేపథ్యంలో 2017లో శశికళ అనూహ్యంగా జైలుకెళ్లక తప్పలేదు. నాటి నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో కారాగార వాసం చేస్తున్న శశికళ… ఎప్పటికప్పుడు తన రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసుకోవడం, తన ఆప్తులను జైలుకు పిలిపించుకుని మరీ చర్చలు జరపడం తెలిసిందే. అయితే సరిగ్గా ఇప్పుడు ఎన్నికలకు సమయం ఆసన్నమైన నేపథ్యంలోనే ఆమె జైలు నుంచి విడుదల కావడానికి రంగం సిద్ధమైపోయింది.
ఇప్పటికే నాలుగేళ్ల జైలు జీవితాన్ని పూర్తి చేసిన శశికళ… సత్ప్రవర్తన కింద 129 రోజుల మేర కారాగారవాసం నుంచి ఉపశమనం పొందనున్నారని, ఇందులో భాగంగా దసరా సెలువల తర్వాత కోర్టులు తిరిగి ప్రారంభం కాగానే… శశికళ విడుదల కావడం ఖాయమేనని ఆమె తరఫు లాయర్ గట్టిగానే చెబుతున్నారు. అంతేకాకుండా కోర్టుకు చెల్లించాల్సిన రూ.10 కోట్ల 10 లక్షల జరిమానాను కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, శశికళ విడుదల కావడం ఖాయమేనని సదరు లాయర్ చెబుతున్నారు.
మొత్తంగా శశికళ జైలు నుంచి విడుదల కావడం ఖాయమేనన్న వాదనలకు అయితే బలం చేకూరిన నేపథ్యంలో… సరిగ్గా ఎన్నికలకు ముందు శశికళ జైలు నుంచి విడుడల అయితే తమిళ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. జయలలిత మరణం తర్వాత సీఎం పీఠాన్ని హస్తగతం చేసుకునేందుకు శశికళ తీవ్రంగా యత్నించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బీజేపీ… వ్యూహాత్మకంగా శశికళను పక్కనపెట్టేసేలా వ్యూహం రచించింది. జయలలిత నమ్మినబంటు పన్నీర్ సెల్వంను కాదని తనకు అనుకూలంగా ఉన్న పళనిసామిని సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టిన శశికళ.. తెరవెనుక మంత్రాంగం నడిపిద్దామని భావించారు.
ఆ ఆశలకు గండికొట్టేలా ఎంట్రీ ఇచ్చిన ప్రతివ్యూహాలు చివరకు ఆమెను జైలు పాలు చేశాయి. అయితే ఇప్పుడు అటు కరుణానిధి, ఇటు జయలలిత లేకుండా తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు శశికళ జైలు నుంచి విడుదల అవుతుండటం ఆసక్తికరంగా మారింది. తన స్నేహితురాలి మాదిరే తాను కూడా రాజకీయాల్లో చక్రం తిప్పేలా శశికళ చేయని యత్నమంటూ లేదు. తాజాగా ఇప్పుడు జైలు నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో… వెనువెంటనే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో శశికళ ఎలాంటి వ్యూహాలు రచిస్తారోనన్న చర్చలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.











