నందమూరి ఫ్యామిలీ అంటేనే పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలకు పెట్టింది పేరు. యన్టీఆర్ తర్వాత అలాంటి పాత్రలు చేయడంలో ఆయన లెగసీని అందిపుచ్చుకున్నది బాలయ్యే. అసలు తండ్రి యన్టీఆర్ తోనే ‘దాన వీరశూరకర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి’ లాంటి పౌరాణిక, చారిత్రక జోనర్స్ ను బాలయ్య అతి చిన్నవయసులోనే టచ్ చేయడం విశేషం. అలాగే.. తండ్రి దర్శకత్వంలో ఆయన నటించిన మరో చారిత్రక చిత్రం ‘వేములవాడ భీమకవి’. మరో పౌరాణిక చిత్రం ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. ఇందులో హరిశ్చంద్రుడుగా నటించి మెప్పించారు. ఇక ‘భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, శ్రీరామరాజ్యం, గౌతమీ పుత్రశాతకర్ణి, పాండురంగడు’ లాంటి మూవీస్ లో నటించి అలాంటి జోనర్స్ చేయడంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు బాలకృష్ణ.
ఈ నేపథ్యంలో బాలయ్య త్వరలో మరో ప్రతిష్థాత్మక చారిత్రక పాత్ర మీద మక్కువ చూపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆ పాత్ర మరేదో కాదు ‘గోన గన్నారెడ్డి’. కాకతీయుల చరిత్రలో చెప్పుకోదగ్గ పేరది. ఆ కాలంలో రుద్రమదేవి తర్వాత చెప్పుకోదగ్గ ప్రముఖ వీరుడు గోన గన్నారెడ్డి. ఆ పాత్రలో బాలకృష్ణ నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. గుణశేఖర్ రుద్రమదేవిలో గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. అందులో అతడు కనిపించేది తక్కువే అయినా.. ఆ పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్సుడిదే పాత్రను పూర్తి స్థాయిలో బాలయ్య చేయనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ ప్రాజెక్ట్ పై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. బోయపాటి సినిమా తర్వాత బాలయ్య చేయబోయేది ఈ సినిమా అంటున్నారు. బహుశా ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మరి గోనగన్నారెడ్డి బాలయ్య ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో చూడాలి.