నాగ నరేశ్ ఐఐటీ మద్రాస్ నుంచి పట్టా అందుకొని బెంగళూరులోని గూగుల్ కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరిన 21 సంవత్సరాల కుర్రాడు. ఇందులో వింతేముంది రోజుకి ఎంతో మంది ఐఐటీ లో పట్టా అందుకుని ఉద్యోగాల్లో చేరతారు అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ నరేశ్ ప్రత్యేకమే.. అవును నరేశ్ ఇక్కడ నిజంగానే ప్రత్యేకం. ఎందుకంటే నరేశ్ కు రెండు కాళ్లు లేవు. అంతేకాకుండా అతని తల్లిదండ్రులు ఇద్దరు కూడా నిరాక్షరాస్యులు.
నరేశ్ తన ఎలక్ట్రిక్ ఛైర్ లో కూర్చునే ఇప్పుడు గూగుల్ సంస్థలో విధులకు హాజరవుతున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఎంతో ఆత్మ విశ్వాసంగా ఉండే నరేశ్ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు..‘దేవుడు ఎప్పుడూ కూడా నాకోసం ప్రత్యేకం ప్రణాళికలు అమలు చేస్తూ ఉంటాడు. అందుకే నేను ఎప్పుడూ అదృష్టవంతునిగా భావిస్తూ ఉంటాను’. అని తెలుపుతున్న నరేశ్ వెనుక పెద్ద కథే ఉంది.
నా బాల్యంలోని మొదటి ఏడు సంవత్సరాలు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి తీరాన ఉన్న తిపర్రు అనే గ్రామంలో సాగింది. తండ్రి ప్రసాద్ లారీ డ్రైవర్, తల్లి కుమారి ఇంట్లోనే ఉండేవారు. తల్లిదండ్రులు ఇద్దరు చదువుకోకపోయినప్పటికీ తనకి, తన అక్కకి చదువు విలువ చెప్పారు. నరేశ్ తండ్రికి చదువు రాకపోయినప్పటికీ తనకి చిన్నతనంలో తన పుస్తకాలలోని ప్రశ్నలు అడిగేవారు. కానీ అప్పుడు మాకు తెలియదు అసలు ఆయనకు చదవడం, రాయడం రావు అన్న విషయాలు.
చిన్నప్పుడు నేను చాలా అల్లరి పనులు చేసేవాడిని. మధ్యాహ్నం సమయంలో ఎవరన్న పడుకుంటే వారు లేచే వరకు గోల చేస్తూనే ఉండేవాడిని. వాళ్లు ఎప్పుడైతే తిట్లు ప్రారంభించేవారో వెంటనే నేను పరిగెత్తుకుంటూ పొలాల్లోకి పారిపోయేవాడిని. నాకు చిన్నప్పటి విషయాలు ఇప్పటికీ చాలా బాగా గుర్తు ఉన్నాయి. మా బంధువు ఒకరు నన్ను గేదె మీద ఎక్కించేవారు. ముళ్లున్న చెట్లు నుంచి పళ్లను కోయడం అన్ని కూడా నాకు ఇప్పటికీ బాగా గుర్తు.
