బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కు సన్ స్ట్రోక్ మామూలుగా తగలలేదు. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్సీబీ జరిపిన దాడుల్లో ఆర్యన్ ఖాన్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ప్రస్తుతం అతను ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. తన కుమారుడిని ఎలాగైనా బయటకు తీసుకు రావాలని షారుక్ నానా తంటాలు పడుతున్నారు. తన సినిమా షూటింగులను పక్కన పెట్టేశారు. అతనికి బెయిల్ వచ్చేదీ లేనిదీ రేపు తేలిపోనుంది.
ముంబై సెషన్స్ కోర్టు దీనిపై బుధవారం తీర్పు వెలువరించనుంది. షారుక్ నటిస్తున్న పఠాన్ షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ షూటింగును తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఈ ప్రభావం సల్మాన్ ఖాన్ టైగర్ 3 మీద కూడా పడుతోంది. తమ వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులు తలెత్తినప్పుడు ఒకరికొకరు సహకరించుకోవడం ఈ ఖాన్ లకు అలావాటు. అంతేకాదు ఈ రెండు చిత్రాల్లోనూ వీరిద్దరూ అతిథి పాత్రలను కూడా పోషిస్తున్నారు.
పఠాన్ షూటింగ్ కోసం ఆ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అక్టోబరు 2న స్పెయిన్ వెళ్లాడు. ఆర్యన్ ఖాన్ కేసు తర్వాత అతను కూడా ఇండియాకు తిరిగొచ్చాడు. మల్లోర్కా, కాడిజ్, వెజెర్ డి లా ఫ్రంటెరాలో రెండు పాటల చిత్రీకరణ కోసం ఈ చిత్ర యూనిట్ స్పెయిన్ వెళ్లింది. తిరిగి ఈ చిత్ర యూనిట్ మళ్లీ ఎప్పుడు స్పెయిన్ వెళుతుందన్న దాని మీద స్పష్టత లేదు.
ఆర్యన్ కేసు విషయంలో ఈ ఇద్దరు ఖాన్ లూ ఇప్పటికే చాలా సార్లు కలుసుకున్నారు. ఆర్యన్ ను బయటికి ఎలా తీసుకురావాలా అన్న అంశంపై చర్చించుకుంటున్నారు. వారాంతాల్లో బిగ్ బాస్ షూటింగులో బిజీగా ఉంటూనే షారుక్ కోసం కొంత సమయాన్ని సల్మాన్ కేటాయిస్తున్నాడు. ఈ కారణాల వల్ల టైగర్ 3 రిహార్సల్ కు కూడా హాజరుకాలేదు. ఆర్యన్ కు రేపు బెయిల్ వచ్చేస్తే ఈ ఇద్దరు ఖాన్ లూ ఊపిరి పీల్చుకుంటారు.











