ఎక్కడో మారుమూల థియేటర్ లో సినిమా టిక్కెట్ తెగితే దాని ప్రభావం చిత్ర పరిశ్రమపై ఎంతలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతోంది. సినిమా టిక్కెట్ల ద్వారా వసూలయ్యే మొత్తమే సినిమా రంగంలో అనేక రూపాల్లోకి వెళ్లిపోతుంది. ముఖ్యంగా హీరోలకు కోట్లకు కోట్ల పారితోషికాలు ఇవ్వడానికి ఆయా సినిమాలు వసూలు చేసే కలెక్షన్లే ప్రాతిపదిక. టిక్కెట్ల రేట్లు తగ్గించాలన్న డిమాండు బదులు హీరోల పారితోషికాలు తగ్గించమని అడగొచ్చు కదా? అని ప్రశ్నించేదాకా పరిస్థితి వెళ్లింది.
ఈ మాట అమాత్యుల నోటి నుంచి వచ్చిందీ అంటే సర్కారు వారి లెక్కలు ఎంతలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హీరోల ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతోందంటూ ప్రత్యారోపణలు చేస్తున్నవారూ ఉన్నారు. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా టిక్కెట్ల రేట్లు ఉండటాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. సినిమా అనేది ఒకే భాషకు చెందినది అయినప్పుడు రెండు రకాల విధానాలు ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. చివరికి ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కేదాకా వెళ్లింది.
తెలంగాణ వరకూ ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా ఏపీలో మాత్రం వరుసగా థియేటర్లు మూతపడుతున్నాయి. ఈ విషయంలో సంయమనం పాటించాల్సిందిగా దిల్ రాజు కోరారు. ఈరోజు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. 19 మంది డిస్ట్రిబ్యూటర్లు,ఎఫ్డీసీ చైర్మన్ విజయకుమార్ రెడ్డి దాదాపు రెండు గంటలకు పాటు చర్చలు సాగాయి. టిక్కెట్ల రేట్లు, థియేటర్ల మూసివేత, హీరోల వ్యాఖ్యలు తదితర అంశాలపై మంత్రి పేర్ని నాని మాట్లాడారు. హీరోలకు చురకలు కూడా వేశారు.
ఆ ఇద్దరు హీరోలకు చురకలు..
టిక్కెట్ల ధరలపై గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తాజాగా హీరోలు నాని, సిద్ధార్థ్ గళం విప్పడం మంత్రి వర్యులకు కోపం తెప్పించినట్లుంది. ఏ కిరాణా కొట్టు కలెక్షన్లు చూసి నాని మాట్లాడారో తనకు తెలియదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. హీరో సిద్ధార్థ చెన్నైలో ఉంటారు కాబట్టి అతని వ్యాఖ్యలు అక్కడి సీఎం స్టాలిన్ గురించి కావచ్చన్నారు. అతను పన్నులన్నీ కట్టేది చెన్నైలోనే కాబట్టి ఏపీ గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై ఎవరితోనైనా మాట్లాడటానికి సీఎం జగన్ సిద్ధమేనని అన్నారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని అన్నారు.
థియేటర్లు మూతపడటం స్వచ్ఛందంగా కాదని, నిబంధనలు పాటించని థియేటర్లను తామే సీజ్ చేశామని గుర్తు చేశారు. కొన్నిటికి లైసెన్సులు కూడా లేవన్నారు. ఇక టిక్కెట్ల రేట్ల విషయంలో కొత్తగా కమిటీని వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు. సమాచార శాఖ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి కూడా ఉంటారు. టికెట్ల ధరలపై ఈ కమిటీ పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. కాకపోతే ఈ కమిటీలో సినిమా వారికి మాత్రం చోటు దక్కలేదు. ఇందులో సినిమా వారికి కూడా చోటు కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.











