చంద్రబాబు జైలు నుంచి విడుదల అయినప్పటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు టీడీపీ కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నారా లోకేశ్ సీఎం జగన్ కి నేరుగా ఓ బహిరంగ లేఖ రాశారు. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ జగన్ కి లేఖ రాశారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలు రూ.1,650 కోట్లు పెండింగ్‌లో ఉంచడం వల్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలు రాయనివ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు. చదువు పూర్తయిన విద్యార్థులకు మార్కుల లిస్టులు, ఇతర సర్టిఫికెట్లు జారీని నిలిపేశారని అన్నారు. ఆ నిధులు వెంటనే విడుదల చేసి వారి సమస్యలు పరిష్కరించాలని లోకేశ్ సీఎం జగన్ ను కోరారు.
అసలు విషయం ఏంటంటే.. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన లాంటి పథకాల ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. కానీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర ఏళ్లలో ఒక్క ఏడాది కూడా సకాలంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేసింది లేదు. మరోవైపు, కేంద్రం ఎస్సీ, ఎస్టీల విద్యార్థులకి ఇస్తున్న 60 శాతం ఫీజు ఏ లెక్కలోనూ చూపకుండా ప్రభుత్వమే విద్యాదీవెన ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటోందని లోకేశ్ ఆరోపించారు. అదీకాక, విద్యాదీవెన డబ్బుల్ని విద్యార్థి ఖాతాలో వేయకుండా, తల్లి అకౌంట్ లో వేస్తామంటూ ప్రభుత్వం మెలిక పెట్టింది. విద్యాదీవెన, వసతి దీవెన అంటూ పేర్లు పెట్టి, విపరీతంగా ప్రచారం చేసుకోవడం తప్పించి జరిగిన మేలు ఏమీ లేదు.
నిజానికి విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని జగన్ సర్కారు 2020 డిసెంబరులోనే చెప్పింది. విద్యార్ధుల ఫీజు బకాయిలు ఇకపై పెండింగ్ ఉండబోవని, ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. కానీ, అది చెప్పినట్లుగా అమలు కావడం లేదు. 2023-24 విద్యా సంవత్సరం ప్రారంభం అయి 5 నెలలు అయినా గత ఏడాది ఫీజులనే ప్రభుత్వం ఇంకా కట్టలేదు. చాలా మంది అప్పులు చేసి మరీ ఫీజులు కట్టారు.
ఇప్పటికి కూడా చెల్లించాల్సిన ఫీజు బకాయిలు రూ.1,650 కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పీజీ కోర్సులకైతే పాత బకాయిలు రూ.450 కోట్లు ఉంటే నాలుగేళ్లుగా రీఎంబర్స్ చేయలేదు. కాలాయాపన చేస్తుండగా కాలేజీల మేనేజ్‌మెంట్లు కోర్టుకు వెళ్తే వారిని బెదిరించి వన్ టైం సెటిల్ మెంట్ తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే, ఆ డబ్బులు కూడా ఇంకా చెల్లించలేదని సమాచారం. దీన్నిబట్టి చూస్తే నారా లోకేశ్ రాసిన లేఖతో ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా ఉన్నట్లు కనిపించడం లేదు.