అంజిరెడ్డి తాత.. ఏపీలో ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలను పరిశీలించిన వారెవరికైనా ఇట్టే గుర్తుకు వచ్చే పేరు. 70 ఏళ్ల వయసులోనూ నవ యువకుడిగా కదులుతున్న అంజిరెడ్డి.. దౌర్జన్య కాండకు పరాకాష్టగా నిలిచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా పుంగనూరులో టీడీపీ తరఫున కాలరెగరేసి మరీ నిలిచిన కార్యకర్త. పెద్దిరెడ్డి అనుచరులకు అంతా భయపడి నామినేషన్లు వేసేందుకు కూడా ముందుకు రాలేకపోతుంటే.. అంజిరెడ్డి మాత్రం తన గ్రామంలో ఎన్నికలు జరిగి తీరాల్సిందేనని, పెద్దిరెడ్డి వర్గానికే ఎదురు నిలిచి తొడగొట్టిన వైనం ఏపీ వ్యాప్తంగా వైరల్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీలన్నింటినీ నయానో, భయానో ఏకగ్రీవాలు చేసుకుంటూ సాగుతున్న పెద్దిరెడ్డి. అంజిరెడ్డి తాత ఊరైన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మార్లపల్లెలో ప్రతిఘటన ఎదురైన సంగతి తెలిసిందే. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే సాగిన అంజిరెడ్డి.. ఇప్పటికీ క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్నారు. పార్టీ తరఫున పోరాటం సాగిస్తున్న అంజిరెడ్డికి పార్టీ అధినాయకత్వం కూడా మంచి గుర్తింపునే ఇచ్చింది. అందుకు నిదర్శనమే.. మంగళవారం నాడు తనను కలిసిన అంజిరెడ్డిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అక్కున చేర్చుకున్నారు. అంతేకాకుండా త్వరలో తన మనవరాలి పెళ్లి ఉందని అంజిరెడ్డి అన్నంతనే.. అక్కడికక్కడే చెక్ బుక్ తీసుకున్న లోకేశ్.. ఏకంగా రూ.3 లక్షల సాయాన్ని అందజేశారు.
పెద్దిరెడ్డిపైకే తొడగొట్టిన టీడీపీ యోధుడు
వైసీపీ పాలన మొదలయ్యాక ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించడమే పాపమన్నట్లుగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు బుక్ అయిపోతున్నాయి. అరెస్ట్‌లూ జరిగిపోతున్నాయి. ఈ తరహా పరిస్థితి చిత్తూరు జిల్లా పుంగూరు, గుంటూరు జిల్లా మాచర్ల వంటి నియోజకవర్గాల్లో మరింత మేర దారుణంగా ఉన్నాయనే చెప్పాలి. ఈ రెండింటిలోనూ పుంగనూరులో అక్కడి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారరెడ్డి అనుమతి లేనిదే ఒక్క అధికారి కూడా పలికే పరిస్థితి లేదు. ఈ తరహా దౌర్జన్యంతోనే పెద్దిరెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్నింటినీ ఏకగ్రీవం చేసుకునేందుకు యత్నించారు. ఎంపీటీసీలను అలాగే కైవసం చేసుకున్నారు కూడా. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం పెద్దిరెడ్డికి ఒకే ఒక్క చోట వ్యతిరేకత ఎదురైంది. పుంగనూరు మండలం మార్లపల్లె పంచాయతీకి ఎన్నికలు జరిపించి తీరాల్సిందేనని టీడీపీ యోధుడు అంజిరెడ్డి రోడ్డెక్కారు. ఈ క్రమంలో దౌర్జన్యానికి యత్నించిన పెద్దిరెడ్డి అనుచరుల పైకి అంజిరెడ్డి ఏకంగా తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా పెను కలకలం రేపింది. అంజిరెడ్డి ధైర్యంతో పెద్దిరెడ్డి అరాచకం ఎలా ఉంటుందో కూడా జనానికి తెలిసి వచ్చింది.
మనవరాలి పెళ్లికి రూ.3 లక్షల సాయం
పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసే నాటికి అంజిరెడ్డి తాత పేరు టీడీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్పాహాన్ని నింపింది. ఈ విషయం పార్టీ అధిష్ఠానానికి కూడా తెలిసింది. ఈ క్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిసేందుకు తన మవనడిని వెంటేసుకుని అంజిరెడ్డి హైదరాబాద్ రాగా.. మంగళవారం ఆయనను లోకేశ్ అక్కున చేర్చుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ స్థితిగతులపైనా వారిద్దరి మధ్య చర్చ జరిగింది. మాటల సందర్భంగా త్వరలోనే తన మనవరాలి పెళ్లి ఉందని అంజిరెడ్డి చెప్పగా.. క్షణాల్లో స్పందించిన లోకేశ్.. ఏమాత్రం ఆలోచించకుండా రూ.3 లక్షల చెక్కును అంజిరెడ్డి చేతిలో పెట్టారు. ఈ హఠాత్పరిణామానికి అంజిరెడ్డి నిశ్చేష్టుడయ్యారనే చెప్పాలి. లోకేశ్ ఉదారత, పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నోట మాట రాని అంజిరెడ్డి ఆ చెక్కును అందుకున్నారు. పనిలో పనిగా.. తన మనవడు కూడా బీటెక్ చదివాడని, పార్టీకి సేవ చేయాలనుకుంటున్నాడని, అతడికి అవకాశం కల్పించాలని లోకేశ్‌కు విన్నవించారు. టీటీడీపీ యువ సైన్యంలోనో, ఇంకేదైనా కీలకమైన విభాగంలోనే తప్పనిసరిగా మనవడికి అవకాశం కల్పిస్తానని అంజిరెడ్డికి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన అంజిరెడ్డి.. 35 ఏళ్లుగా టీడీపీలో ఉన్నా.. ఏనాడూ ఏ పదవీ తీసుకోలేదని, పార్టీని నమ్ముకున్న తనను సొంత తాతయ్యలా నారా లోకేశ్ ఆదరించారని అంజిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.