గతంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో కొందరు జర్నలిస్టులు నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయ పార్టీలతో పాటు జర్నలిస్టులు సైతం బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, టిజెఎస్, బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకొని నువ్వా నేనా అని తలపడుతున్నాయి. మరోపక్క వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు సైతం తామూ పోటీలో ఉన్నామని ఇప్పటికే ప్రకటించడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌రావు, ఇంటిపార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్‌తో పాటు కొందరు జర్నలిస్టులు కూడా పోటీలో ఉన్నట్లు ప్రకటించడంతో ఎన్నికల వాతావరణం మరింతగా హీటెక్కింది.
ఈ స్థానాలకు పోటీ..
2021 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్, నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ రెండు స్థానాల ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. దీనికోసం ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో అధికారులు, పార్టీ నేతలు తలమునకలయ్యారు. జర్నలిస్టుల నుంచి ఈసారి పోటీ చేస్తున్న వారిలో ప్రముఖంగా తీన్నార్ మల్లన, రాణిరుద్రమ, పివి శ్రీనివాస్, జయసారధితోపాటు మరికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎక్కువ మంది నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోసారి బరిలో తీన్మార్ మల్లన్న..
తీన్నార్ మల్లన్న(నవీన్‌కుమార్) ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా పోటీలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తీన్నార్ మల్లన్న గతంలో విసిక్స్ ఛానల్‌లో పనిచేసి తరువాత మరొక ఛానెల్‌కు మారారు. ప్రస్తుతం క్యూ న్యూస్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతూ నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యే చర్చాకార్యక్రమాలను న్యూస్ ఛానెల్ వేదికగా నడిపిస్తున్నారు.
యువతెలంగాణ పార్టీ రాణి రుద్రమ
గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీ న్యూస్, టీవీ9, సాక్షి, హెచ్ ఎం టీవీ లలో రాణిరుద్రమ దేవి పనిచేసినట్లు మీడియా వర్గాల ద్వారా తెలిసింది. మీడియాలో పని చేసిన అనుభవంలో పాటు యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పని చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీగా ప్రధాన పార్టీలకు ఆమె గట్టి పోటీ ఇచ్చారు. తాజాగా వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నట్టు ఆమె ప్రకటించి ప్రత్యర్థులకు గట్టి పోటీనివ్వబోతోంది.
ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలో సీనియర్ జర్నలిస్ట్ గా పని చేస్తున్న జయ సారధి మొదటి సారిగా రాజకీయాల్లో పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తాను బరిలో నిలుస్తున్నట్లు తన సన్నిహితుల దగ్గర, మీడియా మిత్రుల దగ్గర చెప్పినారు. సిపిఐ పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీ పోటీలో దిగనున్నట్టు సహచరులతో తెలిపాడు. మొదట కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుందనే విశ్వాసం ఉన్నప్పటికీ మద్దతిచ్చే విషయం ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది.
అలాగే పీ వీ శ్రీనివాస్ టీ న్యూస్ ఇన్ పుట్ ఎడిటర్ గా పనిచేస్తూ టిఆర్ఎస్ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు. గతంలో టీవీ9 లో పని చేసిన అనుభవం ఉంది. ఈయన విద్యార్థి ఉద్యమాల్లో కూడా గతంలో పని చేశారు. ఓ వామపక్ష పార్టీతో కూడా ఈయనకు సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. అలాగే తనకున్న ప్రజాసంఘాలతో ఉన్న అనుబంధం ఎన్నికలకు కలిసి వస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఎమ్మెల్యే బరిలో..
గతంలో ఎమ్మెల్యే బరిలో జర్నలిస్టుగా అందోల్ ఎమ్మెల్యే క్రాంతి బరిలో నిలిచి గెలుపొందారు. అలాగే రాణిరుద్రమ కూడా పోటీలో నిలిచి ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చిన విషయం తెలిసిందే. అలాగే మరికొంతమంది కూడా స్వతంత్రులుగా ఎన్నికల బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. మళ్లీ ఈసారి కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జర్నలిస్టులు సైతం పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. బరిలో దిగుతున్న జర్నలిస్టుల పేర్లు ప్రస్తుతం కొందరివే వినిపిస్తున్నా చివరి నిమిషంలో పోటీచేసేవారి పేర్లు మరికొన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జర్నలిస్టు సంఘాల ఓట్లు కూడా చెరోవైపు చీలిపోయే అవకాశం ఉంది. వివిధ సంఘాల జర్నలిస్టులు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంది.