పాకిస్థాన్ పై ఇండియా దాడి చేయబోతుందన్న విషయం తెలియగానే ఆ దేశ సైన్యాధ్యక్షుడు బజ్వా గజగజ వణికిపోయారంటూ పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ నేత అయాజ్ సాధిక్ తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది.
అసలు అప్పుడు ఏం జరిగిందంటే..
భారత్ పై దాడి చేసేందుకు పాక్ యుద్ధ విమానాలు వచ్చిన వెంటనే భారత ఫైటర్ జెట్లు వాటిని వెంబడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ గగనతలంలోకి వెళ్లిన అభినందన్ ఒక పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేశారు. సరిగా అదే సమయంలో అభినందన్ ఉన్న విమానం కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రహించిన అభినందన్ ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలోకి ల్యాండ్ అయ్యారు.
అదే సమయంలో పాక్ సైనికులు అభినందన్ ను అదుపులోనికి తీసుకున్నారు. ఆ సమయంలో పాక్ కానీ అభినందన్ ను కానీ విడుదల చేయకుండా ఉన్నట్లయితే భారత్ యుద్ధానికి సిద్ధమయ్యేదని సాధిక్ గుర్తు చేసుకున్నారు.
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో సాధిక్ మాట్లాడుతూ, ఇప్పటికీ నాకు గుర్తు ఉంది. అభినందన్ ను ఆర్మీ అదుపులోనికి తీసుకున్నప్పుడు అత్యవసర సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. విదేశాంగమంత్రి మహ్మద్ ఖురేషి మాత్రం హాజరయ్యారు. ‘దయచేసి అభినందన్ ను వదిలి పెట్టండి. లేకపోతే రాత్రి 9 గంటల ప్రాంతంలో భారత్ మనపై దాడి చేసే అవకాశం ఉందని’ ఖురేషీ పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ బజ్వాతో చెప్పారు. అంతే ఆ మాట వినగానే బజ్వాకు ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. అప్పటికే ఆయన కాళ్లు గజగజ వణికిపోవడం మేము గమనించామంటూ సాధిక్ తెలిపారు.
అభినందన్‌ను విడుదల చేయడం ఒక్కటే మార్గమని, పార్లమెంటరీ సమావేశానికి హాజరైన పీపీపీ, పీఎంఎల్-ఎన్ తదితర పార్టీలను అభ్యర్థించారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించాయి.
కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. వైమానిక దాడుల్లో భాగంగా గతేడాది ఫిబ్రవరి 27న భారత పైలట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఆయనను.. పాక్ ఆర్మీ అధికారులు దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలోకి తీసుకున్నారు. అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ భారత్‌కు చేరుకున్నారు. దాయాది దేశ సైన్యానికి చిక్కినప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. ధైర్యసాహసాలు ప్రదర్శించి కర్తవ్యాన్ని నిర్వర్తించిన అభినందన్‌ను.. వీరచక్ర శౌర్య పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించిన విషయం తెలిసిందే.