అమరావతి రాజధాని తరలింపుపై హైకోర్టులో అనేక వ్యాజ్యాలు నమోదయ్యాయి. వీటన్నింటిని పరిశీలించిన ధర్మాసనం, అమరావతి రాజధాని కేసులను నేటి నుంచి రోజువారీ విచారించాలని నిర్ణయించింది. అంశాల వారీగా పిటిషన్లు విచారించాలని ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని కేసులు విచారించడానికి ఢిల్లీ నుంచి వచ్చే న్యాయవాదులు, హైబ్రిడ్ సిస్టం ద్వారా వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని హైకోర్టును కోరారు. దీనిపై ధర్మాసనం ఇవాళ నిర్ణయం తీసుకోనుంది.
రోజువారీ విచారణతో సత్వర న్యాయం
అమరావతి రాజధానికి 29 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు 33 వేల ఎకరాల భూములను ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఎలాంటి పరిహారం పొందకుండానే భూములు అప్పగించారు. వారిచ్చిన భూమిలో నాలుగో వంతు భూమిని ప్రభుత్వం అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు రైతులు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటన చేశారు.
దీనిపై రైతులు హైకోర్టుకు ఆశ్రయించారు. రైతులతో పాటు అనేక మంది అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. అమరావతి రాజధానిపై దాదాపు వందకుపైగా కేసులు ఉన్నాయి. వీటన్నింటిని కలిపి విచారించాలని ధర్మాసనం గతంలోనే నిర్ణయించింది. అయితే ఈ కేసులపై నేటి నుంచి హైకోర్టు రోజువారీ విచారణ జరపనుంది. దీని ద్వారా అమరావతి రైతులకు సత్వర న్యాయం జరగనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఢిల్లీ న్యాయవాదులే కీలకం
అమరావతి రాజధాని తరలింపు కేసుల్లో సుప్రీం కోర్టులో పేరున్న న్యాయవాదులను రాజధాని రైతులు నియమించుకున్నారు. అయితే ఢిల్లీ న్యాయవాదులు గతంలో విచారణకు అమరావతి వచ్చి వెళుతూ ఉన్నారు. నేటి నుంచి రోజు వారీ విచారణ జరగనుండటంతో ప్రతి రోజూ ఢిల్లీ నుంచి కోర్టుకు హాజరు కావడం సాధ్యంకాదు కాబట్టి, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుని హైబ్రిడ్ విధానంలో ఆన్ లైన్ ద్వారా విచారణలో పాల్గొనే సదుపాయం కల్పించాలని ఢిల్లీ న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. దీనిపై హైకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకోనుంది.
అమరావతి రైతుల హర్షం
అమరావతి రాజధానిపై రోజువారీ విచారణ చేపట్టడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ విచారణ ద్వారా తమకు సత్వర న్యాయం చేకూరుతుందనే నమ్మకం కలుగుతోందని కృష్ణాయపాలేనికి చెందిన రైతు నాగార్జున అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చాలా మంది రైతులు రాజధాని తరలింపు వార్తలతో మనోవ్యధకు లోనై చనిపోయాయరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ విచారణతో నాలుగైదు మాసాల్లో తమకు న్యాయం జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.











