రిజర్వు ఫారెస్టులో చెట్టును నరికడం పెద్ద నేరం. కేంద్రం అనుమతి లేకుండా ఫారెస్టులో చిన్న పని కూడ చేయలేరు. అలాంటిది వైసీపీ పెద్దల కోసం వేల సంఖ్యలో చెట్లను నరికి కాలినడకను టిప్పర్లు తిరిగిందుకు వీలుగా పెద్ద దారిగా మార్చారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు కళ్లు మూసుకోవడానికి కారణం అధికార పార్టీకి చెందిన అస్మదీయలకు సంబంధించినది కావడమే. పైగా గిరిజనుల రోడ్డు కల తీరుస్తున్నామంటూ పంచాయతీరాజ్ శాఖ ఒక జీవో కూడ జారీ చేసింది. లేటరైట్ అనే ఖనిజాన్ని ఇక్కడ నుంచి కడపకు తరలించటానికి నెలన్నరలో ఈ తతంగమంతా ఏజెన్సీలోని తూర్పుగోదావరి-విశాఖపట్నం సరిహద్దుల్లో పూర్తి చేశారు.
30 అడుగుల రోడ్డుగా మారిన బాట
పచ్చటి అడవి, కొండల్లోంచి సాగే దాదాపు 12 కిలోమీటర్ల బాట ప్రస్తుతం 30 అడుగుల వెడల్పైన రోడ్డుగా మారింది. దానిపై టిప్పర్లు ‘లేటరైట్’ ఖనిజాన్ని తరలిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా వేసిన ఈ రోడ్డు కోసం దశాబ్దాల వయసున్న టేకు, నల్లమద్ది, తెల్లమద్ది వంటి చెట్లను కొట్టేశారు. అధికార వైసీపీకి అస్మదీయులైన వారి కోసం కావడంతో అధికారులు కిమ్మనలేదు. విశాఖ జిల్లా నాతవరం మండలం భమిడికలొద్ది వద్ద ఖరీదైన లేటరైట్ ఖనిజం ఉన్న కొండలున్నాయి. ఓ లీజుదారుడిని దారికి తెచ్చుకుని 271 హెక్టార్లలో విస్తరించిన ఈ ఖనిజంపై సర్కారు ముఖ్యనేత వాలిపోయారు. తవ్విన లేటరైట్‌ను జాతీయ రహదారి మీదుగా కడపలోని మరో ముఖ్యనేత సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించే దగ్గరే చిక్కొచ్చింది. సాధారణంగా అయితే విశాఖ జిల్లా నాతవరం నుంచి కోటనందూరు మీదుగా తుని హైవే పైకి రావాలి. ట్రాఫిక్ అవాంతరాలుంటాయి. అన్నింటికీ మించి లేటరైట్ కొండ విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది. అక్కడ ప్రతిపక్ష పార్టీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందనే భయం కూడా ఆ నేతలను వెంటాడుతోంది.
గుట్టుగా తరలించడానికి..
దీంతో తవ్విన లేటరైట్‌ను తూర్పు గోదావరి జిల్లా మీదుగా గుట్టుగా తరలించడానికి ప్రణాళికలు వేశారు. దీంతో విశాఖ జిల్లా భమిడికలొద్ది లేటరైట్ క్వారీకి అతి సమీపంలో ఉన్న రౌతులపూడి మండలంపై దృష్టి పడింది. విశాఖ జిల్లాలోని లేటరైట్ కొండ నుంచి తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం జల్దాం వరకు 12 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే అక్కడి నుంచి కత్తిపూడి హైవే మీదుగా కడపకు లేటరైట్ తరలింపు సులువుగా ఉంటుందని స్కెచ్ వేశారు. వెంటనే ఓ ప్రముఖ ఆలయ మాజీ చైర్మన్ తనయుడు రంగంలోకి దిగారు. పంచాయతీరాజ్ శాఖను కూడా రంగంలోకి దించారు. ఉపాధి హామీ పని పేర గిరిజనుల రహదారి కోసమంటూ ఈ మార్గమంతా కొండలు కొట్టి గ్రావెల్ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయించారు. గత మార్చి 3వ తేదీన రహదారి నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరుచేస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో నంబర్ 174 జారీ చేసింది. వాస్తవానికి దీనితోపాటు అదే జీవోలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో 188 రహదారుల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేశారు. కానీ, ఆ పనులేవీ పెద్దగా జరగలేదు. కానీ నెలన్నరలోనే భమిడికలొద్ది నుంచి జల్దాం వరకు గ్రావెల్ రోడ్డు పడిపోయింది. అదీ ఉపాధి హామీ నిధులతో ! ఇందులోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉపాధి హామీ పనులను యంత్రాలతో చేపట్టరాదనేది ఒక నిబంధన. కానీ, ఓ కాంట్రాక్టరు ద్వారా పెద్ద పెద్ద యంత్రాలతో రహదారిని వేగంగా పూర్తి చేశారు.
