పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ బద్ధమైన దుస్తులతో చాలా ఆకర్షణీయంగా పవన్ కనిపించారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పవన్ పర్యటన చేయడంతో ఈ పర్యటన చర్చనీయాంశమైంది. ఇక్కడ జరిగే ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ తో కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని జనసేన పార్టీ ఆలోచిస్తోంది.
ఈ నేపథ్యంలోనే తిరుపతిపై పవన్ దృష్టి పెట్టారు. పైగా ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసానికి సంబంధించి వివాదం రేగుతున్న నేపథ్యంలోనూ పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో దుబ్బాక ఎన్నికల ఫలితం చూశాక భాజపా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తిరుపతి ఎన్నికలను కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దుబ్బాక తరహా ఫలితాన్ని రాబట్టాలన్న ఆలోచనలో భాజపా ఉంది.
అందుకు ఆయుధంగా పవన్ కళ్యాణ్ ను ఉపయోగించుకోబోతున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఫలితాన్ని బట్టి భవిష్యత్తులో భాజపా వ్యూహం కూడా అర్థమవుతుంది. తిరుపతి వచ్చిన పవన్ కళ్యాణ్ కు రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
Must Read ;- తిరుపతికి పవన్.. బీజేపీకి బీపీ పెరిగినట్టేనా?