తెలుగుదేశం పార్టీలో మూడో తరం జోరు మొదలుకాబోతుందా.! యువనేత నారా లోకేష్‌కు ప్రమోషన్ లభించనుందా..! అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పుడు లోకేష్‌కు కీలకమైన పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పార్టీలో ఊపందుకుంది. లోకేష్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలనే డిమాండ్ నేతలు, కార్యకర్తల నుంచి బలంగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఈ డిమాండ్ వినిపిస్తోంది. ఐతే ఇప్పుడు మహానాడు వేడుక రావడంతో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు.
ఇప్పటికే లోకేష్ తనను తాను నిరూపించుకున్నాడు. 2014 – 19 మధ్య ఐటీ మంత్రిగా, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఎన్నో అవార్డులు సాధించారు. ఇక 2019లో పార్టీ ఓటమి తర్వాత లోకేష్ మరింత రాటు దేలారు. అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ..తానెంటో నిరూపించుకున్నారు. పార్టీ కష్టకాలంలో అన్నీ తానై ముందు నడిచారు. తండ్రి చంద్రబాబును జగన్ సర్కార్ కుట్రలతో జైల్లో పెట్టినా వెనక్కి తగ్గలేదు. యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి పార్టీ అఖండ విజయానికి పాటు పడ్డారు. జగన్ సర్కార్ టీడీపీ కార్యకర్తలను వేధిస్తే అండగా నిలిచారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. అటు పాలన, ఇటు పార్టీ బాధ్యతలను సరిసమానంగా మోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌ను నియమించాలన్న డిమాండ్ జోరందుకుంది.
ఇదే అంశంపై మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. రాబోయే 25 ఏళ్లు టీడీపీని నడపాలంటే యువతకు పగ్గాలు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. యువతలో లోకేష్‌కు అత్యంత ఆదరణ ఉందన్నారు. వైసీపీ హయాంలో అన్ని విధాలుగా విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన తలమునకలై ఉన్నందున లోకేశ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. పార్టీ, ప్రభుత్వం పనులు ఒక్కరే చూసుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతోనూ చెప్తామన్నారు.
ఇక అసెంబ్లీలో చీఫ్ విప్ GV ఆంజనేయులు సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీని మరో 40 సంవత్సరాల పాటు యువశక్తితో నింపి, ‘విజన్ 2047’ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు ఆంజనేయులు. లోకేశ్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై, నూటికి నూరు శాతం సీట్లు సాధించే దిశగా ఎన్డీయే కూటమి ముందుకు సాగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి యువ నాయకత్వం అవసరమని, లోకేశ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించి కేడర్‌లో ఉత్సాహాన్ని నింపాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు.











