ప్రేక్షకుల థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కు కరోనా బ్రేకులు వేసింది. ఎంతగా అంటే.. లాక్ డౌన్ టైమ్ లో పూర్తిగా ఓటీటీలకే జనం అంకితమైపోయేలా. లాక్ డౌన్ ఎత్తేసినప్పటికీ.. థియేటర్స్ లో కన్నా ఓటీటీల్లోనే సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారన్నది వాస్తవం. అయితే మళ్ళీ మరోసారి ఇప్పుడు ప్రేక్షకులకు ఓటీటీలు చేరువ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ సినీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. షూటింగ్స్ బంద్, థియేటర్స్ బంద్. అందుకే ఇప్పుడు అందరికీ మళ్ళీ ప్రత్యామ్నాయ మార్గంగా ఓటీటీలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా సినీ ప్రముఖులు కొందరు సొంత ఓటీటీలు ప్రారంభించి.. సొమ్ము చేసుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సౌత్ బొద్దుగుమ్మ నమిత .. తన పేరు మీద ‘నమిత థియేటర్’ అనే ఓటీటీని ప్రారంభించబోతుండడం విశేషంగా మారింది. రవివర్మ అనే సాఫ్ట్ వేర్ ఫ్రెండ్ భాగస్వామ్యంతో నమిత ఓటీటీని ప్రారంభించబోతోంది. చిన్న సినిమాలకు, ఇండస్ట్రీలోకి కొత్త గా అడుగుపెడుతోన్న నటీనటులకు, టెక్నీషియన్స్ కు తమ ఓటీటీ బెస్ట్ ప్లాట్ ఫామ్ అవుతుందని నమిత అభిప్రాయపడుతోంది.
త్వరలోనే తమ ఓటీటీ ఫస్ట్ స్ట్రీమింగ్ ప్రకటిస్తామని చెబుతోంది. ఇంత వరకూ సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు మాత్రమే సొంత ఓటీటీలు పెట్టుకున్నారు. అయితే మొట్ట మొదటి సారిగా ఓటీటీని స్థాపించిన నటీమణిగా నమిత నిలిచిపోతుంది. మొన్నామధ్య తనకు నచ్చిన కుర్రోడ్ని పెళ్ళి చేసుకుని చెన్నైలో సెటిలైన నమిత .. ఇప్పుడు సొంత ఓటీటీని నెలకొల్పడం సౌత్ ఇండస్ట్రీలోనే విశేషంగా మారింది. మరి అది ఎంత సక్సెస్ ఫుల్ గా నడుస్తుందో చూడాలి.