గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు దగ్గరపడుతోంది. రిజర్వేషన్ల కొనసాగింపునకు సర్కారు లైన్ క్లియర్ చేసింది. అంతలోనే కార్పోరేటర్ల ఆశలకు భారీ వర్షాలు గండికొట్టాయి. భారీ వర్షాలతో భాగ్యనగరంలో నివాసం నరకంగా మారింది. వరద బురద నుంచి ఇంకా కోలుకోలేదు. కాలనీల్లో పర్యటించే నేతలకు జనం నుంచి నిరసలు వెల్లువెత్తుతున్నాయి. కార్పోరేటర్లను, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. వరద పాపం ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. బాధితులకు సమాధానాలు చెప్పలేక నేతలు కొన్నిచోట్ల వెనుదిరుగుతున్నారు.
పలు ప్రాంతాలు అతలాకుతలం
చెరువులకు గండ్లు పడటంతో నగరంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రాజేంద్రనగర్, చంద్రాయణగుట్ట, బహుదూర్‌పురా, చార్మినార్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, అంబర్‌పేట, ఉప్పల్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వేలాది కాలనీలు కొన్ని గంటల పాటు నీళ్లలోనే ఉన్నాయి. బాధితులకు సహాయ కార్యక్రమాలు అందడంలో ఆలస్యం కావడంతో జనాలు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణాలు జరిగే సమయంలో దగ్గరుండే కార్పోరేటర్లు.. భవనాలు మునిగితే మాత్రం కనిపించలేదని చాలా చోట్ల నేతలపై తిరగబడ్డారు.
భారీ వర్షాలతో ఆశలకు గండి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గత ఎన్నికల్లో 99 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ సారి అదే ఊపులో మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న తరుణంలో భారీ వర్షంతో కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది. కార్పొరేటర్ల రిజర్వేషన్లు కొనసాగించడానికి ప్రభుత్వం చట్టసవరణ కూడా చేసింది. కార్పోరేటర్లంతా సంబరాలు చేసుకున్నారు. అంతలోనే ఈ భారీ వర్షాలు వారి ఆశలకు గండికొట్టాయి. అయితే ఇప్పట్లో ఎన్నికలు రావద్దని వారు దేవుళ్లను మొక్కుకుంటున్నారు. అంతా సర్ధుకున్నాక ఎన్నికలకు ప్లాన్ చేయాలని పార్టీ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారు.