తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం. అంటే ప్రభుత్వం గాడి తప్పుతోంటే ప్రధానంగా పోరాడాల్సిన పార్టీ.. అయితే ఆ పార్టీలో ప్రస్తుతం నలుగురైదుగురు మినహా మాట్లాడేవారే కరవయ్యారు. ఇక క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు ఎప్పుడో మరిచిపోయారు. అమరావతి రాజధాని ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేద్దామని భావించిన టీడీపీ అధినేతకు కరోనా వైరస్ భయం పట్టుకుంది. సరే ఆయనంటే వయసురీత్యా పెద్దవారు అని సర్దిచెప్పుకోవచ్చు. యువనేత లోకేష్ ఇలాంటి సమయంలో చాలా చురుగ్గా పార్టీ వ్యవహారాలు చక్కబెడితే క్యాడర్ కు ధైర్యం వస్తుంది. కానీ అలాంటిది జరగడం లేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారానికి ఒకసారి లెక్కప్రకారం జూమ్ లో లైవ్ పెడతారు. ఏదో కొన్ని ప్రజల సమస్యలను ప్రస్తావిస్తారు. ఇక లోకేష్ విషయానికి వస్తే ఆయన ట్విట్టర్ కే పరిమితం అయ్యారు.
టీడీపీ కార్యకర్తలు అధికారం పక్షంతో చేసే పోరాటంలో జైలు పాలవుతున్నారు. అలాంటి వారి పట్ల పార్టీ అండగా నిలవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరినైనా పార్టీ నేతలను అరెస్టు చేస్తే, ఖండించడం, వారు విడుదల అయితే కుదిరితే వారిని ఫోన్ లో పలకరించడం మినహా పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ రావడం లేదని కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితి టీడీపీ బలహీనపడటానికి దారితీసే ప్రమాదం ఉందని ఆ పార్టీ పెద్దలు గ్రహించాలి. క్షేత్ర స్థాయిలో జెండా పట్టేవారు లేకపోతే ఏ పార్టీ పరిస్థితి అయినా ప్రమాదంలో పడ్డట్టేనని గ్రహించాలి.
పదవులు అనుభవించిన వారేమయ్యారు?
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులతోపాటు, అనేక మంది ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ పదవులు పొందారు. కొందరు నామినేటెడ్ ఛైర్మన్ పదవులు దక్కించుకున్నారు. వారంతా ఇప్పుడేమయ్యారు. ఇలా దాదాపు టీడీపీలో పదవులు అనుభవించిన వారు ప్రతి జిల్లాలో 20 మందికి తగ్గకుండా ఉంటారు. వారంతా చీకటి గుహల్లోకి వెళ్లారా అనే అనుమానం రాకమానదు.
ఎప్పుడు చూసినా ఆ నలుగురే…
అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభించిన వారే క్షేత్రస్థాయిలో కనిపించకపోతే, ముందుండి ప్రజల సమస్యలపై పోరాడకపోతే ఇక కార్యకర్తల సంగతేంటి? పదవులు అనుభవించిన వారికే పార్టీపై ప్రేమ లేకపోతే మేము ఎందుకు పోరాటాలు చేసి జైలుకు పోవాలా అని అంతర్గత సంభాషణల్లో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతల పనితీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బయటపడుతుందంటారు. పదవులు అనుభవించడానికి అనేక మంది వస్తారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్లిన వారే అసలైన నేత. అలాంటి వారు ఇప్పుడు టీడీపీలో దుర్భిణి వేసినా కనిపించడం లేదు.
ఏ సందర్భం వచ్చినా.. మీడియా ముందుకు వచ్చి గళం విప్పే వారు పార్టీలో నలుగురైదుగురికి మించి లేరు. పేర్లు అనవసరం- ఎందుకంటే.. మీడియాలో చురుగ్గా ఉండే నేతలెవరంటే రాష్ట్రంలో ఎవ్వరైనా టక్కున నాలుగు పేర్లు చెప్పగలరు. అంతకు మించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కొందరు నేతలైతే.. తాము ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నామని, తెలుగుదేశం పార్టీ కూడా సజీవంగా ఉందని గుర్తు చేయడానికి అన్నట్లుగా నెలకోసారి చిన్న ప్రెస్ మీట్ పెట్టి, చిన్న ప్రెస్ రిలీజ్ విడుదల చేసి రోజులు నెట్టుకొస్తున్నారు. అంతకు మించి.. క్రియాశీలింగా, నిర్దిష్టంగా, నిర్మాణాత్మకంగా.. ప్రతిపక్షహోదాకు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్న వారు అతి తక్కువ.
అమరావతి రాజధాని ఉద్యమం నీరుగారిపోవడమే ఇందుకు ఉదాహరణ. రాజధాని అనేది కేవలం 29 గ్రామాల రైతుల సమస్య కాదు. 13 జిల్లాల్లోని 5 కోట్ల మంది సమస్య. కానీ కేవలం అమరావతి ఉధ్యమం 29 గ్రామాలకే మిగిలిపోవడానికి టీడీపీ నేతలే ప్రధానం కారణం అంటే తప్పుకాదేమో…
అమరావతికి కూడా మొహం చాటేయాలా?
రాజధాని ఉద్యమానికి గుంటూరు, కృష్ణా జిల్లా టీడీపీ నేతల్లో కొందరు మినహా.. మిగిలిన అందరూ మంగళం పాడారనే చెప్పవచ్చు. అసలు కనిపించకపోతే భవిష్యత్ లో తిరగడం కష్టం అవుతుందన్నట్లుగా వారు చేస్తున్నారు. రాజధాని రైతుల ఉద్యమం కోసం వేసిన టెంటుల్లో దూరడం మీడియాతో మాట్లాడటం తరవాత చల్లగా జారుకోవడం ఇదా టీడీపీ నేతలు చేయాల్సింది.. వారినుంచి ఆశిస్తున్నది ఇదేనా అని అక్కడ ఆందోళన చేస్తున్నవారు వాపోతున్నారు. వారి నియోజకవర్గ స్థాయిలో ఉద్యమం నడపలేరా. అమరావతి అందరిదీ అని చాటలేరా? అనే భావన ప్రజల్లో వస్తోంది.
చంద్రబాబు నాయుడు నాయకుల్ని సమీకరించడంలో దిట్ట. అయితే.. గత ఏడాది కాలంగా పార్టీలోని నాయకుల్ని క్రియాశీలంగా ఉంచడంలో ఆయన ఎందుకు ఫెయిలవుతున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆయన ఒక్కరూ ప్రతి సందర్భంలో స్పందిస్తున్నప్పటికీ.. పార్టీకి అది చాలదు. ప్రతి ఒక్కరూ స్పందించేలా చేయగలిగితేనే చంద్రబాబు నాయకత్వ పటిమ నిరూపణ అవుతుంది.