బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తో బాలయ్య సినిమా అంటే అంతకంటే క్రేజ్ ఇంకేముంటుంది. అందుకే భగవంత్ కేసరి మీద అంచనాలు అంతకంతకూ పెరిగిపోయాయి. షైన్ స్క్రీన్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
ఇది భగవంత్ కేసరి (బాలకృష్ణ) జైలు జీవితంతో ప్రారంభమైన కథ. అతనిలోని సూపర్ హీరో ఆ జైలర్ (శరత్ కుమార్) కూతురు విజ్జీ పాప (శ్రీలీల)కు ఎంతో నచ్చుతాడు. ఆ జైలర్ ఆకస్మిక మరణంతో ఆమెను తన కూతురులా పెంచుతాడు భగవంత్ కేసరి. ఆమెను ఆర్మీకి పంపాలన్నది భగవంత్ లక్ష్యం. కానీ ఆమె ఓ కుర్రాడి ప్రేమలో పడుతుంది. ఆ విషయంలో అభ్యంతరం చెప్పడంతో పెంచిన తండ్రి మీద విముఖత పెంచుకుంటుంది విజ్జీ పాప. విజ్జీ పాపను ఆర్మీకి పంపే విషయంలో ఆమెలో ఉన్న ఫోబియాను నివారించే క్రమంలో సైకాలజిస్ట్ కాత్యాయని(కాజల్)తో భగవంత్ కు పరిచయం ఏర్పడుతుంది. వీరి కథ ఇలా ఉంటే ఉప ముఖ్యమంత్రి(శుభలేఖ సుధాకర్)ని చంపిన విలన్ అర్జున్ రాంపాల్ ఆ కేసు సంబంధంగా విజ్జీ పాపతో కనెక్ట్ అవుతాడు. దాంతో విజ్జీ చిక్కులో పడుతుంది. భగవంత్ రంగంలోకి దిగి ఆమెను రక్షించడమే ఈ చిత్ర కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
అండర్ కరెంట్ గా మంచి మెసేజ్ తో దర్శకుడు ఈ కథను తెరకెక్కించడంతో ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మారింది. దర్శకుడు తన స్కూలు దాటి వెళ్లే ప్రయత్నం చేయకపోయినా బాలయ్య బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కథనాన్ని మలుచుకున్నాడు. ఆడ పిల్లను లేడి పిల్లలా కాకుండా పులి పిల్లలా ఎందుకు పెంచాలో చక్కగా చూపించాడు. బాలయ్యతో రొటీన్ ఫైట్లు చేయించకుండా కొత్తగా చేయించే ప్రయత్నం సఫలీకృతమైంది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో తన డైలాగులు, తెలంగాణ యాసతో ఆకట్టుకున్నారు బాలయ్య. ఇక శ్రీలీల ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటజీవితంలో ఇది మంచి పేరు తెచ్చే పాత్ర అవుతుందనడంలో సందేహం లేదు. హైడోస్ యాక్షన్ సన్నివేశాలకు ఇందులో కొదవ లేదు.
డైలాగుల పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మనిషికి ధైర్యం అవసరం ఏమిటో డైలాగుల రూపంలోనూ, పాత్రల రూపంలోనూ చక్కగా చూపించారు. ‘నువ్ ఏడ నున్నా ఇట్లా దమ్ముతో నిలబడాలి అప్పుడు నిన్ను దునియా బాంచన్ అంటది’లాంటి పంచ్ డైలాగులకు కొదవ లేదు. ఆర్మీ శిక్షణకు వెళ్లడానికి విజ్జీకి ఇష్టం లేక ‘నీకు దణ్ణం పెడతా నన్ని ఇడిసెయ్ చిచ్చా’ అన్నప్పుడు ‘బిడ్డనైతే ఇడిసిపెట్ట బతిమిలాడుతా, బుజ్జ గిస్త.. అవసరం అయితే కాళ్లు పట్టుంకుంటా రా భాయ్.. బిడ్డని స్ట్రాంగ్ చెయ్యాలి.. షేర్ లెక్క’ అనే మాటలే ఈ సినిమాని నిలబెట్టాయి. సెక్రటేరియట్ లో ఓ ఉన్నతాధికారి ఇంటికి వెళ్లి భగవంత్ కేసరి నిజం చెప్పి బెదిరించిన తీరు ఓ హైలైట్.
అలాగే ఆడపిల్లల్ని చిన్న వయసులోనే మృగాళ్ల నుంచి ఎలా మేల్కొలపాలో భగవంత్ ఇచ్చే సందేశం ఈ సినిమాని మరో మెట్టుపై నిలిపింది. కథ, కథనం, సన్నివేశాల విషయంలో మాస్ రూట్ లోనే వెళ్లాడు దర్శకుడు. ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన సందర్భంలో ఎస్పీ వచ్చి సీఐ భగవంత్ తో అతన్ని విడిచి పెట్టేయమని అంటే ‘ఒక లఫూట్ గాడిని విడిపించడానికి ఇంకో లఫూట్ వచ్చాడా?’ అనే డైలాగ్ కూడా బాగా పేలింది. తమన్ కూడా మంచి బీజీఎం ఇవ్వడానికి ఎంతో తపించాడు. అలాగే సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ పనితనం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
నటీనటులు: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్, మురళీధర్ గౌడ్, సుబ్బరాజు తదితరులు.
సాంకేతిక వర్గం: కెమెరా సి. రాంప్రసాద్, సంగీతం తమన్, ఎడిటింగ్ తమ్మిరాజు.
నిర్మాతలు: సాహు గారపాటి-హరీష్ పెద్ది
దర్శకత్వం: అనిల్ రావిపూడి
విడుదల తేదీ: 19-10-2023
ఒక్క మాటలో: ఆడది అబల కాదు సబల అని నిరూపించే ప్రయత్నం
రేటింగ్: 3.5/5
– హేమసుందర్