అది మరచిపోలేని రోజు
1993 జనవరి 11 నా జీవితంలో మరచిపోలేని రోజు. మాకు సంక్రాంత సెలవులు కావడంతో మేము మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి బయల్దేరాము. అది కూడా మా నాన్న స్నేహితుడి లారీలో వెళ్తున్నాం. నాన్న నన్ను తన పక్కన , లారీ తలుపునకు దగ్గర కూర్చోబెట్టాడు. నేను ఎంత సేపు తలుపు పట్టుకుని లాగుతు ఉండడంతో అది కాస్త ఉండిపోయి నేను బయటకు వెళ్లిపోయాను. ఆ సమయంలో లారీలో ఉన్న ఇనుప రాడ్లు నా రెండు కాళ్లను కత్తిరించాయి. ఆ సంఘటన ఓ పెద్ద ప్రైవేట్ ఆసుపత్రి ముందు జరిగింది. వెంటనే నన్ను అక్కడికి తీసుకుని వెళ్తే వాళ్లు ఇది ఆక్సిడెంట్ కేసు, మేము ఇక్కడ చికిత్స చేయలేం, ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లి పోమన్నారు. సరిగా అదే సమయంలో అటు వైపు నుంచి వెళ్తున్న ఒక పోలీసు కానిస్టేబుల్ నన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు నా పరిస్థితిని చూసి జిల్లా ఆసుపత్రికి తీసుకుని వెళ్లమని సూచించారు. నా తల్లిదండ్రులు జిల్లా ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అక్కడి వైద్యులు అప్పటికే ఆలస్యం అయినందుకు నా తల్లిదండ్రులను తిట్టడం నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. కానీ వారు చదువుకోలేక పోవడం వల్ల వారికి ఏమి తెలియదని వారి నిస్సహాయ స్థితికి బాధపడ్డారు.
దాదాపు మూడు నెలలు నేను ఆసుపత్రిలో ఉన్నాను. ఆ తరువాత మా ఇంటికి వెళ్లినప్పుడు నన్ను చూడటానికి ఊరి వాళ్లందరూ మా ఇంటికి వచ్చేవారు. అప్పుడు నేను చాలా సంతోషించేవాడిని. మా ఇంటికి అంత మంది వస్తున్నందుకు. వారంతా వచ్చేటప్పుడు నాకోసం పళ్లు, బిస్కెట్లు తీసుకుని వచ్చేవారు . వాటిని చూసి నేను చాలా ఆనందపడేవాడిని.
కొద్ది కాలానికి నన్ను తీసుకుని మా తల్లిదండ్రులు తిపర్రు నుంచి తణుకు కు మాకాం మార్చారు. తణుకులోనే నన్ను ఒక మిషనరీ పాఠశాలలో చేర్పించారు. నాతో పాటు నా సోదరిని కూడా అదే తరగతిలో చేర్పించారు. తను నా కంటే రెండు సంవత్సరాలు పెద్దది అయినప్పటికీ తను కేవలం నాకోసం నా తరగతిలోనే ఉండిపోయి నన్ను చూసుకునేది.
తను నన్ను చూసుకోవడం చూసిన చాలా మంది నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి అలాంటి అక్క దొరకడం.. అని అనేవారు.
చాలా రోజులు నా పని అంతా మా అక్కే చూసుకునేది. తరువాత నా స్నేహితులు ఆ బాధ్యతను తీసుకునేవారు. స్నేహితులు ఎప్పుడూ కూడా నన్ను కాళ్లు లేని వ్యక్తులుగా చూడలేదు. మామూలు వ్యక్తిగానే పరిగణించేవారు. చదువు విషయంలో నాకు గట్టి పోటీనిచ్చేవారు.
నేను ఈరోజు ఇలా ముందుకు సాగుతున్నాను అంటే దానికి ఇద్దరు వ్యక్తులు కారణం.. అందులో ఒకరు మా గణిత ఉపాధ్యాయుడు ప్రమోద్ లాల్. ఆయన ఎప్పుడూ కూడా టాలెంట్ టెస్ట్ లలో పాల్గొనమని ప్రోత్సాహించేవారు. మరోకరు నా సీనియర్ చౌదరి. అతను చాలా తెలివైనవాడు. అతను ఐఐటీ లో సీటు సంపాదించడం కోసమే గౌతమ్ జూనియర్ కాలేజీలో చేరాడని తెలిసి, నేను కూడా దాని కోసమే శ్రమించేవాడిని. అలా కష్టపడి చదివి పదవ తరగతిలో 600 గానూ 542 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాను.
పదవ తరగతిలో మంచి మార్కులు రావడంతో గౌతమ్ కాలేజీ వారు నాకు ఫీజులో రాయితీ ఇచ్చారు. దానితో పాటు ప్రమోద్ సార్ సిఫార్సు చేయడం వల్ల కూడా వారు నన్ను బాగా చూసుకునేవారు. లేకపోతే సంవత్సరానికి రూ.50,000 మా తల్లిదండ్రులు దానిని ఎప్పటికీ భరించలేకపోయేవారు.
