పురాణాలు, ఇతిహాసాలు మన భారతీయ సంస్కృతిలో విడదీయరాని భాగం. కొంత మంది పురాణాలూ కల్పితాలు అని అంటుంటారు . మరి కొంతమంది పౌరాణిక గాథలు అన్ని నిజంగా జరిగినవే అని చారిత్రక ఆధారాలు చూపిస్తుంటారు. అయోధ్య, రామసేతు, లంకలో రావణుడి ఎయిర్ పోర్టు లాంటివి ఉదాహరణలుగా చెబుతుంటారు . ముఖ్యంగా యువతరం మతం, భక్తి , పురాణాలూ.. ఇలాంటి అంశాల మీద భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు.
ఈ నేపథ్యంలో అమిష్ త్రిపాఠి అనే ఇండియన్ ఇంగ్లీష్ రైటర్ పురాణాలను సాధారణ నవలలుగా, దేవుళ్ళని కూడా మామూలు వ్యక్తుల్లా వర్ణిస్తూ పాపులర్ నవలలు రాశాడు.
అవి యువతరాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాదాపు 60 ఏళ్ క్రితం రాహుల్ సాంకృత్యాయన్ అనే రచయిత బౌద్ధ మతాన్ని అనుసరించేవారు. అందుకని హిందూ మతాన్ని విమర్శిస్తూ ఆయన కొన్ని చారిత్రక నవలలు రాశారు.
కొన్నేళ్ల క్రితం రంగనాయకమ్మ అనే ఒక రచయిత్రి ‘రామాయణ విష వృక్షం’రాశారు. ఇక్కడ ఒక్క చిన్న లాజిక్ఏ మిటంటే రామాయణం చరిత్ర అయితే మనకి నచ్చినా నచ్చకపోయినా మార్చుకోవడం కుదరదు.
ఒక వేళ ఒక కవి కల్పన అయితే అతని ఊహలను మార్చడానికి మనం ఎవరం ? షేక్ స్పియర్ ‘ రోమియో- జూలియట్’ ట్రాజెడీ ఎండింగ్ నచ్చక చరిత్రలో ఎవరైనా దాన్ని తిరుగరాశారా? ఇప్పుడు మోడరన్ మైథలాజికల్ రైటర్స్ విషయానికి వద్దాం. అమిష్ త్రిపాఠి రాసిన పౌరాణిక నవలలకు యూత్ వెర్రెక్కిపోయారు
శివుడు తమకి ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాడని, తమలాంటి మామూలు మనిషిలా కనబడుతున్నాడని చెప్పడం ప్రారంభించారు .ఆనంద్ నీల కంఠన్ అనే మరో మళయాళ ఆంగ్ల రచయిత ఉన్నాడు. అతను రావణుడిని, దుర్యోధనుడిని హీరోల్లా చూపిస్తూ వారి పాయింట్ అఫ్ వ్యూ లో పురాణాలు తిరగరాశారు. అచ్చం చాలా ఏళ్ళ క్రితం ఎన్టీ రామారావు దుర్యోధనుడు, రావణాసురుడులను కథా నాయకుల్లా చూపించినట్లు. తమ తమ ప్రాంతీయ భాషలు సరిగా రాని భారతీయ యువతరం ఈ రచయితల కళ్ళతో, కలంతో పురాణాలను అర్ధం చేసుకుంటున్నారు .
ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛ వారిది. కానీ ఒక కథ ( పురాణం అనుకోకపోయినా పర్లేదు )ని తమ భావజాలంతో తిరగ రాయడం సమంజసమా ?

ఫ్రీ కంట్రీ అయిన అమెరికాలో చాలా ఏళ్ళ క్రితం మార్టిన్ స్కోర్సెజి అనే దర్శకుడు ‘ది లాస్ట్ తెంప్టేషన్ అఫ్ క్రీస్ట్’ అనే సినిమా తీస్తే అమెరికన్లు ఉలికి పడ్డారు. మార్టిన్ ఎన్నో సార్లు ఆస్కార్ కి నామినెట్ అయినా ఈ సినిమా కారణంగా అవార్డు రాకుండా చేశారు. చివరికి ” డిపార్టెడ్’ సినిమాకి ఇచ్చారు. ఇప్పుడు రియలిస్టిక్ పౌరాణిక సినిమాల విషయానికి వద్దాం. ప్రభాస్ ‘ఆదిపురుష్’సినిమా ప్రకటనలో ఎక్కడా రామాయణాన్ని తీస్తున్నట్లుగా చెప్పలేదు. కానీ రామాయణాన్ని పోలిన కథ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. మేలుహా ( అమిష్ త్రిపాఠి నవల ) తరహాలో కథ చెబుతారని కూడా మీడియాలో కథలు వస్తున్నాయి. అంటే ఓ జానపద చిత్రంలా తీసే అవకాశం ఉంది.
లోగడ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు కొంత మంది. అరవిందన్ అనే మలయాళ దర్శకుడు 1978-1979 లో ‘కాంచన సీత’ అనే మలయాళ సినిమా తీశారు. లవకుశ ఎపిసోడ్ ఆధారంగా తీసిన ఈ సినిమాలో రాముడిని ఓ గిరిజనుడిగా చూపించారు . ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ సినిమా షూటింగ్ చేశారు . సీత పాత్ర ఎక్కడా ఈ సినిమాలో కనిపించదు. ఓ గిరిజన ప్రాంత కథగా ఈ సినిమాని చూపించారు. అలాగే జి.వి. అయ్యర్ అనే దర్శకుడు ‘భగవద్గీత’ అనే సినిమాని సంస్కృతంలో తీశారు. టి. సుబ్బరామిరెడ్డి నిర్మాత, నీనా గుప్త ద్రౌపదిగా నటించింది. ఈ సినిమా కూడా కాస్ట్యూమ్స్ డ్రామాలా కాకుండా సహజంగా తీశారు.
‘ ఆదిపురుష్ ‘ కాంచన సీత లాగానో, భగవద్గీత లాగానో తీస్తారని మనం అనుకోము. కానీ రామాయణంలా కాకుండా, అమిష్ త్రిపాఠి నవలలా తీస్తే సామాన్య ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ఇంగ్లీష్ నవలలు చదివే బ్యాచ్ వేరు – వాళ్ళకి మతం మీద , దేవుడి మీద గౌరవం , భక్తి ఉండదు . కానీ సగటు ప్రేక్షకుడు వాడికి తెలిసిన కథ మారిస్తే ఒప్పుకోడు. ఆ మధ్య మణిరత్నం ‘విలన్’ అనే సినిమా తీసి రామాయణాన్ని సోషలైజ్ చేశారు. సీత రావణుడిని ఇష్ట పడిందని చూపిస్తే సినిమా ఏమైందో మనకి తెలుసు. ఆదిపురుష్ లో అలాంటి పొరపాట్లు ఉండకపోవచ్చు. కానీ మేలూహ అనుకుంటూ సామాన్య ప్రేక్షకులని దూరం చేసుకోకూడదని ఆశిద్దాం.











