ఒక సినిమా రీమేక్ చేయడం… రైట్స్ తీసుకున్నంత తేలికకాదు. అందులోనూ, ఎవరైనా స్టార్ హీరోలతో ఆ సినిమాను రీమేక్ చేయాలనుకున్న నిర్మాతలకు.. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఏ హీరోతో చేయాలి? ఆ కథతో ఎలా కన్విన్స్ చేయాలి? వారి ఇమేజ్ ను పెంచేలా స్క్రిప్టు లో ఎలాంటి మార్పులు చేయాలి? అనేవి ఆటోమేటిగ్గా ప్రధాన అంశాలై కూర్చుంటాయి. మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ విషయంలో సితారా ఎంటర్ టైన్ మెంట్స్ వారికి ఇప్పుడు అదే అసలు ప్రాబ్లెమ్ అయింది. ఏ ముహూర్తాన నాగదేవర సూర్యవంశీ ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నారో అక్కడ నుంచి ఆయనకి కష్టాలు మొదలయ్యాయి.
ఇద్దరు స్టార్ హీరోలు పోటాపోటీగా నటించాల్సిన కథ అది. ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ కి , ఒక మాజీ హవల్దార్ కి మధ్య ఇగో క్లాషెస్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. దివంగత దర్శకుడు సచ్చీ ఈ సినిమాను జనరంజకంగా మలిచాడు. బిజూ మీనన్ , పృధ్విరాజ్ లాంటి గొప్ప నటుల పెర్ఫార్మెన్స్ కు మాలీవుడ్ ప్రేక్షకులు దాసోహం అయ్యారు. అలాంటి కాన్సెప్ట్ ను తెలుగులో తీయాలనుకోవడం.. మంచి ఆలోచనే. కాకపోతే.. ఇక్కడ హీరోల ఎంపిక విషయంలోనే ముందు నుంచీ నిర్మాతలకు కన్ఫ్యూజన్ వచ్చి పడింది. ముందుగా ఈ రైట్స్ తీసుకున్న నాగవంశీ .. బాలకృష్ణ తోనూ, రానాతోనూ సినిమాను తీయాలనుకున్నారట. అయితే ఈ కథమీద బాలయ్యకు ఆసక్తి లేకపోవడంతో.. ఆయన స్థానంలో రవితేజ ను ఎంపికచేయాలనుకున్నారు.
ఆ ఇద్దరూ నటించినా సినిమాకి మంచి వెయిట్ వస్తుంది. కానీ ఎందుకో.. నిర్మాతలు ఆ ప్రయత్నం కూడా మానుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా సీన్ లో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చి చేరారు. పవన్ ఈ సినిమా చేయబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయినప్పటికీ మరో సమస్య ఎదురైంది. మరో హీరోగా ఎవరిని ఎంపిక చేయాలి? ఒక వేళ రానానే తీసుకుంటే.. సురేష్ ప్రొడక్షన్స్ వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. స్క్రిప్టు విషయంలోనూ, నిర్మాణ వ్యవహారాల్లోనూ వారి జోక్యం ఎక్కువవుతుంది. డైలాగ్ వెర్షన్ ఆరేడు సార్లు మార్చే అవకాశాలున్నాయి. నిర్మాణం ఇంత కాంప్లికేటెడ్ గా మారుతుంది.
ఈ ప్రాసెస్ అంతా జరిగాక సినిమా సెట్స్ మీదకు వెళ్లడం పవన్ కు నచ్చే వ్యవహారం కాదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఐదారు సినిమాలు వరకూ ఉన్నాయి. వీటిలో ఆయన ఏ సినిమా కి డేట్స్ ఎప్పుడిస్తాడో తెలియదు. ఒకవేళ ఈ సినిమా కోసం ఆయన డేట్స్ కేటాయించినా.. వెంటనే మొదలైపోవాలి. ఆల్రెడీ గోపాలా గోపాలా సినిమా విషయంలో ఈ అనుభవాన్ని ఫేస్ చేశారు సురేష్ ప్రొడక్షన్స్ వారు. అందుకే ఈ ఇబ్బందులెన్నీ మరోసారి ఎదురయ్యే అవకాశాలున్నాయి కాబట్టి.. పవన్ కళ్యాణ్ నటిస్తే .. రానా నటించే పరిస్థితి లేదని .. ఇండస్ట్రీ టాక్. మొత్తం మీద ఒక్క మలయాళ సినిమా ఎంత పనిచేసిందని .. టాలీవుడ్ జనం చర్చించుకుంటున్నారు. మరి పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోయే లక్కీ హీరో ఎవరవుతారో చూడాలి.