అప్పటి వరకు నా ఇల్లు, బడి తప్ప మరేమి తెలియని నాకు కాలేజ్ ఒక్కసారిగా కొత్తగా అనిపించింది.
మా కాలేజ్ కు కేకేఎస్ భాస్కర్ అనే వ్యక్తి ఎప్పుడూ వచ్చేవాడు. ఎందుకంటే అతను మా కాలేజ్ లోనే చదివి ఐఐటీ లో సీటు సంపాదించాడు. అతనే మా అందరికి స్ఫూర్తి. మా తల్లిదండ్రులకి ఐఐటీ గురించి ఏమి తెలియకపోయినప్పటికీ నన్ను వారు చాలా ప్రోత్సహించేవారు.
ఐఐటీ మద్రాసులో సీటు రావడం..
ఐఐటీ జేఈఈ లో నా ర్యాంకు 992 అయినప్పటికీ అది ఏమి అంత గొప్ప ర్యాంకు కాదు. కానీ వికలాంగుల కోటాలో నేను నాల్గవ వాడిగా ఉన్నాను. దాంతో మద్రాసులోని ఐఐటీ క్యాంపస్ లో కంప్యూటర్ సైన్స్ లో సీటు సంపాదించాను.
ఇక్కడ, నా రోల్ మోడల్ కార్తీక్, అతను పాఠశాలలో నా సీనియర్ కూడా. ఐఐటి- మద్రాసులో నేను అతనిని చూశాను. నేను ఇక్కడకు రాకముందే ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి అటాచ్డ్ బాత్రూమ్ కావాలని ఆయన కోరారు. నేను ఇక్కడ ఉన్నప్పుడు అతను నాకు సహాయం చేసి నాకు చాలా మార్గనిర్దేశం చేసేవాడు.
నేను విద్యాపరంగా మరియు వ్యక్తిగతంగా ఈ నాలుగు సంవత్సరాలలో ఒక వ్యక్తిగా పరిణామం చెందాను. ఇక్కడ చదువుకోవడం గొప్ప అనుభవం. నేను సంభాషించే వ్యక్తులు చాలా తెలివైనవారు, వారితో పాటు తరగతిలో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా ల్యాబ్ సహచరులతో మాట్లాడటం ద్వారా ‘సమాజంలో చెడ్డవారి కంటే మంచి వ్యక్తులు ఉన్నారు’అని అర్థమైంది.
జూలై 28, 2008 ప్రొఫెసర్ పాండురంగన్ తో పాటు నా ల్యాబ్ సహచరులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేయడానికి పదాలు సరిపోవు. మా ఇంటర్న్‌షిప్ కోసం నన్ను మరో నలుగురితో పాటు బోస్టన్‌కు ప్రొఫెసర్ పాండురంగన్ పంపారు. ఇది గొప్ప అనుభవం.
గూగుల్ ఆర్ అండ్ డిలో చేరడం..
నా తల్లిదండ్రులు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకున్నందున నేను పీహెచ్‌డీ చేయాలనుకోలేదు. మోర్గాన్ స్టాన్లీకు మొదటి నేను ఎంపిక అయినప్పటికీ నేను గూగుల్ కే మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. ఎందుకంటే నేను స్వచ్ఛమైన కంప్యూటర్ సైన్స్, అల్గోరిథంలు మరియు గేమ్ థియరీలో పనిచేయాలనుకుంటున్నాను.
మొదటి నుంచి కూడా అదృష్టవంతుడిని అని ఎందుకు చెప్పానో మీకు తెలుసా?
