కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమ నాయకత్వానికి నో చెప్పారు. తాను ఉద్యమ బాధ్యతలు స్వీకరించబోనని స్పష్టం చేశారు. కాపు ఉద్యమానికి ముద్రగడ నాయకత్వం వహించాలని తీర్మానం చేసిన 13 జిల్లాల కాపు నేతలు కిర్లంపూడిలోని ఆయన ఇంటికి వెళ్లారు. కాపు ఉద్యమానికి దూరం కావద్దని నాయకత్వం వహించాలని ముద్రగడని కోరారు. ఆ బాధ్యతలకు నో చెప్పిన ముద్రగడ ఓ లేఖను వారికి అందచేశారు.ఆ బాధ్యతలు స్వీకరించలేనని అందుకు క్షమాపణలు కోరుతున్నానని ముద్రగడ ఆ లేఖలో తెలిపారు.
వ్యక్తిగతంగా మీ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా తాను తప్పక వస్తానని దయచేసి ఇబ్బంది పెట్టవద్దని ఆ నాయకులను కోరారు. రాష్ట్రంలో రెండు బలమైన సామాజిక వర్గాలు టీడీపీ, వైసీపీ వెంట నడుస్తున్నాయి. వైసీపీతో రెడ్ల సామాజిక వర్గం, టీడీపీ వెంట కమ్మ సామాజిక వర్గం నడుస్తూ అధికారం చెలాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాపులు కూడా అధికారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు నాయకత్వం వహించాలని జేఏసి నాయకులు ఆయనను కోరారు. నాయకత్వ బాధ్యతలకు ముద్రగడ నో చెప్పడంతో ఆ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే ఆసక్తి నెలకొంది. ఇటీవలే కాపు ఉద్యమ బాధ్యతల నుంచి తప్పుకుంటూ ముద్రగడ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.











