హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్ కొట్టినా ఆ తర్వాత సరైన సినిమా ఏదీ పడలేదు. తాజాగా భవ్య క్రియేషన్స్ సంస్థ మహేష్ దర్శకత్వంలో హంట్ సినిమా రూపొందించింది. ఇందులో సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, భరత్ నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
అర్జున్ ప్రసాద్(సుధీర్ బాబు) పోలీస్ శాఖలో ఏసీపీ. తన మిత్రుడైన ఆర్యన్ (భరత్) హత్య కేసును దర్యాప్తు చేస్తూ ఆ హత్య కేసును ఛేదించినట్టు కమిషన్ మోహన్ (శ్రీకాంత్)కు చెబుతుండగానే ఆతను ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురవుతుంది. దాంతో అతను తన గతాన్ని మరచిపోతాడు. అతని గతాన్ని మోహన్ గుర్తు చేసి మళ్లీ ఆ కేసు దర్యాప్తు బాధ్యతను అతనికే అప్పగిస్తాడు మోహన్. అర్జున్ కు గతం గుర్తులేని విషయాన్ని వారిద్దరి మధ్యే ఉంచుతాడు. అర్జున్ తో కలిసి చేసిన ఓ టెర్రరిస్టు ఆపరేషన్ లో ఆర్యన్ కు గుర్తింపు వచ్చి గ్యాలంట్రీ అవార్డుకు ఎంపికవుతాడు. వేదిక మీద ఆ అవార్డు అందుకుంటున్న తరుణంలో అతను హత్యకు గురవుతాడు. హంతకుడెవరో తెలుసుకున్న అర్జున్ ఆ విషయాన్ని మోహన్ కు చెప్పేలోపే ప్రమాదానికి గురై గతాన్ని మరచిపోతాడు. దాంతో కథ మొదటి వస్తుంది. మళ్లీ మొదట్నుంచీ దర్యప్తు చేస్తున్న చేస్తున్న అర్జున్ కు ఎదురైన సవాళ్లు ఏమిటి? అసలు హంతకుడెవరు? చివరికి ఈ కేసును ఎలా ముగించారు ? అన్నదే ఈ కథలో కీలక అంశం. ఈ సినిమా క్లైమాక్స్ తెలిస్తే ఇక సినిమా చూడనవసరం లేదు. అందువల్ల కథ గురించి తెలియకుండా సినిమా చూస్తే మేలు.
ఎలా తీశారు? ఎలా చేశారు?
సినిమా చూస్తుంటే ఇది కొరియన్ సినిమా కథలా అనిపిస్తుంది. ఇది గతంలో మలయాళంలో వచ్చిన ముంబయి పోలీస్ అనే చిత్రానికి రీమేక్. కథ ఎంపిక విషయంలో దర్శకుడు మహేష్ జాగ్రత్త పడినా టేకింగ్ విషయంలో గాడి తప్పాడు. ఇంతకుముందు నారా రోహిత్ హీరోగా కథలో రాజకుమారి అనే సినిమా చేసిన మహేష్ ఈ సినిమా విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే కచ్చితంగా హిట్ వచ్చి ఉండేది. కేసు ఛేదించే విషయంలో రకరకాల పాత్రల్ని తీసుకు రావడం ప్రేక్షకుల్ని డైవర్ట్ చేయడం కోసమే. అందువల్లే సినిమా సరైన దారిలో వెళుతున్న ఫీలింగ్ కలగదు.
కథనంలో మహేష్ ప్రత్యేకత ఏమీ కనపించలేదు. ఒకవిధంగా డైరెక్టర్ పనితనం ఈ సినిమాకు మైనస్ అని చెప్పాలి. సుధీర్ నటన బాగుంది. ఈ పాత్ర పోషణ విషయంలో అతను బాగా కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ ఫలితం మాత్రం రాలేదు. భరత్ తన పాత్ర వరకూ మెప్పించాడు. ఇక శ్రీకాంత్ కు కమిషనర్ గా మంచి గుర్తింపు వచ్చే పాత్ర అయినా సినిమాలో దమ్ము లేకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. ఇలాంటి సినిమాలను ఉత్కంఠ భరితంగా రూపొందించగలగాలి. లేకుండా ఇలాంటి కథల జోలికి వెళ్లకూడదు. హీరోయిన్ కు స్కోప్ లేని సినిమా ఇది. అందువల్ల ఇందులో పాటల్ని ఆశించకూడదు. ఒక పాట మాత్రం ఉంది. జీబ్రాన్ నేపథ్య సంగీతం బాగుంది.
నటీనటులు: సుధీర్ బాబు, భరత్, శ్రీకాంత్, చిత్ర శుక్లా, అసిఫ్ తాజ్, కబీర్ దుహాన్ సింగ్, మైమ్ గోపి తదితరులు
కెమెరా: అరుల్ విన్సెంట్
సంగీతం: జిబ్రాన్
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
కథ – స్క్రీన్ ప్లే: బాబీ – సంజయ్
దర్శకత్వం: మహేష్ సూరపనేని
ఒక్క మాటలో: తూటాలతో పనిలేని వేట
రేటింగ్ : 2/5
– హేమసుందర్