ఆయనో ఐ.ఎ.ఎస్., జిల్లా కలెక్టర్. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం ఒక మండల కేంద్రాన్ని సందర్శించారు. పనిలో పనిగా ఆ గ్రామ సచివాలయానికి వెళ్లారు. అక్కడ పేరుకుపోయిన చెత్తను చూశారు. ఇష్టానుసారంగా పెరిగిన పిచ్చిమొక్కలను పరిశీలించారు. అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లను చూశారు. వెనువెంటనే కత్తి, బొరిగి, పార తెప్పించారు. ఆయనే రంగప్రవేశం చేశారు. చెత్తను తొలగించారు. పిచ్చిమొక్కలను పీకారు. అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించారు. ఆయనతో మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది చేతులు కలిపారు. సచివాలయ ప్రాంగణం శుభ్రం చేశారు. స్థానికులు అవాక్కై ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ ను అభినందించారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే…
విజయనగరం జిల్లా కలెక్టర్ గా డాక్టర్ ఎం. హరిజవహార్ లాల్ పనిచేస్తున్నారు. శుక్రవారం ఆయన తన విధి నిర్వహణలో భాగంగా విజయనగరం జిల్లాలోని మండల కేంద్రమైన మెంటాడ వెళ్లారు. అక్కడ మండలాధికారులతో మాట్లాడుతూ, కార్యాలయాలను పరిశీలిస్తూ స్థానికంగా ఉన్న సచివాలయానికి చేరుకున్నారు. ఆ పరిసర ప్రాంతమంతా అడవిని తలపిస్తుండటంతో ఆశ్చర్యపోయారు.
పరిశుభ్రతకు ప్రాధాన్యత
విధి నిర్వహణలో జాగరూకతతో ఉంటూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మండల అధికారులను, సచివాలయ సిబ్బందికి సూచించారు. సచివాలయం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్ లు, మండల అధికారులు అంతా కలిసి సచివాలయ ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం, ఆహ్లాదకరమైన జీవనం కలుగుతుందని హితబోధ చేశారు.
పార పట్టి స్ఫూర్తి నింపారు
తానొక జిల్లా కలెక్టర్ అయినప్పటికీ ఎటువంటి భేషజాలకు పోకుండా తానే పార పట్టి అక్కడ పేరుకు పోయిన చెత్తను, వృధా మొక్కలను తొలగించారు. చెట్లకు వచ్చిన అదనపు కొమ్మలను స్వయంగా తొలగించి వాటిని ట్రిమ్ చేస్తూ మండల సిబ్బందిలో స్ఫూర్తి నింపారు.
ఆయన దినచర్య ఇదే..
విధి నిర్వహణలో ఆయన ఎంత బిజీగా ఉన్నా, ఉరుములు ఉరుముతున్నా , మెరుపులు మెరుస్తున్నా , జడివానలోను, మండుటెండలోను ఉదయం లేచిన వెంటనే జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఏదో ఒక కాలనీకి, లేదంటే ఏదో ఒక చెరువు వద్దకు వెళ్లి అక్కడ పరిసరాలను పరిశుభ్రం చేస్తారు. తన వెంట ఉండే పరివారం చేత చేయిస్తారు. పట్టణ సుందరీకరణకు అనునిత్యం శ్రమిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి స్థానిక ప్రజాప్రతినిధుల వరకు అందరి మన్ననలు పొందుతున్నారు.











