తెలుగు తెరపై హాస్యనటులు చాలామందే కనిపిస్తారు. కస్తూరి శివరావు దగ్గర నుంచి వెన్నెల కిషోర్ వరకూ ఎంతోమంది హాస్యనటులు తెలుగు ప్రేక్షకులకు కితకితలు పెడుతూనే ఉన్నారు. ఇక హాస్యనటిగా ప్రేక్షకులను ప్రభావితం చేసినవారిని చూస్తే ఆ జాబితాలో ముగ్గురంటే ముగ్గురే కనిపిస్తారు. రేలంగి జోడీగా గిరిజ .. రాజబాబు జోడిగా రమాప్రభ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అప్పట్లో తమ సినిమాల్లో ఈ జోడీ సాంగ్ ఒక్కటైనా ఉండాలని దర్శక నిర్మాతలు ప్రత్యేకంగా పెట్టించేవారంటే వాళ్లకి గల క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
హాస్యనటిగా చక్రం తిప్పుతూ అనేక సినిమాలు చేసిన గిరిజ, ఖరీదైన బంగ్లాలలో ఉంటూ .. ఖరీదైన కార్లలో తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. కానీ చివరిదశలో కట్టుకోవడానికి సరైన చీరలు కూడా లేక, తనకి పరిచయమున్నవారి దగ్గర నుంచి అడిగి తీసుకునేవారట. ఆమె అంతటి ఇబ్బందులు పడటానికి కారణం వైవాహిక జీవితంలో దెబ్బతినడమేనని అంటారు. ఇక రమాప్రభ పరిస్థితికి ఇందుకు కాస్త భిన్నంగా కనిపిస్తుందంతే. వందల సినిమాలు చేసిన హాస్యనటిగా ఒక వెలుగు వెలిగిన రమాప్రభ కూడా వైవాహిక జీవితంలో విఫలం కావడం బాధాకరం. ఎన్నో కోట్లు కూడబెట్టినా కూడా, కొన్ని కారణాలవలన కోల్పోయానని ఆమె చెబుతూ ఉంటారు. ఒకప్పుడు తాను అనుభవించిన జీవితంతో చూసుకుంటే, ఇప్పుడు ఆమె చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు.
ఇక శ్రీలక్ష్మీ విషయానికొస్తే ఆర్ధికంగా ఆమె ఇబ్బందులు పడటానికి కారణం .. ఆమె అమాయకత్వమేనని అంటారు. హాస్యంలో ఒక నటి ఇంతటి వైవిధ్యభరితమైన పాత్రలను చేయగలదా? అనిపించే స్థాయిలో శ్రీలక్ష్మి మెప్పించారు. తెలుగులో ఒకప్పటి హీరో ‘అమర్ నాథ్’ కూతురే శ్రీలక్ష్మి. ఆయన నటించిన ‘అమర సందేశం’ అప్పటికీ .. ఇప్పటికీ ఒక ఆణిముత్యమే. ఆయన కూతురైన శ్రీలక్ష్మీ .. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే నటన దిశగా అడుగులు వేశారు. అమర్ నాథ్ కి అవకాశాలు తగ్గడం .. సొంత బ్యానర్లో చేసిన సినిమాలు ఆడకపోవడం వలన ఆ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులో పడింది.
తప్పనిసరి పరిస్థితుల్లోనే శ్రీలక్ష్మి సినిమాల్లోకి రావలసి వచ్చింది. హాస్యనటిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హాస్యాన్ని పండించడంలో ఆమె ఈజ్ మరెవరిలోను కనిపించదు. రాళ్లపల్లి .. సుత్తివేలు .. సుత్తి వీరభద్రరావు .. బ్రహ్మానందం కాంబినేషన్లో పలు సినిమాలు చేసిన శ్రీలక్ష్మీ, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అప్పట్లో అవకాశం రావడమే అదృష్టంగా భావించడం వలన .. గట్టిగా రెమ్యునరేషన్ అడిగితే మరోసారి అవకాశం ఇవ్వరనే భయం కారణంగా ఆమె పారితోషికం పెంచలేకపోయారు .. అడిగింది పూర్తిగా అందుకోలేకపోయారు.
మంచితనమని శ్రీలక్ష్మీ అనుకుంటే .. అది ఆమె అమాయకత్వంగా భావించిన నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టేవారట. బయట తనకి ఎంతటి క్రేజ్ ఉందో ఆమె తెలుసుకోకపోవడం .. ఆ స్థాయికి తగినట్టుగా పారితోషికాన్ని డిమాండ్ చేయకపోవడం .. కొంత ముందుచూపు కూడా లేకపోవడం ఆమె విషయంలో కనిపిస్తుంది. జీవితం పట్ల భరోసా లేకపోవడం వల్లనే ఆమె అవకాశాల విషయంలో భయపడుతూ వచ్చారు. ఆ కారణంగానే ఇప్పటికీ భరోసా అనేది లేకుండా పోయింది. అమాయకత్వం .. మొహమాటం .. అభద్రతా భావం కారణంగానే ఆమె పెద్దగా సంపాదించుకోలేదనీ, ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లనే సీరియల్స్ లోను నటిస్తున్నారని చెప్పుకుంటున్నారు. తెరపై గలగలా మాట్లాడుతూ నవ్వించే శ్రీలక్ష్మీ, కన్నీళ్లే తోడుగా కెరియర్ ను కొనసాగిస్తూ ఉండటం బాధాకరం.
Must Read ;- బాబూ మోహన్ నన్ను బాగా టెన్షన్ పెట్టేవాడు.. !











