మంత్రి నారా లోకేష్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రశంసల వర్షం కురిపించారు.బాగు చేసే లీడర్‌ను చూస్తున్నానంటూ లోకేష్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతకీ రఘురామ ఏమన్నారంటే..వ్యవస్థ బాగుపడాలన్నా, నాశనం కావాలన్న నాయకుడే ముఖ్యం. నాయకుడి వ్యవహారశైలి మీదే వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. గత ఐదేళ్లు ఏపీలో వ్యవస్థలు ఎలా నాశనమయ్యాయో చూశాం. ఐతే వ్యవస్థ బాగుపడాలంటే ఏం చేయాలో మంత్రి నారా లోకేష్ అద్భుతమైన ప్రజంటేషన్‌లో చూపించారు. నేను కామెంట్లు చేయడం తప్పితే ప్రశంసలు ఇవ్వను. కానీ మీరు ప్రజల మనసు దోచుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు రఘురామ.
పాఠశాలలకు సున్నా, ఒకటి, రెండు కాకుండా.. మూడు, నాలుగు, ఐదు స్టార్లు ఉండాలని చెప్పారు రఘురామ. ఏ నియోజకవర్గంలో అయితే ముందుగా సున్నా, ఒకటి, రెండు లేకుండా చేస్తారో వారికి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కలిసి ప్రత్యేకంగా డిన్నర్ ఇస్తే ప్రోత్సాహకంగా ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యేలు తమ కోసమైనా విద్యార్థుల సంక్షేమాన్ని చూస్తారని. మీరు అంగీకరిస్తే మూడు నెలల్లో నేనే డిన్నర్‌కు వస్తానన్నారు రఘురామకృష్ణం రాజు. లోకేశ్ సుమారు గంట 15 నిమిషాలు ప్రసంగించినా..అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా ప్రజంటేషన్ ఇచ్చారని ప్రశంసించారు. లోకేష్ కల్పించిన నమ్మకంతో జూన్, జులైల్లో పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయనే విశ్వాసం వచ్చిందన్నారు రఘురామ.
ఇక పాఠశాల విద్యాశాఖకు రూ.31 వేల 805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.2 వేల 506 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.12 వందల 29 కోట్లు, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖకు రూ.534 కోట్ల మంజూరుకు సభ ఆమోదం తెలిపింది. సభలోని సభ్యులే కాకుండా..సభకు రాకుండా టీవీల్లో వీక్షించే శాసనసభ్యులు కూడా కాదనలేని విధంగా ప్రజంటేషన్ ఉందని పరోక్షంగా వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ కామెంట్ చేశారు.
విద్యార్థి అసెంబ్లీ అనేది చాలా ఆసక్తికర విషయం. అప్పుడు మేం కూడా వచ్చి పైన కూర్చుని చూస్తాం. విద్యార్థుల నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఉంటుందన్నారు రఘురామ. ఏడాదిలో కనీసం 60 రోజులైనా అసెంబ్లీ పనిదినాలు ఉండాలని సూచించారు. విద్యాశాఖలో సంస్కరణలపై ఇచ్చిన ప్రజంటేషన్ బాగుందంటూ..ఎమ్మెల్యేలంతా లోకేశ్ దగ్గరకు వచ్చి అభినందించారు.