ముందు ఏ వార్త చెప్పుకుందాం? గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? శుభమా అంటూ గుడ్ న్యూసే చెప్పుకుందాం.
తమిళనాడు రాజకీయాలు పాకాన పడుతున్నాయి. ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల మధ్య కొట్లాటలు మాత్రమే కాదు.. ఒకే పార్టీలోని నాయకుల మధ్య కొట్లాటలు కూడా మొదలైపోయాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గాలు బాహాబాహీ తలపడి కొట్టుకున్నారు.
ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్న అన్నా డీఎంకే లో వర్గపోరు మొదలైంది. అయితే అప్పుడే సదరు వర్గపోరు సమసిపోయింది అనే అభిప్రాయాన్ని కూడా పలువురిలో కలిగించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే.. పార్టీ పరంగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు.
ఎట్టకేలకు ఆ కమిటీ కసరత్తు చేసిన తర్వాత.. బుధవారం నాడు వచ్చే ఎన్నికలను ఎవరి సారథ్యంలో ఎదుర్కోబోతున్నారనే విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రమే.. వచ్చే ఎన్నికల సమయానికి అన్నా డీఎంకే పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించారు.
ఒక రకంగా ఇది నెచ్చెలి శశికళ వర్గానికి శుభవార్తే. ఎందుకంటే.. గతంలో జయలలిత తన స్థానంలో మరొకరిని కూర్చోబెట్టదలచుకున్నప్పుడు పన్నీర్ సెల్వంను ఎంచుకున్నారు. అలాంటి నిర్ణయాధికారం శశికళ చేతికి వచ్చినప్పుడు ఆమె పళనిస్వామిని ఎంచుకున్నారు. పన్నీర్ సెల్వం.,. శశికళ ఆదేశాలను పట్టించుకోలేదని.. అందుకే తన చేతికింద ఉండడానికి పళనిస్వామిని పెట్టారని వార్తలు వచ్చాయి. సో, ఇప్పుడు పళని స్వామి రాబోయే ఎన్నికల తర్వాత కూడా అన్నా డీఎంకే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటింపబడడం అంటే.. అది, వచ్చే ఏడాది జైలునుంచి విడుదల అవుతుందని భావిస్తున్న శశికళకు శుభవార్తే కదా.?
మరి బ్యాడ్ న్యూస్ ఏంటి?
శశికళ వచ్చే ఏడాది పరప్పన జైలు నుంచి విడుదల అవుతారనేది.. ఆర్టీఐ చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్ పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమెకు సంబంధించిన సుమారు 2వేల కోట్ల రూపాయల ఆస్తులను ఐటీశాఖ బుధవారం నాడు సీజ్ చేసింది.
కొడనాడ్, సిరతవూర్ లలో ఈ ముగ్గురి పేరిట ఉన్న ఆస్తులను ఎటాచ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో ఆస్తుల వెలుపల నోటీసులు అంటించారు.
పాపం జయలలిత నెచ్చెలి శశికళకు ఒకే రోజు ఒక వార్త అలా.. ఒక వార్త ఇలా అందాయని అనుకుంటున్నారు. అందుకే ఒరు సెయిది ఇపిడి, ఒరు సెయిది అపిడి.. అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.