అసలు నేనంటే ఎవరో తెలియని వారి దగ్గర నుంచి నేను సహాయం పొందుతాను. ఐఐటిలో నా రెండవ సంవత్సరం తరువాత, నేను నా స్నేహితులతో కొంతమందితో ఒక కాన్ఫరెన్స్ కోసం రైలులో ప్రయాణిస్తున్నాను. మేము రైలులో సుందర్ అనే పెద్దమనిషిని కలుసుకున్నాము, అప్పటినుండి అతను నా హాస్టల్ ఫీజులను చూసుకుంటున్నాడు.
నేను జైపూర్ లెగ్ గురించి చెప్పాలి. నేను 3 వ తరగతి చదువుతున్నప్పుడు నాకు జైపూర్ పాదం వచ్చింది. రెండు సంవత్సరాల తరువాత, నేను వాటిని ఉపయోగించడం మానేశాను. నా కాళ్ళపై దాదాపు కాడలు లేనందున, వాటిని శరీరానికి కట్టడం చాలా కఠినమైనది. నేను జైపూర్ పాదంతో చాలా నెమ్మదిగా నడుస్తున్నాను. కూర్చోవడం కూడా ఒక సమస్య. నేను నా ట్రైసైకిల్‌తో వేగంగా పనులు చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను వేగంగా పనులు చేయాలనుకునే వ్యక్తిని.
ఆసుపత్రి గురించి ఒక గొప్ప విషయం ఏమిటంటే, జైపూర్ పాదాలను ఇచ్చేస్తే వారి పాత్ర ముగుస్తుందని వారు అనుకోరు. వారు అందరికీ జీవనోపాధి కోసం ఏర్పాట్లు కూడా చేస్తారు. వారి నుండి నాకు ఏమి సహాయం కావాలని వారు నన్ను అడిగారు. నేను ఆ సమయంలో వారికి చెప్పాను, నేను ఐఐటిలోకి వస్తే, వారి నుండి నాకు ఆర్థిక సహాయం కావాలి. కాబట్టి, నేను మద్రాస్ ఐఐటిలో చేరిన రోజు నుండి, నా ఫీజులను వారు చూసుకున్నారు. కాబట్టి, ఐఐటిలో నా విద్య నా తల్లిదండ్రులకు ఎప్పుడూ భారం కాదు కాబట్టి వారు అక్క నర్సింగ్ విద్యకు సంబంధించిన విషయాలను చూసుకోవచ్చు.
నేను ఐఐటీలో నాకోసం ఒక అద్భుతం ఎదురు చూస్తూ ఉంది.. అది ఏంటంటే నా మొదటి సంవత్సరం తరువాత నేను ఇంటికి వెళ్లినప్పుడు నాకు తెలియకుండా ఇనిస్టిట్యూట్ లో రెండు విషయాలు జరిగాయి. నా కోసం డిపార్ట్ మెంట్ వద్ద ఒక లిఫ్ట్, ర్యాంప్ ను ఏర్పాటు చేశారని, కొంచెం ముందుగా వచ్చి నా అవసరాలకు అనుగుణంగా ఉందో లేదో వాటిని పరిశీలించుకోవాల్సిందిగా ఒక లేఖ వచ్చింది.
రెండవది ఏంటంటే డీన్, ప్రొఫెసర్ ఇడిచండి, స్టూడెంట్స్ జనరల్ సెక్రటరీ ప్రసాద్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ లను ఎక్కడ అమ్ముతారో తెలుసుకుని నాకు తెలిపారు. దాని ఖరీదు రూ.55,000 వారు నాకోసం వీల్ చైర్ ను కొనలేదు. ఆ నగదును నాకు ఇచ్చేశారు. దాంతో నా చైర్ ను నేనే కొనుక్కోవడం జరిగింది.
ఆ తర్వాత నా జీవితం మారిపోయింది. నేను స్వేచ్ఛగా, స్వతంత్రంగా భావించాను. అందుకే నేను అదృష్టవంతుడిని అని చెప్తున్నాను. దేవుడు నాకోసం ప్రణాళికలు వేసుకున్నాడు. అడుగడుగునా నన్ను చూసుకుంటున్నాడు అని నరేశ్ తన జీవితం గురించి చెప్పుకొచ్చారు.