బీజేపీలో ఓ ఎమ్మెల్సీ సీటు చిచ్చుపెడుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ కేటాయించాలని నిర్ణయించడాన్ని పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఏళ్ళ తరబడి పార్టీకోసం పనిచేస్తున్న నేతలంతా ఏకమై తమలో ఎరికైనా టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ టికెట్ బీజేపీలో అంతర్గతంగా రచ్చ చేస్తోంది . పార్టీలో పనిచేసే పలువురు ఏబీవీపి నుండి వచ్చిన నేతలు ఈ టికెట్ ఆశించారు. ప్రస్తుతం వారంతా పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నవారే. పార్టీ పదవులను సైతం అనుభవిస్తున్నవారే. అయితే ఎమ్మెల్సీ స్థానం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తమకే టికెట్ కేటాయించాలంటూ పార్టీకి చెబుతూ వస్తున్నారు . ఇన్నాళ్ళు ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ టికెట్ తనకే కేటాయించాలంటూ అధిష్టానం వద్ద ఫైరవీలు కూడా చేశారు. జాతీయ నాయకత్వంతో సైతం చెప్పించుకునేందుకు ఎవరి దారిలో వారు ప్రయత్నం చేసారన్న గుసగుసలు వినిపించాయి. అయితే ఈ అంశం రాష్ట్ర నాయకత్వం చేతిలో ఉందంటూ జాతీయ నాయకులు సూచన ప్రాయంగా చెప్పడంతో ఇక్కడ ఒత్తిడి తేవడం మొదలు పెట్టినట్లు వినికిడి.
అన్ని లెక్కలు వేసుకునే..
రాష్ట్ర నాయకత్వం మాత్రం ఈ టికెట్‌ను ఇతర పార్టీ నుండి వచ్చిన సీనియర్ నేత మాజీ మంత్రి పెద్ది రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్టు టాక్ నడుస్తోంది. అనేక మంది పార్టీలో చేరినా పెద్దిరెడ్డికే టికెట్ ఇవ్వడం వెనక ఓ లెక్క ఉందని బీజేపీ పెద్దలు అంటున్నారట . గతంలో ఆయన టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడంతో పాటు స్వతహాగా ఆయనకు ఉన్న కేడర్ కొంత ప్లస్ అవుతుందని.. మరో వైపు పార్టీ సీనియర్ నేత గరికపాటి అండదండలు ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్. ఖర్చుకు వెనకాడకుండా ఎన్నికల్లో పోటీకి దిగుతారన్న భావనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు కమలనాథుల్లో టాక్ . అంతే కాకుండా టీఆర్ఎస్ లాంటి బలమైన పార్టీని ఎదుర్కునేందుకు పార్టీలో ఏళ్ళ తరబడి పనిచేయడం కాదు , ఖర్చులో కూడా వెనకాడకుండా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం అన్ని లెక్కలు వేసుకుని ఆయన పేరును నేడో రేపో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు కొంతమంది బీజేపీ లీడర్లు.
అధిష్టానంపై ఒత్తిడి
దీంతో టికెట్ ఆశించిన పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. పార్టీలో దశాబ్దాల తరబడి పనిచేస్తున్న తమను కాదని వేరేవారికి టికెట్ కేటాయించడం సరైంది కాదని వాదిస్తున్నారు. ఇన్నాళ్ళు ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకున్న నేతలు ఇప్పుడు ఒక్కటై పోరాటం చేస్తున్నారు. అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీలో పనిచేసిన వారికే టికెట్ కేటాయించాలి గాని బయట నుండి వచ్చిన వారికి టికెట్ కేటాయించడం ఏంటంటూ అదిష్టానం వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలో ఎవరికి టికెట్ కేటాయించినా కలిసి పనిచేస్తామని చెబుతున్నారు. పెద్దిరెడ్డికి టికెట్ ఇచ్చినా పనిచేయాల్సింది తామే కదా అంటూ వారు వాదనలు వినిపిస్తున్నారు..
కొత్త , పాత నేతల మధ్య జరుగుతున్న ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో.. అభ్యర్థి గెలుపు ఎవరి వల్ల సాధ్యమవుతుందో .. అధిష్టానం చూపు ఎవరి వైపో వేచిచూడాలి.











