హీరో గా నటించడం కన్నా, విలన్ గా విజృంభించడాన్నే వైవిధ్యంగా ఫీలవుతుంటారు చాలా మంది. యన్టీఆర్, యస్వీఆర్ లాంటి మహానటులు సైతం దుర్యోధన, రావణ పాత్రల్ని హీరోయిక్ గా ప్రజెంట్ చేసి ఆ పాత్రల మీద తమకున్న మమకారాన్ని చాటుకున్నారు. హీరో పాత్రకు కొన్ని పరిమితులుంటాయి. వాటికి కట్టబడే నటించాలి. విలన్ పాత్రకు అలాంటివేమీ ఉండవు. తమలోని యాక్టింగ్ టాలెంట్ ను అన్ లిమిటెడ్ గా ప్రదర్శించవచ్చు. అందుకే ఈ తరంలో కొందరు యంగ్ హీరోలకు.. ఫైట్స్, డాన్స్ చేసి చేసి బోర్ కొట్టిందేమో… ఇప్పుడు విలన్స్ గా టర్న్ అవుతున్నారు. అసలే విలన్స్ కొరత విపరీతంగా ఉన్న టాలీవుడ్ లో ఈ విధంగానైనా కొత్త విలన్స్ పుట్టుకొస్తూండడం నిజంగా మంచి పరిణామమే.
‘ఉప్పెన’లో విలన్ గా విజయ్ సేతుపతి
వైవిధ్యం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం తమిళ హీరో, ‘మక్కళ్ సెల్వన్’ అని పిలుచుకొనే విజయ్ సేతుపతి. లాంగ్వేజ్ , బాడీ లాంగ్వెజెస్ లో సైతం వైవిధ్యాన్ని ప్రదర్శించే అతడు .. ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు తెరమీద విలనిజాన్ని ప్రదర్శించడానికి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’లో వైవిధ్యమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ డెబ్యూ మూవీగా తెరకెక్కుతోన్న ఉప్పెన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. లాక్ డౌన్ వల్ల విడుదలను వాయిదా వేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
‘పోయిరావలె హస్తినకు’ లో విలన్ గా మంచువారబ్బాయి?
యంగ్ టైగర్ యన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలోని రెండో సినిమా అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ మంచి విజయంసాధించిన నేపథ్యంలో .. ఇప్పుడు ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి. ‘పోయిరావలె హస్తినకు’ అనే వెరైటీ టైటిల్ ను ఈ సినిమా కోసం రిజిస్టర్ చేశాడట త్రివిక్రమ్. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ కుమార్ విలన్ గా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎప్పటి నుంచో నెగెటివ్ రోల్స్ చేయాలని ఉందని చెబుతున్న మనోజ్ బాబు.. ఈ రకంగా తన కోరిక నెరవేర్చుకుంటున్నాడని చెప్పుకోవచ్చు. ఇందులోని మనోజ్ పాత్రని త్రివిక్రమ్ చాలా వెరైటీగా డిజైన్ చేశాడట.
‘పుష్ప’లో విలన్ గా నారా రోహిత్
బాణం సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. అందులోని అతడి నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర, సావిత్రి, రాజా చెయ్యివేస్తే, అప్పట్లో ఒకడుండేవాడు , శంకర, కథలో రాజకుమారి లాంటి సినిమాల్లో హీరోగా మంచి పెర్ఫార్మెన్ ఇచ్చినప్పటికీ…. ఆ సినిమాల ఫలితం తారుమారవడంతో.. రోహిత్ కెరీర్ డౌన్ ఫాల్ అయింది. అందుకే ఇప్పుడు నటన పరంగా రిఫ్రెష్ అవ్వాలనుకుంటున్నాడట. అనుకోవడమే తరువాయి.. మనోడికి అప్పుడే సుకుమార్ నుంచి విలన్ ఆఫర్ వచ్చిపడింది. అల్లు అర్జున్ తో సుక్కూ చేస్తున్న పుష్ప లో నారారోహిత్ ను విలన్ గా ప్రజెంట్ చేయబోతున్నాడట.
నిజానికి ఆ పాత్రను విజయ్ సేతుపతి చేయాల్సింది. కానీ అతడికి వేరే కమిట్ మెంట్స్ ఉండడంతో ‘పుష్ప’సినిమాకి నో చెప్పాడట. హీరో పాత్రనే వైవిధ్యంగా చేయడానికి తపించే నారా రోహిత్… సుక్కూ చేతిలో పడితే.. అతడి విలనిజం ఇంకెంత వెరైటీ ఉంటుందోనని చర్చించుకుంటున్నారు. మరి విలన్ గా రోహిత్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.
సో.. ప్రతినాయకులైన మన నాయకులు ఏ రేంజ్ లో విలనిజాన్ని పండిస్తారో. . వెయిట్ అండ్ సీ.