‘భారత్‌లో పుట్టుంటే భారత్‌కు ఆడేవాడిని.. శ్రీలంక తమిళుడిగా పుట్టడం నా తప్పా?’ అని ప్రశ్నిస్తున్నారు శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్. ఆయన జీవితం ఆధారంగా ప్రస్తుతం భారత్‌లో ‘800‘ పేరుతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మురళీధరన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు.అయితే కొన్ని తమిళ సంఘాలు, సంస్థలు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక జట్టుకు ఆడి మురళీధరన్ తమిళ జాతికి ద్రోహం చేశారని అవి ప్రచారం చేస్తున్నాయి. మురళీధరన్ పాత్రలో నటిస్తున్నందుకు విజయ్ సేతుపతిపై కూడా మండిపడుతున్నాయి.ఈ వ్యవహారంపై మురళీధరన్ తాజాగా స్పందించారు. తన వాదనను జనానికి వినిపించాల్సిన అవసరం ఉందని, అందుకే తాను ఈ విషయం గురించి మాట్లాడుతున్నానంటున్నారాయన.
మురళీధరన్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
* నా జీవిత కథను సినిమాగా తీస్తామని నిర్మాణ సంస్థ ముందుకొచ్చినప్పుడు మొదట నేను తటపటాయించా. కానీ ఆ విషయం గురించి ఆలోచించాక నేను సాధించిన ఘనతలు నా ఒక్కడివే కాదనిపించింది. నా తల్లిదండ్రుల సహకారం ఇందులో ఎంతో ఉంది. నా ఉపాధ్యాయులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు అంతా నా వెనుకున్నారు. సినిమాతో వాళ్లకు గుర్తింపు వచ్చినట్లవుతుందని అనిపించిం ఒప్పుకున్నా.
* శ్రీలంకలో టీ తోటల్లో కూలీలుగా నా తల్లిదండ్రుల జీవితం మొదలైంది. టీ తోటల్లో పనిచేస్తున్న భారత సంతతి కూలీలే 30 ఏళ్లపాటు సాగిన సుదీర్ఘ యుద్ధంలో తొలి బాధితులు కూడా.
* 1970 నుంచి తమిళలకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు, జేవీపీ ఆందోళనల తర్వాత జరిగిన హింస, బాంబు పేలుళ్లు వంటి వాటి ప్రభావం నా చిన్నప్పటి నుంచి మా అందరి మీదా ఉంది.
* నా ఏడో ఏట మా నాన్న చనిపోయారు.. మా బంధువులు చనిపోయారు. జీవితంలో ఎన్నోసార్లు మేం రోడ్డునపడ్డాం. యుద్ధం వల్ల ఓ మనిషిని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. శ్రీలంకలో 30 ఏళ్లకుపైగా యుద్ధం సాగింది. దాంతోపాటే నా జీవిత ప్రయాణం కొనసాగింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నేను క్రికెట్ జట్టులో ఎలా చేరగలిగాను? ఎలా చరిత్ర సృష్టించగలిగాను?
* ఇప్పటివరకూ జీవితంలో నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. నా వ్యక్తిగత జీవితం గురించి, క్రికెట్ జీవితం గురించి చాలా మంది ఎన్నోమాటలన్నారు. ఇప్పుడు ‘800’ చిత్రం కూడా నా జీవితం గురించే మాట్లాడుతోంది కాబట్టి, దీనిపైనా విమర్శలు వస్తున్నాయి. నేను కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. అదేంటంటే ఈ సినిమాని కొందరు వివిధ కారణాలతో రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు. నేను ఇదివరకు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చూపిస్తున్నారు.
* ఉదాహరణకు 2009 నాకు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని గత ఏడాది అన్నాను. ‘శ్రీలంకలో తమిళులను పెద్ద సంఖ్యలో చంపిన ఏడాది మురళీధరన్‌కు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరమట’ అని కొందరు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు.
* దయచేసి ఓ సామాన్యుడి కోణంలో ఆలోచించండి. దేశంలో యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు, మరుసటి రోజు మళ్లీ నా స్నేహితులు ప్రాణాలతో వస్తారో, లేదో అన్న భయం ఉండేది. ఇంతటి ఆందోళనకర పరిస్థితుల్లో 2009లో యుద్ధం ముగిసింది. ఓ సామాన్యుడిగా సురక్షితంగా ఉన్నామన్న భావన నాకు కలిగింది. పదేళ్లుగా ఏ పక్షం వైపూ మరణాలు లేవు. అందుకే 2009ని నేను అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అన్నాను. అమయాకులను చంపడాన్ని నేను ఎప్పుడూ సమర్థించలేదు. సమర్థించబోను కూడా.
