ఒకనాటి బాలీవుడ్ డ్రీమ్ బోయ్ రాజేష్ ఖన్నా జీవితానికి వెండి తెర రూపం రాబోతోంది. దీనికి దర్శకత్వం వహించేది ఎవరో కాదు ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరాఖాన్. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగానూ ఆమె సుపరిచితురాలు. ఓం శాంతి ఓం, తీస్ మార్ ఖాన్, హేపీ న్యూఇయర్ లాంటి చిత్రాలు ఆమె దర్శకత్వంలో రూపొందాయి. ఇప్పుడు ఆమెకు ఈ బయోపిక్ కు దర్శకత్వం వహించడం ఓ సవాలుగానే చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ లో తొలి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నానే అని చెప్పాలి. ఎందరో అభిమానులకు కలల రాకుమారుడు.
ఆయన ఖాతాలో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. ఎంతో బ్యాలెన్స్ తో దీనికి దర్శకత్వం చేయాల్సి ఉంటుంది. ఎవరు సూపర్ స్టార్ గా ఎదిగినా వారి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. ఈ పోటీ ప్రపంచంలో అంచెలంచెలుగా ఎదగాలి అంటే కేవలం ప్రతిభా పాటవాలు ఉంటేనే సరిపోదు. అతని వ్యక్తిత్వం కూడా పరిగణనలోకి వస్తుంది. రాజేష్ ఖన్నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండే అభిమానులు ఆ సమయంలో ఉన్నారు.
డార్క్ స్టార్ – ది లోన్‌లీనెస్ ఆఫ్ బీయింగ్ రాజేష్ ఖన్నా అనే పుస్తకం ఈ బయోపిక్ కు ఆధారం. గౌతమ్ చింతామణి రాసిన పుస్తకమిది. రాజేష్ ఖన్నా సినిమా అంటే అందులో షర్మిలా టాగోర్ పాత్ర లేకుండా ఎలా ఉంటుంది. వీరిద్దరి కలయికలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అతని జీవితంలో ఆమె పాత్ర ఎలాంటిదో కూడా దర్శకురాలు దీన్ని ఆవిష్కరించాల్సి ఉంటుంది. నిఖిల్ ద్వివేది ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో రాజేష్ ఖన్నా, షర్మిలా టాగోర్ పాత్రలను ఎవరు నటిస్తారో తెలియదు. ఇది భారీ ప్రాజెక్ట్ కాబట్టి పట్టాలెక్కడానికి కాస్త సమయం పట్టవచ్చు.