(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
మూడు రాజధానులు కావాలంటూ అమరావతి రాజధానిలో మంగళగిరి నుంచి వచ్చిన ప్రీ పెయిడ్ ఆర్టిస్టులు హంగామా చేస్తున్నారు. ఏకంగా సీడ్ యాక్సెస్ రోడ్డుపై టెంట్లు వేసి మూడు రాజధానులు కావాలంటూ నినాదాలకు దిగారు. రాజధాని రైతులు నిలదీస్తే మేం అమరావతి రాజధానిలోని బేతపూడి గ్రామస్థులమని చెబుతున్నారు. బేతపూడి గ్రామస్థులు ఆ గ్రామంలో టెంట్లు వేసుకుని దీక్షలు చేయాలి కానీ, సీడ్ యాక్సెడ్ రోడ్డులో మీకేం పని అన్ని ప్రశ్నిస్తే మాత్రం ప్రీ పెయిడ్ ఆర్టిస్టులు నోరు మెదపడం లేదు.
మంగళగిరి నుంచి ముందే డబ్బిచ్చి తరలించిన ప్రీపెయిడ్ ఆర్టిస్టులకు, అమరావతి రాజధాని గ్రామాల రైతుల మధ్య వివాదాలు సృష్టించాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రీపెయిడ్ ఆర్టిస్టులుగా కొన్ని సామాజికవర్గాలను ఎంచుకున్నారు. రాజధాని రైతులు గొడవకు దిగితే అట్రాసిటీ కేసులు పెట్టాలనే యోచనతోనే ఈ అరాచకానికి ఒడిగట్టారని అమరావతి జేఏసీ నేతలు అనుమానిస్తున్నారు.
30 లక్షల ఇళ్ల స్థలాల కోసమట?
అమరావతి హైకోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ మార్గంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ రోడ్డుపై మూడు రాజధానులు కావాలంటూ, 30 లక్షల పట్టాలు ఇవ్వాలంటూ కొందరు ఇవాళ టెంట్లు వేసి దీక్షకు దిగారు. దీంతో రాజధాని రైతులను మరింత రెచ్చగొట్టి, ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చాలనే యోచనతోనే ప్రీపెయిడ్ ఆర్టిసుల ముసుగులో రౌడీ షీటర్లను రంగంలోకి దింపారని సమాచారం. అయినా రాజధాని రైతులు నిగ్రహంగా, శాంతియుతంగా దీక్షలు కొనసాగిస్తున్నారు. వారి వ్యూహాన్ని పసిగట్టిన అమరావతి రాజధాని గ్రామాల రైతులు వారితో గొడవలు పెట్టుకోకుండా శాంతియుతంగా దీక్షలు కొనసాగిస్తున్నారు.
అన్నీ మేం చూసుకుంటాం..
మంగళగిరి నుంచి తరలిస్తున్న కూలీలకు రోజుకు రూ.800 కూలీ, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీ, రానుపోను ఆటో సౌకర్యాలతో 200 మంది ప్రీ పెయిడ్ ఆర్టిస్టులను అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు తరలిస్తున్నారు. వారిని ముందుగా ఏర్పాటు చేసిన టెంట్లలో కూర్చోబెట్టారు. కొందరికి తెల్లపంచెలు, తెల్లచొక్కాలు, టవళ్లు ఇచ్చి రైతుల మాదిరి తయారు చేసి మరీ దీక్షకు పంపుతున్నారు. వారితో మూడు రాజధానులు కావాలంటూ నినాదాలు చేయిస్తున్నారు. టెంట్లలో కొందరు రౌడీ షీటర్లు కూడా తిష్ట వేశారని తెలుస్తోంది. ఇది ఒక్క రోజుకు కాకుండా రెండు, మూడు నెలల పాటు ఉద్యమం కొనసాగించే యోచనతోనే ప్రీపెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. (ఇది కూడా చదవండి : అది అరాచక ఉద్యమం)
రాజధానిలో స్థలం ఇస్తాం
కోర్టు కేసులు ఫైనల్ కాగానే మీకు రాజధానిలో ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించి ఇళ్లు నిర్మించి ఇస్తుందంటూ మంగళగిరికి చెందిన పేదలను ఆటోల్లో దీక్షా శిబిరాలకు తరలిస్తున్నారని తెలుస్తోంది. వీరికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోలీసులు చూసుకుంటున్నారు. రైతులెవరూ వీరిని ప్రశ్నించకుండా వీరికి రక్షణగా పోలీసులు వస్తున్నారని సమాచారం. తాజాగా సీడ్ యాక్సెస్ రోడ్డులోనే దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటే పక్కా ప్రణాళికతో కొన్ని అరాచక శక్తులు వెనుక ఉండి వారిని నడిపిస్తున్నట్టు అనిపిస్తోందని రాజధాని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శాంతి భద్రతల సమస్య రావాలనేదే వారి కోరిక
అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరూ 300 రోజులకు పైగా దీక్షలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. తాజాగా మూడు రాజధానులు కావాలనే డిమాండ్ తో డ్రామా దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలు చేసే వారి వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారనేది స్పష్టం. ఈ రెండు దీక్షలు చేసే వారి మధ్య గొడవలు చెలరేగి.. శాంతి భద్రతల సమస్య ఏర్పడాలనేది వారి కుట్రగా కనిపిస్తోంది. అలా జరిగితే.. మొత్తం దీక్షలు చేస్తున్న అందరినీ అరెస్టు చేసి జైళ్లకు తరలించవచ్చునని.. మళ్లీ ఎవరూ టెంటు వేసి దీక్షకు కూర్చోకుండా.. నిషేధాజ్ఞలు పెట్టవచ్చునని ఆలోచిస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. అందుకే రాజధాని రైతులు సంయమనం పాటిస్తున్నారు.