టీడీపీ అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. తెలుగుదేశం పార్టీని వీడిన తరవాత ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఆలిండియా సర్వీసెస్‌కు చెందిన ఈ మాజీ అధికారి 2014కు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి విజయ బావుటా ఎగురవేశారు. తొలి గెలుపుతోనే మంత్రి పదవి వరించడంతో రావెల కిషోర్ బాబు టీడీపీలో తిరుగులేని నేతగా ఎదుగుతారని అంతా భావించారు. అయితే ఆయన దూకుడుకు కుమారులది కూడా తోడు కావడంతో అనతికాలంలో అప్రదిష్ట పోగుచేసుకున్నారు. ఇద్దరు కుమారులపై లైంగిక ఆరోపణలు రావడంతో రావెల కిషోర్ బాబు దూకుడుకు కళ్లెం వేశారు. ఆ తరువాత కొద్ది రోజులకే మంత్రి పదవి కూడా ఊడింది. ఇక ఆయన వాయిస్ కూడా తగ్గించారు. అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై ఒంటికాలిపై లేచే నేతల్లో రావెల కూడా ఒకరు కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో ఆదరణ లేకపోవడంతో రావెల జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అక్కడా ఆయనకు కలసి రాలేదు. జనసేన పార్టీ నుంచి బీజేపీలో చేరడంతో రావెల రాజకీయ భవిష్యత్తు మెరుగవుతుందని అందరూ భావిస్తున్నారు.
తిరుపతి సీటొస్తే..
తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన దుర్గాప్రసాద్ కరోనాతో చనిపోయారు. దీంతో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. తిరుపతి పార్లమెంటు స్థానం ఎస్సీ రిజర్వుడు కావడంతో అనేకమంది దీనిపై కన్నేశారు. సాధారణంగా ఎవరైనా చనిపోయిన స్థానంలో ఉప ఎన్నిక వస్తే టీడీపీ నుంచి ఎవరూ పోటీ చేయరు. తాజాగా తిరుపతిలో కూడా అదే జరిగే అవకాశం లేకపోలేదు. అందుకే ఇప్పటికే జట్టుకట్టిన జనసేన- బీజేపీ కూటమికి, టీడీపీ పోటీలో లేకుంటే అక్కడ గెలుపు సాధ్యం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో తిరుపతిపై రావెల కిషోర్ బాబు కన్ను పడింది.
జనసేన అధినేతతో లాబీయింగ్
రావెల కిషోర్ బాబుకు గతంలో జనసేనలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఆ పార్టీ అధినేతతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయని వినికిడి. వాటిని ఉపయోగించుకుని తిరుపతి సీటు సాధించుకునేందుకు రావెల కిషోర్ బాబు హైదరబాద్‌లో మకాం వెశారట. జనసేనాని ఆశీస్సులతోపాటు, బీజేపీ అధిష్టానం ఆశీస్సులు కూడా దక్కితే తిరుపతి నుంచి రావెల పోటీ చేసే అవకాశం ఉంది.