లాస్టియర్ ‘భీష్మ’ మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు నితిన్. ఆ కాన్ఫిడెన్స్ తోనే తదుపరి చిత్రాల కోసం వైవిధ్యమైన కథాంశాలు ఎంపిక చేసుకుంటూ తన కెరీర్ ను మరింత సక్సెస్ ఫుల్ గా పరుగులెట్టించాలనుకుంటున్నాడు. అందులో భాగంగా ‘చెక్’ అనే వెరైటీ కథాంశంతో నేడు ప్రేక్షకులకు ముందుకొచ్చాడు. వైవిధ్య చిత్రాల దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ మూవీ ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అయింది? ఈ కోర్ట్ రూమ్ డ్రామాను ఎంత వరకూ ఏక్సెప్ట్ చేస్తారు అనే విషయాలు రివ్యూలో చూద్దాం..
కథేంటి?
ఆదిత్య (నితిన్ ) టెర్రరిస్టులకు సహాయం చేశాడన్న కారణంతో అతడిని దేశద్రోహిగా ముద్ర వేసి .. ఉరిశిక్ష విధిస్తారు. అతడ్ని నగరంలోని ఒక జైలుకి తరలిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మానస ( రకుల్ ప్రీత్ సింగ్ ) అనే లాయర్ కి అనూహ్య పరిస్థితుల్లో అతడి కేసును టేకప్ చేయాల్సి వస్తుంది. దాంతో తన జీవితం మీద హోప్స్ కోల్పోయిన ఆదిత్యలో మళ్ళీ ఆశ చిగురిస్తుంది. మానసకి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. యాత్ర (ప్రియా వారియర్ ) అనే అమ్మాయితో తన ప్రేమ విషయం రివీల్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆదిత్యకి.. జైల్లో గురువులాంటి శ్రీమన్నారాయణ( సాయిచంద్ ) పరిచయం అవుతాడు. ఆయన చదరంగంలో కింగ్. జైల్లో తనంతట తాను చెస్ ఆడుతుంటే చూసి.. అందులో మరిన్ని కిటుకులు నేర్చుకొని.. తన స్కిల్స్ తో ఆయన్నే మెప్పిస్తాడు. దాని వల్ల కొన్ని చెస్ టోర్నమెంట్స్ లో పాల్గొనే అవకాశం అందుకుంటాడు. అలా.. కామన్ వెల్త్ పోటీల్లో ఫైనల్స్ చేరుకుంటాడు. గ్రాంగ్ మాస్టర్ టైటిల్ కూడా గెల్చుకుంటాడు. అయితే ఈ కారణంతో అతడు రాష్ట్రపతి కి క్షమాభిక్ష కోరుకుంటాడు. ఇంతకీ అతడికి రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారా? చివరికి అతడు జైలు నుంచి ఎలా విడుదల అవుతాడు అనేదే మిగతా కథ.
ఎలా తీశారు ? ఎలా చేశారు?
క్రైమ్ కథాంశాల్ని డీల్ చేయడం దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ కి కొట్టినపిండి. ఆయన మొదటి సినిమా ‘ఐతే’ నుంచి ఎర్లియర్ గా వచ్చిన ‘మనమంతా’ వరకూ ఆయన సినిమాల్లో ఆ ఎలిమెంట్ ప్రధానంగా ఉంటుంది. ‘చెక్’ కథ ను కూడా అదే నేపథ్యంలో రాసుకున్నాడాయన. కాకపోతే దీన్ని చెస్ బ్యాక్ డ్రాప్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. నిజంగా ఈ పాయింట్ కొత్తే. ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. చెస్ లో గ్రాండ్ మాస్టర్ అవడం నిజంగా వైవిధ్యమైనదే. కాకపోతే.. దాన్ని కన్విన్సింగ్ గా చెప్పడంలో ఆయన కాస్తంత తడబడ్డాడు అని చెప్పాలి. ఎప్పుడూ లాజికల్ గా థింక్ చేసే ఆయన .. చెక్ మూవీ కోసం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని.. కాస్తంత ఇల్లాజికల్ గా వెళ్ళాడు. అయితే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. చదరంగం ఆటను ప్రేక్షకులకు కాస్తంత దగ్గర చేసే ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, హీరో ఇంటెలిజెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఇక నితిన్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రియావారియర్ లవ్ ట్రాక్ .. అంతగా మెప్పించదు. అలాగే.. ఆ పాత్ర ను దర్శకుడు కేవలం ఫ్లాష్ బ్యాక్ కే పరిమితం చేశాడు.
ఇక ఈ సినిమా క్లైమాక్స్ ను వైవిధ్యంగా దర్శకుడు వైవిధ్యంగా చిత్రీకరించాలని అనుకున్నప్పటికీ అంతగా కన్విన్సింగ్ గా లేదనే చెప్పాలి. పూర్తిగా లాజిక్ లెస్ గా ఆ పార్ట్ ను రాసుకున్నాడనిపిస్తుంది. రాష్ట్రపతి క్షమాభిక్ష లభించకపోతే.. అతడు జైలు నుంచి పారి పోవాలనుకోవడం సమంజసం అనిపించదు. అంతేకాదు .. అతడు పారిపోయే విధానం కూడా సిల్లీగా అనిపిస్తుంది.
ఇక ఆదిత్యగా నితిన్ స్ర్కీన్ ప్రెజెన్స్ .. అతడి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే అతడు చెస్ ఆడే విధానంగా కూడా సహజంగా ఉంటుంది. ఏలేటి చంద్ర శేఖర్ లాంటి దర్శకుడు అయినప్పటికీ..ఆయనకి నితిన్ కోసం కొన్ని బిల్డప్ షాట్స్ తీయడం తప్పలేదు. ఇక జైలర్స్ గా మురళీ శర్మ , సంపత్ రాజ్ మెప్పిస్తారు. అలాగే.. లాయర్ గా రకుల్ ప్రీత్ సింగ్ .. పర్వాలేదనిపించింది. ఇక నితిన్ చెస్ గురువుగా సాయిచంద్ మరో గుర్తిండిపోయే పాత్రను పోషించారు. ఇక కోడూరి కళ్యాణ్ మాలిక్ సంగీతం ఆకట్టుకుంటుంది. అలాగే సినిమాటో గ్రఫీ కూడా మెప్పిస్తుంది. టోటల్ గా చెక్ మూవీ .. కొన్ని విషయాల్లో మాత్రమే మెప్పిస్తుంది.
నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, సాయిచంద్, హర్షవర్ధన్, సంపత్ రాజ్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, సిమ్రన్ చౌదరి, కార్తీక్ రత్నం, చైతన్యకృష్ణ తదితరులు.
సాంకేతివర్గం:
సంగీతం: కళ్యాణి మాలిక్
కెమెరా: రాహుల్
ఎడిటింగ్: సనల్ అనిరుధన్
నిర్మాత: వి. ఆనంద్ ప్రసాద్
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: చంద్ర శేఖర్ యేలేటి
విడుదల : 26 -02-2021
ఒక్క మాటలో: ప్రేక్షకులకు చెక్
రేటింగ్: 2.25
– ఆర్కే