మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మున్నెన్నడూ లేని విధంగా పోలింగ్ నమోందైంది. మొత్తం 883 ఓట్లు ఉండగా పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 665 ఓట్లు పోలయ్యాయి. ఓటు వేయడానికి ఇంకా సభ్యులు వస్తుండటంతో పోలింగ్ సమయాన్ని మూడు గంటల వరకూ పొడిగించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా సీనియర్ నటులు వచ్చి ఓటేసి వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత ఆర్. నారాయణమూర్తి, అక్కినేని నాగ చైతన్య, సీనియర్ నటి జయప్రద, పూనమ్ కౌర్, ఇంద్రజ తదితరులు వచ్చి ఓటేసి వెళ్లారు.
నటుడు ఆర్. నారాయణమూర్తి తన ఓటు హక్కు వినియోగించుకోడానికి వచ్చి తెలుగు నటులకు రిజర్వేషన్ పెట్టాలన్న డిమాండు చేశారు. బిజినెస్ పరంగా పాన్ ఇండియా మూవీస్ కోసం ఇతర భాషల నటుల్ని ఎక్కువగా తీసుకుంటున్నారని ఆరోపించారు. అందువల్ల తెలుగు నటీనటులకు రిజర్వేషన్ పెట్టాల్సిన అవసరముందన్నారు. నటి పూనమ్ కౌర్ ప్రకాష్ రాజ్ కు మద్దతుగా మాట్లాడారు.
ప్రకాష్ రాజ్ గెలిస్తేబాగుంటుందని పూనమ్ కౌర్ వ్యాఖ్యానించింది. రాజకీయ లబ్ది కోసం ఆర్టిస్టులను సతాయించడం మానాలన్నారు. ఎన్నికల్లో పోటీ ఉంటేనే మజా ఉంటుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గత ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈసారి పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 665 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ముగిసే సమయానికి 665 ఓట్లు పోలయ్యాయి. ఇదివరకెప్పుడూ ఇన్ని ఓట్లు పోలవ్వలేదు. ఈ పోలింగ్ శాతం బట్టి చూసినా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఫలితం ఎవరి వైపు మొగ్గు చూపడానికి ఈ పోలింగ్ శాతం దోహదపడుతుందో చూడాలి. ఎక్కువ శాతం ఓటింగ్ పోలింగ్ జరగడానికి మంచు విష్ణు ప్యానెల్ బాగా కసరత్తు చేసిందని చెబుతున్నారు. ముంబై, చెన్నై నుంచి కూడా నటులు వచ్చి ఓట్లు వేశారు.











