విజయనగరం జిల్లాలో ప్రస్తుతం అంతర్భాగంగా ఉన్న పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రకటన సుస్పష్టం చేస్తోంది.
ఏజెన్సీ ముఖ ద్వారంగా ..
ఆంధ్రా – ఒరిస్సా సరిహద్దుల్లో ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న పార్వతీపురం ప్రస్తుతం అరకు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉంది. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన 25 జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ, అరకు నియోజకవర్గం విషయంలో సంక్లిష్టత ఏర్పడింది. విస్తీర్ణం పరంగా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకున్న అరకు పార్లమెంట్ స్థానం మొత్తం 4 జిల్లాల్లో విస్తరించింది. ఈ నియోజకవర్గంలోని పాలకొండ శ్రీకాకుళం జిల్లాలో ఉండగా, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. అరకు, పాడేరు విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుండగా, రంపచోడవరం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉంది. ఒక లోక్‌సభ నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండటం, అందులోనూ ఈ నియోజకవర్గంలో గిరిజన జనాభా ఎక్కువ ఉండటంతో అరకు జిల్లా ఏర్పాటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం జిల్లాగా
ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కొన్ని నియోజకవర్గాల విషయంలో సమస్య ఉండటంతో ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం సూచించిన విధంగానే కమిటీ నివేదిక రూపొందిస్తే ఏపీలో మొత్తం 25 జిల్లాలు ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే. విశాఖపట్నం జిల్లా అరకు లోక్‌సభ నియోజకవర్గం విషయంలో సందిగ్ధత నెలకొనడంతో కమిటీ దీనిపై ఓ క్లారిటీకి వచ్చినట్లు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చెప్పిన మాటలను బట్టి అర్థమవుతోంది. అరకు పార్లమెంటు స్థానాన్ని రెండుగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక జిల్లాగా ఏర్పడతాయి. అరకు కేంద్రంగా అరుకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక జిల్లాగా ఏర్పడతాయి. అప్పుడు రాష్ట్రంలో 25కు బదులు 26 జిల్లాలు ఆవిర్భవిస్తాయి.
ఇది సాకారమైతే పార్వతీపురం ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. అక్కడ ప్రజాప్రతినిధుల పోరాటం ఫలిస్తుంది.











