2020 సంవత్సరానికి గాను నోబెల్ అకాడమీ వైద్యరంగంలో విశేష సేవలందించిన వారిని విజేతలుగా ప్రకటించారు. అత్యంత ప్రమాదకరమైన హెపటైటిస్ సి వైరస్ పై పరిశోదనలు చేసిన అమెరికా వైరాలజీ శాస్త్రవేత్త హార్వే జె ఆల్టర్, బ్రిటీష్ పరిశోధకుడు మైకేల్ హాటన్, అమెరికా ప్రొఫెసర్ చార్లెస్ ఎం రైస్ లకు ఈ అవార్డు దక్కింది. గత కొంత కాలంగా వీరు హెపటైటిస్ సి వైరస్ పై పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనల ద్వారా ఈ వైరస్ కు ఎలాంటి చికిత్స అందించాలో తెలిసింది. వీరు చేసిన సేవలకు అత్యున్నత పురస్కారం దక్కడంపై ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
ప్రాణాంతక వ్యాదిపై పరిశోధనలు
మానవాళిని హెపటైటిస్ వ్యాధి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మూడు కేటగిరిలుగా ఈ వైరస్ ను విభజించారు. రక్తం ద్వారా వ్యాపించే ఈ వైరస్ ను హెపటైటిస్-ఎ, హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీలుగా విభజించారు. ఇప్పటికే హెపటైటిస్-ఎ, హెపటైటిస్-బీ లక్షణాలను గుర్తించిన శాస్త్రవేత్తలు దానికి చికిత్స అందిస్తున్నారు. కానీ మానవాళి పాలిట ప్రాణాంతకంగా పరిణమించే హెపటైటిస్-సీ చికిత్స వైద్యులకు అంతుపట్టలేదు. హెపటైటిస్ సి సోకితే లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారినపడతారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో హెపటైటిస్ సి పై అనేక మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు జరిపారు.
అమెరికా శాస్త్రవేత్త హార్వే జె ఆల్టర్, బ్రిటీష్ పరిశోధకుడు మైకేల్ హాటన్, అమెరికా ప్రొఫెసర్ చార్లెస్ ఎం రైస్ లు ఈ వైరస్ పై విశేష పరిశోధనలు జరిపి నివేదికలను తయారు చేశారు. అంతే గాకుండా ఈ వైరస్ జన్యుక్రమాన్ని కనుగొన్నారు. దీంతో ఈ వైరస్ చికిత్స చాలా సులభం కానుంది. ఇప్పటి వరకు బ్లడ్ టెస్ట్ లలో కూడా వెల్లడికాని హెపటైటిస్-సీ వీరి పరిశోధనల ఫలితంగా ఈజీగా వెల్లడికానుంది. ఈ పరిశోధనల కారణంగానే వ్యాక్సిన్ లు కూడా సిద్ధం కానున్నాయి. ఈ ముగ్గురిని ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ ను ఎంపిక చేసినట్లు అకాడమీ ప్రకటించింది.











