ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం జగన్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తేల్చి చెప్పినట్లు సమాచారం. బాలినేని గురువారం సాయంత్రం సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా మాంగుట కుటుంబానికి టికెట్ ఇచ్చేది లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం బయటికి వచ్చింది. జగన్ టికెట్ ఇవ్వకపోవడానికి ఇటీవల తాను విధించిన నిబంధనలు, షరతులను మాగుంట శ్రీనివాసుల రెడ్డి పాటించలేదని, దాంతో అధినేత సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే మాగుంటకు రీజనల్ కోఆర్డినేటర్ల ద్వారా ఈ షరతుల సమాచారం పంపారు. అయినా వాటిని మాగుంట పాటించలేదు.
ఆ షరతుల్లో భాగంగా మాగుంటకు ఎంపీ సీటు కావాలంటే రూ.180 కోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రెస్ మీట్లు పెట్టి.. ప్రత్యర్థులైన చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ను విపరీతంగా దూషించాలని షరతులు విధించారు. వీటిని అమలు చేస్తేనే ఈసారి ఎంపీ టికెట్ వస్తుందని లేదంటే కుదరదని జగన్ సమాచారం పంపారు. పార్టీలో ఒక సీనియర్ నేత అయి ఉండి ఇలాంటి షరతులు విధించడం ఏంటని ఇటీవలే మాగుంట అసహన వ్యాఖ్యలు కూడా చేశారు. వాటిని పాటించబోనని కూడా తన అనుచరుల వద్ద తేల్చేశారు. అంతేకాక, ఆ షరతులు తన వల్ల కాదని రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డిని కలిసి కూడా మాగుంట శ్రీనివాసుల రెడ్డి స్పష్టం చేశారు. అలా చేయగానే.. నేడు సీఎంను కలిసేందుకు వెళ్లిన బాలినేని సీఎం జగన్ మాగుంటకు టికెట్ లేదని తేల్చి చెప్పేశారు.
ఒంగోలు అసెంబ్లీ సీటు నుంచి మాత్రం బాలినేనినే పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. మరి.. తనకు వైసీపీ నుంచి టికెట్ దొరకని పక్షంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎలా స్పందిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. నిజానికి టీడీపీ నుంచి గత ఎన్నికలకు ముందు మాగుంట వైసీపీలో చేరారు. ఎంపీ టికెట్ హామీపైనే ఆయన వైసీపీలోకి వచ్చారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒంగోలులో పోటీ చేయగా.. వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు.
అయితే, ఇటు మాగుంటపై జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత ఉన్నట్లు కూడా తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ.. మాంగుటకు టికెట్ ఇస్తే ఆయన ఓడిపోవడానికి నియోజకవర్గాలు అన్ని తిరిగి ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. జిల్లాలో కూడా మాగుంటపై వ్యతిరేకత ఉండడం.. మాగుంట కాస్త జగన్ కు చిరాకు కలిగించేలా వ్యవహరించడంతోనే జగన్ కు ఆయనపై చిర్రెత్తుకొచ్చినట్లు తెలుస్తోంది. బాలినేని కూడా గతంలో తాను ఒంగోలు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని, ఎంపీగా మాగుంట శ్రీనివాసులే పోటీ చేస్తారని చాలా సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. తాజాగా జగన్ మాగుంటకు టికెట్ లేదని చెప్పేయడంతో మాగుంట ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.