‘మీరు బాబ్రీ మసీదు శంకుస్థాపనకు కూడా హాజరౌతారా?’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని ఒక టీవీ ఛానెల్ విలేకరి ప్రశ్నించారు. ‘యోగి ఆదిత్యనాధ్ ఏం చెప్పారు’ అనేది ఇప్పుడంత ముఖ్యం కాదు.
ఇదే ప్రశ్నను ప్రధాని నరేంద్రమోడీని అడిగి ఉంటే ఏం చెప్పేవారు? అనేది ఊహకు అందడం లేదు. మోడీ బహుశా తన ఇదివరకటి ట్వీట్ల లాగే.. లోకమంతా వేనోళ్ల పొగుడుతూ.. తన కీర్తిని పెంచడానికి వీలుగా.. అందమైన మాటలను అల్లి.. అంత సులువుగా బోధపడని ఒక అద్భుతమైన జవాబు చెప్పి ఉండేవారు.
పాపం…. యోగి ఆదిత్యనాధ్.. అంత లౌక్యం లేనివాడు. ‘ముఖ్యమంత్రిగా నన్ను పిలిస్తే ఏ మతమైనా, ఏ విశ్వాసమైనా నాకు ఇబ్బంది లేదు. ఒక యోగిగా పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్లను’ అని తెగేసి చెప్పేశారు. అదే లౌక్యశీలి అయిన ఇతర హిందూత్వ నాయకుడు ఎవరైనా అయితే బహుశా ‘అలాంటి మహత్కార్యం నేను హాజరుకాకుండా ఎలా జరుగుతుందని అనుకుంటున్నారు?’ అంటూ జవాబుగా ఒక ప్రశ్నను సంధించి వేడుక చూసేవారు. తీరా ఆ సందర్భం వచ్చే సమయానికి ఈ జవాబు ఎవరికి గుర్తుంటుంది గనుక?
యోగి ఆదిత్యనాధ్ జవాబు మీద ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. విపక్ష నాయకులు.. ఆయన ఒక మత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతున్నారు. నిత్యం కాషాయంలో ఉండే ఈ స్వామి, ఇన్నాళ్లలో ఎప్పుడూ కూడా మతం నుంచి తనను వేరు చూసుకుని.. వ్యవహరించినది లేదు. కాకపోతే విపక్షాలకు ఈ మాటలు కొత్తగా మరొకసారి ఆ అంశాన్ని ప్రస్తావించడానికి ఉపయోగపడుతున్నాయంతే.
యోగి సమాధానం కోణంలోంచి- మనం వర్తమాన ప్రారబ్ధాన్ని గురించి చర్చించుకోవాలి. ఈ దేశంలో ఎవరు ఏ మతంతో ఊరేగినా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ సాక్షాత్తూ ప్రభుత్వం అంటేనే తాముగా మారిన తర్వాత.. తమనుంచి మతాన్ని మర్చిపోని ధోరణులు మనకు వింతగా అనిపించకపోవచ్చు కానీ.. దుర్మార్గమైనవి! చిన్నస్థాయి రాజకీయాల్లో.. మునిసిపల్ ఛైర్మనో, ఎమ్మెల్యేనో, ఎంపీనో కావడానికి అచ్చంగా కులాలను, మతాలను సిగ్గులేకుండా వాడుకునే బాపతు ప్రజానాయకులు మనదేశంలో లక్షల్లో ఉంటారు. కానీ చట్టాలను రూపొందించే, నిర్దేశించే బాధ్యతగల ప్రభుత్వం స్థాయికి ఎదిగిన నాయకులు.. తమ మూలాల్లోని, పునాదుల్లోని- రాగద్వేషాలను విడిచిపెట్టకపోతే సమాజానికి చేటు జరుగుతుంది. పదవిలోకి రాగానే తమ మతాలు, కులాలు భ్రష్టత్వం చెందినట్టే అనుకునే వారు మాత్రమే సమాజానికి కావాలి. వాటి రంగు, రుచి, వాసన లను విసర్జించడం తెలిశాకే.. గద్దె ఎక్కాలి. ఇదంతా ఆచరణ సాధ్యం కానీ ఆదర్శాంలాగా, ఆశలాగా కనిపిస్తుంది.
కానీ.. మన నేతలకు తెలివిడి రావడానికి.. ఆచరించకపోయినా… ఆ స్ఫురణ రావడానికి ఒక భగవద్గీతా వాక్యాన్ని గుర్తు చేస్తాను…
‘సర్వధర్మాన్ పరిత్యజ్య.. మామేకం శరణం వ్రజ’ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అన్నిటినీ విడిచిపెట్టి నన్ను నమ్ముకో అన్నాడు. ‘అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః’ అని కూడా చెప్పాడు. అలా వచ్చినప్పుడు మాత్రమే నేను నీ పాపాలన్నిటినీ తుడిచేసి మోక్షం ప్రసాదిస్తాను అని కృష్ణుడు అన్నాడు. మోక్షం, పాపాలు లాంటి పదాలను పక్కన పెట్టేద్దాం. ‘అన్నీ వదిలించుకుని రా.. నీ సంగతి నేను చూసుకుంటాను’ అనేదే దీని భావం అని సింపుల్‌గా చెప్పుకోవచ్చు.
అప్పట్లో ద్వాపర యుగం, అంటే- కొన్ని వేల ఏళ్ల పాతదైన నీతి అది. ఇవాళ్టి నాయకులకు, కొన్ని సవరణలతో అందవలసిన స్ఫూర్తి. అన్ని వర్గాలకు సమష్టిగా నాయకుడిగా గుర్తుండిపోవాలని అనుకునే వ్యక్తి.. సర్వధర్మాలను పాటించేవాడిగా, సమంగా గౌరవించే వాడిగా ఎదగాలి. గీతాకారుడు చెప్పిన నిస్సంగత్వాన్ని అంతే సమానంగా అన్ని ధర్మాల పట్ల చూపించాలి. మాటల్లో ప్రకటించకపోయినా ఆలోచనల్లో ఇలాంటి నాయకుడిని కోరుకునే ప్రజల అభిరుచిని.. నవతరం రాజకీయ వైతాళికులుగా పరిగణన కోరుకుంటున్న నరేంద్రమోడీ లాంటి నాయకులు, వారి సొంత ధర్మ ప్రవచించే.. ఇలాంటి రాజనీతిని అర్థం చేసుకుంటారా?
.. సురేష్ పిళ్లె