రాష్ట్ర ప్రభుత్వం పలు పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించింది. నిజానికి మద్దతు ధరలు నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అయినా వైసీపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి రైతులకు గిట్టుబాటు ధరలు అందిస్తామంటూ భారీ ప్రకటనలు విడుదల చేశారు. ఇప్పటికే రూ.3300 కోట్లతో అరటి, ఉల్లి, శనగలు, పొగాకు పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేశామని ప్రకటించుకుంది. రూ.11000 కోట్లతో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు చేశామని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అసలు ప్రభుత్వం ప్రకటించింది మద్దతు ధరా, గిట్టుబాటు ధరా? ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఎలా నిర్ణయించారు. అసలు పంటలకు మద్దతు ధర ఎవరు నిర్ణయించాలి. వేటిని ప్రామాణికంగా తీసుకోవాలి అనే అంశాలను పరిశీలిస్తే ఏపీ ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరలు వ్యవసాయరంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాలా ఉన్నాయి.
గిట్టుబాటు ధరలు ఇలా ఉన్నాయి
మిర్చికి రూ.7000 గిట్టుబాటు ధర నిర్ణయించారు. ప్రస్తుతం క్వింటా మిర్చి ధర రూ.20000 నడుస్తోంది. గడచిన ఆరు సంవత్సరాల్లో క్వింటా మిర్చి ధర రూ.7000 తగ్గింది లేదు. క్వింటా మిర్చి పంట దిగుబడి తీయడానికి రైతుకు రూ.10000 ఖర్చు అవుతోంది. ప్రభుత్వం రూ.7000 ప్రకటించి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తామని ప్రకటించింది. క్వింటా మిర్చి ధర రూ.7000లకు తగ్గితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కనీసం క్వింటాకు రూ.10,000 ధర దక్కితే రైతుకు ఎకరాకు కనీసం రూ.25000 లాభం వచ్చే అవకాశం ఉంది.
రైతుకు పెట్టుబడులు పోను మిగులు ఉంటేనే దాన్ని గిట్టుబాటు ధర అంటారు. కనీసం ఖర్చులు వస్తే మద్దతు ధర అంటారు. అసాధారణ పరిస్థితుల్లో పంటల ధరలు అనూహ్యంగా పడిపోతే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేస్తుంది. ప్రతి ఏటా పెరుగుతున్న సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరలను సవరిస్తూ ఉంటారు.
తాజాగా కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలే
నేడు ఏపీ ప్రకటించిన గిట్టుబాటు ధరలు
తాజాగా కేంద్ర ప్రభుత్వం పలు పంటల మద్దతు ధరలు ప్రకటించింది. ఆ ధరలే ఏపీ ప్రభుత్వం గిట్టుబాటు ధరగా ప్రచారం చేస్తోంది. ధాన్యం, జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పత్తి, సోయా, పొద్దుతిరుగుడు పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఆ ధరలనే గిట్టుబాటు ధరలంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర సంస్థలు నాఫెడ్, మార్క్ ఫెడ్, సీసీఐ ( కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) లాంటి సంస్థలు మద్దతు ధరలకు పంటలు కొనుగోలు చేసి రైతులకు ఆన్ లైన్ లో నగదు చెల్లిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరలకు పంటలు కొనుగోలు చేస్తామని ఆర్బాటంగా ప్రకటించారు. ఒక వేళ కొనుగోలు చేస్తే పంటలను నిల్వ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి గిడ్డంగుల సదుపాయం కూడా లేదు. ఒక చిన్న గదిలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి అన్నీ పంటలు కొనుగోలు చేస్తున్నామని ప్రకటించడం రైతులను మోసం చేయడమే.
కొర్రలు, అండుకొర్రల విషయం అభాసుపాలు
చిరుధాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటా రూ.2500 గిట్టుబాటు ధర ప్రకటించింది. మార్కెట్లో క్వింటా కొర్రలు రూ.6000, అండు కొర్రలు రూ.12000 ధర పలుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విచిత్రంగా మార్కెట్లో ఉన్న ధరలో సగం ధర కూడా నిర్ణయించకుండా గిట్టుబాటు ధరలు ప్రకటించి అభాసుపాలవుతోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.
నిమ్మ పంటకు గిట్టబాటు లేక రైతులు రోడ్డునపడ్డారు. అయినా ప్రభుత్వం పట్టించుకోదు. సుబాబుల్ సాగు రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వానికి వారి కష్టాలు కనపడవు. నెల్లూరు జిల్లా రైతులు ఎడగారులో సాగుచేసిన ధాన్యం అమ్ముకోలేక రోడ్డెక్కారు. చివరకు వారిపైనే కేసులు పెట్టి వేధించారు. ఇన్ని ఘటనలు కళ్ల ముందు కనిపిస్తుంటే, ప్రభుత్వం ఆర్భాటంగా గిట్టుబాటు ధరలు ప్రకటించి అభాసుపాలవుతోంది.
గిట్టుబాటు ధరలు అంటే సాగు ఖర్చులపై 50 శాతం అదనంగా ధరలు నిర్ణయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పంటల గిట్టుబాటు ధరలు వ్యవసాయరంగాన్ని మరింత సంక్షోభంలో నెట్టేలా ఉన్నాయని రైతులు విమర్శిస్తున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలను, రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలుగా ప్రచారం చేసుకోవడం దారుణమని రైతు నాయకులు పెదవి విరుస్తున్నారు.











