ఉల్లి ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం కంట కన్నీళ్లు పెట్టిస్తోంది. రెండు నెలల క్రితం కిలో రూ.15 ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రిటేల్ మార్కెట్‌లో రూ.80కి పైనే పలుకుతోంది. దీంతో ఉల్లి కొనాలంటేనే జనం జంకుతున్నారు. వంటింట్లో ఉల్లి నిలవలు పడిపోయినా ఆ ధరను చూసి కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇంత ధర పోసి కొనడం కన్నా ఉల్లి లేని కూరలతోనే పలువురు లాగించేస్తున్నారు. ఇలా ఉల్లి వంటింట్లో కుంపటిని రగుల్చుతోంది.
రూ.సెంచరీ దిశగా..
జూన్, జులై నెలలో కిలో ఉల్లి ధర దాదాపు రూ.15 వరకు ఉండేది. ఆ తరువాత క్రమంగా ఉల్లి ధర పెరుగుతూ పై పైకి పాకుతూ పోయింది. ప్రస్తుతం రిటేల్ మార్కెట్లో ఉల్లి ధర రూ.80 పైనే ఉన్నది. గ్రేడ్ తక్కువగా ఉన్న ఉల్లి రూ.60 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. గతంలో రూ.వందకు నాలుగు నుంచి 5 కిలోల ఉల్లిని విక్రయించేవారు. ఇప్పుడు రూ. వందకు కిలోన్నర ఉల్లి మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఉల్లిని కొనాలంటే వినియోగదారులు భయపడిపోతున్నారు. భారీగా పడిన వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఉల్లిపంట దెబ్బతిన్నది. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉల్లి పంట కుల్లిపోయింది. ఈ వానా కాలంలో తెలంగాణలో 5,500 హెక్టార్లు, ఏపీలో 15 వేల హెక్టార్లలో ఉల్లి పంట సాగుచేసినా పెద్దగా ఉల్లి పంట చేతికి రాలేదు.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి..
తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి ఉల్లి వస్తుంది. అయితే తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీ వర్షాలతో ఉలి సాగుకు భారీ నష్టం వాటిల్లింది. ఉల్లి చేలలో నుంచి నీరు బయటకుపంపే అవకాశాల్లేకపోవడంతో వేసిన పంట దెబ్బతిన్నది. ఉల్లి పంట సాగు చేయాలంటే రూ.50 వేలకు పైనే పెట్టుబడి అవుతుంది. పంట చేతికొచ్చే దశలోపంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాల నుంచి రోజుకు కనీసం 100 లారీలకు పైగా ఉల్లిగడ్డ తెలుగు రాష్ట్రాలకు చేరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో రైతు బజార్ల ద్వారా ఉల్లిని సబ్సిడీ కింద అందజేస్తున్నారు.
దిగుమతులపై ఆంక్షలు సడలింపు…
దేశవ్యాప్తంగా ఉల్లి ధర పెరగడంతో ఉల్లి దిగుమతులపై ఆంక్షలు సడలిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు ఉల్లిగడ్డల దిగుమతులపై సడలింపులు అమలులో ఉంటాయి. వివిధ దేశాల నుంచి దిగుమతులను వేగంగా దేశీయ మార్కెట్లకు చేర్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. తద్వారా ధరలు అదుపులోకి వస్తాయని వినియోగదారుల మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఉల్లిగడ్డలను ఎగుమతి చేసే దేశాలలోని రాయబారులతో ఈ విషయంపై సంప్రదింపులు చేసినట్లు పేర్కొన్నది. ప్రభుత్వ గోడౌన్లలో ఉన్న ఉల్లి నిల్వలను బయటకు తీసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఉల్లి ధరలు పెరగడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఉల్లి ధరలు ఇలానే భారీగా పెరిగాయి.