* ఇక నేను స్కూల్ స్థాయి నుంచి తమిళ మీడియంలోనే చదువుకున్నా. నాకు తమిళం తెలియదనడం తప్పు. తమిళ విద్యార్థులకు ఆత్మన్యూనతా భావం ఉంటుందని నేను అన్నట్లు కొందరు చెబుతున్నారు. శ్రీలంకలో సింహళీయుల మధ్యలో మేం మైనార్టీలుగా బతికాం. సహజంగానే జనాలకు ఆత్మన్యూనతా భావం ఉంటుంది. నాకు కూడా ఉంది. నా తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచించేవారు.
* క్రికెట్ పట్ల నాకున్న ప్రేమ చాలా ఎక్కువ. అందుకే స్కూల్ క్రికెట్ జట్టులో చేరా. ఆత్మస్థైర్యంతోనే నేను జట్టులో ఆడా. నా నైపుణ్యంతో జట్టుకు అత్యంత కీలకమైన ఆటగాడిగా మారా.’మీ ఆత్మన్యూనత భావాన్ని వదిలించుకోండి. నైపుణ్యాన్ని నమ్ముకుని, ప్రయత్నిస్తూనే ఉండండి’ అని ఇదివరకు నేను అందుకే అన్నా.
* సింహళీయులైనా, టీ తోటల్లోని తమిళులైనా, ఈలం తమిళులైనా నేను అందరినీ ఎప్పుడూ సమానంగానే చూశా. టీ తోటల్లో నుంచి వచ్చిన తమిళుడైనప్పటికీ, నేను మా వర్గం వారికన్నా ఈలం తమిళులకే ఎక్కువ చేశా. నేను చేసిన విషయాలను చెప్పుకోవడం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ చెప్పక తప్పని పరిస్థితి తెస్తున్నారు.
* 2002లో ఐరాస ఆహార విభాగానికి నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా. ఎల్‌టీటీఈ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలల వరకూ ఆ కార్యక్రమాలను తీసుకువెళ్లా. సునామీ వచ్చినప్పుడు ఎంతోమంది ఈలం తమిళలకు సాయం చేశా. నేను చేసిన సేవ ఏంటో ప్రజలకు బాగా తెలుసు.
* యుద్ధం ముగిసిన తర్వాత నేను ఏర్పాటు చేసిన ‘ఫౌండేషన్ ఆఫ్ గుడ్‌నెస్’ దాతృత్వ సంస్థ ద్వారా చాలా మంది ఈలం తమిళులకు సాయపడుతున్నా. ఈలం తమిళులుండే ప్రాంతాల్లో నా సంస్థ శాఖలున్నాయి. విద్య, వైద్యం, మహిళల అభ్యున్నతి వంటి వాటి కోసం కృషి చేస్తున్నా. ప్రజల మధ్య సామరస్యతను ప్రోత్సహించేందుకు ఏటా ‘మురళీ హార్మొనీ కప్’ పేరుతో క్రికెట్ టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నా.
* శ్రీలంక క్రికెట్ జట్టు తరఫున ఆడినందుకు కొందరు నాపై చెడు అభిప్రాయంతో ఉన్నారు. ఒక వేళ భారత్‌లో పుట్టుంటే, భారత జట్టులో చేరాలని ప్రయత్నించేవాడిని. శ్రీలంకలో తమిళుడిగా పుట్టడం నేను చేసిన తప్పా?
* ఈ అంశాలన్నింటినీ కొందరు విస్మరిస్తారు. ఇంకొందరు రాజకీయ కారణాలతో నాకు వ్యతిరేకంగా విషయాలను వక్రీకరిస్తున్నారు. తమిళ సమాజానికి నేను వ్యతిరేకమన్నట్లు చిత్రీకరిస్తున్నారు.
* నేను ఇంతచెప్పినా నన్ను వ్యతిరేకించేవారు మారరని నాకు తెలుసు. నాకు వ్యతిరేకంగా చాలా తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వాటిపై నా వైపు వాదన ఏంటో తటస్థంగా ఉండేవారికీ, సామాన్య ప్రజలకూ తెలియజేయాలనుకున్నా అందుకే ఈరోజిలిలా స్పందించాల్సి వచ్చింది.