తాత వచ్చాడంటే.. ఏ మనవడికైనా పండగే మరి. అయితే హర్యానా రాజకీయాలను శాసించిన చౌతాలా ఫ్యామిలీలో మాత్రం.. ఈ తరహా పరిణామం తీవ్ర చిక్కులను తెచ్చేలానే ఉంది. ఎందుకంటే.. హర్యానా అధికార కూటమిలో కీలక నేతగానే కాకుండా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా దుష్యంత్ చౌతాలా కొనసాగుతుంటే.. ఆ సంకీర్ణ సర్కారును ఇబ్బంది పెట్టేలా ఓం ప్రకాశ్ చౌతాలా రైతులకు మద్దతు ప్రకటించారు. హర్యానాలో ప్రస్తుతం బీజేపీ, చౌతాలా పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. కొత్త సాగు చట్టాలపై రైతులు పెద్ద ఎత్తున చేస్తున్న నిరసనలతో హర్యానా పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేంద్రంలోని మోదీ సర్కారు నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్లడం హర్యానా సంకీర్ణ సర్కారుకు సాధ్యం కాదు. అదే సమయంలో ఓం ప్రకాశ్ చౌతాలా రైతు ఉద్యమానికి మద్దతు పలకడమంటే… దుష్యంత్ కు ఇబ్బందే కదా.
సీనియర్ చౌతాలా విడుదల
హర్యానా రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా హర్యానా సీఎంగానూ వ్యవహరించారు. తన హయాంలో చోటుచేసుకున్న జూనియర్ టీచర్ల రిక్రూట్ మెంట్ లో భారీ కుంభకోణం జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరగగా.. చౌతాలా దోషిగా తేలారు. వెరసి ఆయనకు కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది. అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్న చౌతాలా.. ఇటీవలే కరోనా నేపథ్యంలో గతేడాది మేలో అత్యవసర పెరోల్ పై ఆయన బయటికి వచ్చారు. తాజాగా ఆయనను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ కాగా.. శుక్రవారం సీనియర్ చౌతాలా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా తీహార్ జైలు నుంచి విడుదలైన చౌతాలాకు ఆయన మద్దతుదారులు భారీ ఎత్తున తరలివచ్చి ఢిల్లీ-గుర్గావ్ సరిహద్దుల్లో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన చౌతాలా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతు ప్రకిటంచారు. రైతుల కు అండగా ఉంటామని చౌతాలా వెల్లడించారు.పేదలు, బలహీన వర్గాలు, రైతులకు మద్దతుగా ప్రభుత్వాలపై తన పోరాటం కొనసాగుతందని చౌతాలా తెలిపారు.
దుష్యంత్ దారి ఎటో?
అంటే.. మనవడికి పదవి ఇచ్చి, తన పార్టీతో అధికారంలో కొనసాగుతున్న సంకీర్ణ సర్కారుపై సీనియర్ చౌతాలా యుద్ధం ప్రకటించినట్టే కదా. అంతేకాకుండా ఏకంగా సదరు సంకీర్ణ సర్కారులో తన మనవడు, తాను స్థాపించిన ఐఎన్ఎల్టీకి చీఫ్ గా ఉన్న దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి ఈ సంకీర్ణ సర్కారుకు నిరసనగా సీనియర్ చౌతాలా యుద్ధం ప్రకటించారంటే.. వైరివర్గంలో ఉన్న జూనియర్ చౌతాలాపై పోరు మొదలెట్టినట్టే కదా. మరి తాత పోరును మనవడు ఎలా అడ్డుకుంటారో? లేదంటే తాత పక్షమే వహించి డిప్యూటీ సీఎం పదవినే వదులుకుంటారో చూడాలి. మొత్తంగా సీనియర్ చౌతాలా విడుదల జూనియర్ చౌతాలా పదవికి గండి కొట్టనుందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.











