ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో కొత్త వణుకు మొదలైనట్లుగా తెలుస్తోంది. ఏపీ హైకోర్టు కాస్త ఘాటుగానే ప్రశ్నించగా, ప్రభుత్వం చెప్పిన సమాధానం మాత్రం అర్థం లేనిదిగా ఉంది. అసలు సీఎంని కలవరపాటుకు గురి చేస్తున్న విషయం ఏంటంటే.. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని ప్రభుత్వ శాఖల్లో విడుదల అవుతున్న గవర్నమెంట్ ఆర్డర్ల (జీవో)లను పబ్లిక్ డొమైన్ లో ఉంచడం లేదు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం హాయాంలో ప్రతి శాఖలో విడుదలయ్యే ప్రతి ఒక్క జీవోను వెబ్‌సైట్లో పెట్టేవారు. ఎవరైనా సరే ఏ రోజుకారోజు ఆ జీవోలను చూసే వెసులుబాటు ఉండేది. పాత జీవోలను కూడా సులభంగా చూడగల వీలు ఉండేది.
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక జీవోలను ఇలా పబ్లిక్ డొమైన్ లో ఉంచడం లేదు. జీవోలను అంత సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఏంటనే అంశంపై కొంత మంది వివిధ సందర్భాల్లో హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. తాజాగా కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. దీనిపై రెండు రోజుల క్రితం విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. జీవోలను అంత సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఏంటని నిలదీసింది. దీనికి ప్రభుత్వం తరపున న్యాయవాది సమాధానం చెబుతూ.. అంతగా ప్రాముఖ్యం లేని జీవోలను మాత్రం పబ్లిక్ డొమైన్ లో అప్ లోడ్ చేయడం లేదని చెప్పారు. ముఖ్యమైనవి మాత్రమే అప్ లోడ్ చేస్తున్నామని చెప్పారు. దీనికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం.. అసలు ఇంపార్టెంట్ అని, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారో చెప్పాలని ప్రశ్నించింది.
హైకోర్టు మొట్టికాయలు వేసిన మరుసటి రోజే జీవోలు దాచిపెట్టడంపై సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఓ నోట్ విడుదల చేసింది. జీవోలను ఏపీ గెజిట్ వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేయాలని తక్షణ ప్రతిస్పందనగా అయితే ఆదేశాలు ఇచ్చింది. కొన్ని శాఖలు జీవోలు అప్‌లోడ్ చేయకపోవడంపై జీఏడీ నోట్ లో అభ్యంతరం తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటిదాకా అన్ని జీవోలు అప్‌లోడ్ చేయాలని ఆయా శాఖలను ఆదేశించింది. జీవోలు అప్‌లోడ్ చేసి ఆ వివరాలు కేబినెట్ సెక్షన్ అధికారికి పంపాలని నిర్దేశించింది. జీవోలు అప్‌లోడ్ చేయకపోతే ఇన్‌చార్జులను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది.
అయితే, జీఏడీ విడుదల చేసిన ఈ నోట్ నామమాత్రమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చినందునే జీవోలను దాచిపెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గతంలో 2021లో కూడా హైకోర్టు ఈ విషయంపై కీలక ఆదేశాలు ఇచ్చినప్పటికీ జీవోలను గోప్యంగానే ఉంచుతున్నారు. ఇప్పుడు హైకోర్టులో ఉన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై మళ్లీ వచ్చే వారం విచారణ ఉన్నందున ఈ సారి హైకోర్టు కాస్త సీరియస్ గానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జగన్ కు కొత్త భయం పట్టుకుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని జీవోలు అప్ లోడ్ చేసేస్తే వివిధ ప్రభుత్వ నిర్ణయాలు, కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు బయటికి వచ్చే అవకాశం ఉందనే ఆందోళనలో ప్రభుత్వం ఉంది. అసలే ఎన్నికల సమయం కావడంతో ఈ టైంలో గుట్టు బయట పడితే ఇక అంతే సంగతులనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.