అరవింద సమేతలో రావు రమేష్ చెప్పే ఓ డైలాగ్ ఇప్పుడు లోకేష్‌కు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు..వ్యాపార వేత్తలు ఫ్యాషన్ అంటారు.. రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు..కాని ప్రతి జనరేషన్‌లోనూ ఓ కొత్త థాట్‌ని ముందుకు తీసుకువెళ్లే వాడు మాత్రం ఒక్కడే వస్తాడు..వాడే టార్చ్ బేరర్..వెళ్తున్నాడు చూశావా? బాలిరెడ్డీ వాడే టార్చ్ బేరర్. ఈ డైలాగ్ ఇప్పుడు నారా లోకేష్‌కు అచ్చంగా సరిపోతుంది. గడిచిన ఐదేళ్లు నాయకులు ఎలా వ్యవహరించారో చూశాం. ప్రతి పథకానికి తన పేరు, ఫోటోలు వేసుకుని విపరీతంగా ప్రచారం చేసుకున్న జగన్‌ను చూశాం. కనీసం స్కూల్స్, విద్యార్థులను కూడా జగన్ వదల్లేదు. ఐతే నారా లోకేష్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
పిల్లలపై రాజకీయ ప్రభావం లేకుండా విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు లోకేష్. ముఖ్యంగా విద్యలోకి రాజకీయాలు రాకుండా చేస్తున్నారు. పిల్లలకు రాజకీయ వాసనలు అంటకుండా చేస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేని విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. ఇందు కోసం ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయ సభలకు పిల్లలను తరలించడాన్ని నిషేధించారు. అలాగే రాజకీయ నేతలు ఎప్పుడైనా స్కూళ్లకు వెళ్లినా అది అభివృద్ధి పనుల కోసం తప్ప.. రాజకీయం వెళ్లకూడదని దిశానిర్దేశం చేశారు. ఇక పుస్తకాలు, యూనిఫాం సహా దేనిపైనా .. రాజకీయ గుర్తులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నిజానికి గడిచిన ఐదేళ్లు జగన్ తన ఇంట్లో సొమ్ము ఖర్చు పెట్టినట్లుగా ప్రచారం చేసుకున్నారు. ప్రతీ పుస్తకంపై ఆయన ఫోటో ఉండేది. ప్రతి వస్తువుపై ఆయన ఫోటో ఉండేది. పుస్తకాలను, బ్యాగులను కూడా వదిలి పెట్టలేదు. ప్రతీ వస్తువు వైసీపీ రంగులో ఉండేది. ఇలా విద్యార్థుల మనసుల్లో వైసీపీ ఉండాలని..అంతా తాను ఇస్తున్నట్లుగా చెప్పుకోవాలని తాపత్రాయపడ్డారు. పథకాల బటన్లు నొక్కే ప్రోగ్రామ్ పేరుతో చివరికి రాజకీయ సభలకు కూడా పిల్లలను తీసుకెళ్లేవారు. చిన్న పిల్లల ముందు తన వెంట్రుక కూడా పీకలేరు లాంటి భాషను వాడేవారు. ఆయనకు పిల్లల భవిష్యత్ కన్నా..వారి భవిష్యత్ ను పణంగా పెట్టి తనకు బానిసలుగా చేసుకుందామన్న కోరికే ఎక్కువగా ఉండేది.
పిల్లలు దేశ భవిష్యత్. పిల్లలు బాగుంటేనే ఏ దేశ భవిష్యత్ ఐనా బాగుంటుంది. పునాదులు గట్టిగా ఉంటేనే పిల్లలు ఎంత ఎత్తుకైనా ఎదగగలుగుతారు. పిల్లల విషయంలో నారా లోకేష్ చాలా పట్టుదలతో ఉన్నారు. రాజకీయంగా పిల్లలను..వారి భవిష్యత్‌ను ఉపయోగించుకోకుండా గట్టి పునాదులు వేస్తున్నారు.