రిజర్వ్ ఫారెస్టులో..
ఈ మార్గంలోని చెల్లూరు- భమిడికలొద్ది మధ్య అయిదు కిలోమీటర్ల పరిధి రోడ్డు పూర్తిగా రిజర్వ్ ఫారెస్టులో ఉంది. అటవీశాఖ అనుమతులు లేకుండా ఇక్కడ ఎలాంటి పనులు చేయకూడదు. కానీ ఇవేవీ పట్టించుకోలేదు. ఈ రోడ్డు కోసం అడ్డంగా ఉన్న టేకు, దండారి, నల్లమద్ది, తెల్లమద్ది, తుమ్మిడి, తెల్లగర్ర వంటి విలువైన భారీ వృక్షాలను నేలకూల్చేశారు. దాదాపు ఆరేడువేల చెట్లను నరికినట్లు స్థానికులు చెబుతున్నారు. నరికిన చెట్ల ఆనవాళ్లు దొరకకుండా దుంగలుగా మార్చి వేరే చోటకు తరలించారు. వన్యప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే స్పృహ కూడా లేకుండా అడ్డగోలుగా నేలకూల్చేశారు. ఇంత రహదారి నిర్మాణానికి వాస్తవానికి ఎన్నెన్నో అనుమతులు కావాలి. తమకు అనుమతి ఉందంటూ 2019 నాటి లేఖను అధికారులు చూపుతున్నారు. పైగా కేవలం 425 మీటర్ల రిజర్వుఫారెస్టు పరిధిలో 21 చెట్లు మాత్రమే తొలగించామని చెప్పడం విశేషం. రిజర్వు ఫారెస్టులో ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలంటే ఐటీడీపీ పీవో అనుమతి తప్పనిసరి. కానీ ఇక్కడ ఇవేం లేకుండా టిప్పర్లు తిరిగేందుకు 30 అడుగులకు మించి రోడ్డు నిర్మించేశారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంతో భారీ యంత్రాలు మోహరించి ఎక్కడికక్కడ చెట్లతోపాటు కొండలను కూడా గుల్ల చేశారు. అధికార పెద్దల కనుసన్నల్లో జరిగిన ఈపనికి అటవీశాఖ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు.
గిరిజనులకు టోపీ..
జల్దాం నుంచి చెల్లూరు వరకు రోడ్డు 85 మంది గిరిజనులకు చెందిన డీపట్టా భూముల్లోంచి వెళ్లింది. ఆ భూముల్లోని వందలాది జీడి చెట్లను అడ్డంగా నరికేశారు. పని ప్రారంభించేటప్పుడు సెంటుకు ఆరువేల చొప్పున పరిహారం చెల్లిస్తామని మాట ఇచ్చి తర్వాత పైసా కూడా ఇవ్వలేదు. పోయిన భూమికి పరిహారం ఎప్పుడిస్తారా ఈ బాధితులంతా ఎదురు చూస్తున్నారు. ఈ అడ్డగోలు రోడ్డు విషయం స్థానిక నియోజకవర్గ వైసీపీ కీలకనేతకు తెలుసు. అయితే సర్కారు ముఖ్యనేతల పని కావడంతో తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. ఈ పనులన్నీ ఉపాధి హామీ పథకం కింద కూలీలతో చేయించినట్లు మస్తర్లు సిద్ధం చేయిస్తున్నారు. కానీ అసలు రోడ్డు నిర్మాణం అంతా కాకినాడ స్మార్ట్ సిటీలో వందల కోట్ల కాంట్రాక్టు పనులు చేస్తున్న ఓ ప్రముఖ కంపెనీ యజమాని కనుసన్నల్లో జరిగింది. భమిడికలొద్ది నుంచి స్టాక్ పాయింట్ వరకు లేటరైట్ తరలింపు కాంట్రాక్టు ఆయనే దక్కించుకున్నారు.
చల్లూరు నుంచి కడపకు తరలింపు
భమిడికలొద్ది నుంచి రోజూ టిప్పర్లలో లేటరైట్ చల్లూరులో డంపింగ్ చేస్తున్నారు. ఇందుకు 25 ఎకరాల భూమిని ఓ వ్యక్తి నుంచి లీజుకు తీసుకున్నారు. ఈ స్టాకు యార్డు నుంచి కడప జిల్లా నుంచి వచ్చే లారీల్లో లోడింగ్ చేస్తున్నారు. ఇవి రౌతులపూడి మీదుగా కత్తిపూడి హైవేకి వస్తున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా సిమెంట్ లోడు అనే బోర్డులు లారీలపై కనిపిస్తున్నాయి. స్టాకు యార్డు వద్ద లేటరైట్‌ను లోడు చేసుకుంటున్న కొన్నిలారీలపై సదరు ముఖ్యనేత సిమెంట్ కంపెనీ పేరు కూడా కనిపించడం విశేషం.











