‘వేదం అణువణువున నాదం’ అని పాడుకునే రోజులు కావివి.. అణువణువూ డేటింగు నినాదమే. వయసు విచక్షణ కోల్పోతోంది.. మనసు కొత్త రుచులు కోరుకుంటోంది.
‘ఎంత ఘాటు ప్రేమయో.. ఇంత లేటు వయసులో’ అని పాడుకోకపోయినా పాడు పనులకు తెరతీసేసింది మన టెక్నాలజీ. కొన్నాళ్లు పోతే ‘శతమానం భవతి..’ అనే వేద మంత్రాన్ని కూడా మనం మరచిపోతామేమో అనిపిస్తోంది. డేటింగ్, లివింగ్ టుగెదర్, వన్ నైట్ స్టాండ్.. లాంటి కొత్త పదాలు వచ్చి చేరిపోతున్నాయి. చివరికి కొంప కొల్లేరవుతుందని ఎవరికి తెలుసు? లక్ష్మణ రేఖ గీసేవారు లేకపోతే బరితెగించే బాపతు పెరిగిపోతారు. ఇప్పుడు జరుగుతున్నది అదే.
ఒకటా రెండా.. అమ్మో బోలెడన్ని డేటింగ్ యాప్ లు.. మనిషికి ఇక గ్యాప్ ఎక్కడుంటుంది చెప్పండి. ఏ కాస్త టైమ్ దొరికినా యాప్ లో దూరిపోవడమే. రెండు మనసులు కలవాలన్నా.. ఇద్దరు మనుషులు కలవాలన్నా ఇప్పుడు మంత్రాలు కాదు ఏకంగా యంత్రాలే వచ్చేశాయి. ఇంతకన్నా పెద్ద వశీకరణ మంత్రం వేరేదీ ఉండదేమో. టిండర్, ఓకేకుపిడ్, హింగ్, బంబుల్, మీట్ లీ.. ఇలా బోలెడు యాప్ లు. అమ్మాయి లేదా ఆంటీ ఎక్కడ ఉన్నా మీ పక్కనే ఉండేలా చేసే మార్గం ఇది. పగలు అందరూ శ్రీరామ చంద్రులేగానీ చీకట్లో ఎన్ని తప్పులైనా చేయడానికైనా వెనకాడని జనం మాత్రం ఈ యాప్ లతోనే జపం మొదలెట్టేస్తున్నారు.
తప్పు ఎవరిది?
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని వేమన పద్యాన్ని కూడా గుర్తుచేసుకోవలసి వస్తోంది. కాకిపిల్ల కాకికి ముద్దే కదా.. అందుకే ఇది వరకు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల గురించి మాట్లాడాల్సి వస్తే ‘మా అబ్బాయి నోట్లో వేలు పెడితే కొరకలేడండీ’ అనేవారు. వాడు ఏలు కాదు ఏకంగా కాలే కొరుకుతుంటాడని ఆ తల్లిదండ్రులకు మాత్రం ఏం తెలుసు పాపం. బుడ్డోడు లేదా బుడ్డది కదా అనుకుని వారికి ఓ స్మార్ట్ ఫొన్ కొనిచ్చేస్తారు. వాడు ఇక రాత్రి ఎందుకు నిద్రపోతాడు.
‘నామం పెట్టు నామం పెట్టు కాలేజీకీ.. చిన్నదాని చెయ్యేపట్టు మ్యారేజీకి’ అనుకునే రోజులు కూడా ఇవి కాదాయె. తెల్లవార్లూ కంప్యూటర్ ముందు కూర్చోవడం, దుప్పటి ముసుగులో సెల్ ఫోన్ పట్టుకుని అతగాడు ఏం చేస్తుంటాడో ఆ తండ్రికి ఏం తెలుసు అనడం కూడా తప్పే.. ఎందుకంటే అతని తండ్రి కూడా చేస్తున్నది ఆ తప్పే మరి. అయ్యగారు బయటకు కాలు పెడితే రెచ్చి పోయే అమ్మగార్లూ ఉంటున్నారు. ఇక ‘శతమానం భవతి’ ఏమిటి నా మొహం అనుకోవాల్సిందే. అందరూ శ్రీవైష్ణవులే అయినపుడు ఎవరినని ఏం లాభం?
ఏం జరుగుతుందో మీకు తెలియాలా?
డేటింగ్ యాప్ లోకి వెళ్లాలనుకున్న వారు పగలు శ్రీరామచంద్రులు అనుకున్నాం కాబట్టి కొత్త మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుంటారు. నచ్చిన అమ్మాయికో అబ్బాయికో లైక్ లు కొట్టుకుంటూ పోతుంటారు. అవతలి వారు ‘హాయ్’ అంటూ రిప్లయ్ ఇవ్వగానే రొట్టి విరిగి నేతిలో పడ్డట్టుగానే ఫీలై పోతారు. ‘గ్రీకు వీరుడు.. నా రాకుమారుడు..’ అనుకుంటూ ఏదేదో ఊహించుకుంటారు. ఛాటింగులతో టైమ్ వేస్ట్ అనుకున్న వారు డైరెక్టుగా విషయంలోకి వచ్చేస్తారు. అవతలి వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఫొటో పెట్టమంటూ తొందరపడతారు. తీరా ఆ ఫొటో చూసి అవాక్కవుతారు. ఉబ్బిన రబ్బరు బెలూన్ లాంటి ఆ మొహం చూసే సరికి ఊహించుకున్న రాకుమారుడు మాయమైపోతాడు.
అంతే.. దాంతో ఆ ఛాటింగ్ అక్కడితో కట్. ముక్కూ మొహం తెలియని వారితో డేటింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది మరి. ఈసారి ఇలా కాదు అందమైన అమ్మాయి ఫొటో చూసేసి ఆమెనే ఎంచుకుందాం అని ఫిక్సయిపోతారు. మీరు లైక్ కొట్టే లోపే ఆమె నుంచి మీకు లైక్ వచ్చేస్తుంది. మీరు ఉబ్బితబ్బిబ్బు అయిపోతారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఐడీ పెట్టేస్తుంది. మీరు ఆమెను ఫాలో అవక తప్పుతుందా చెప్పండి. తమ ఫాలోవర్లను పెంచుకోవడం కోసం ఇలాంటి ట్రిక్కులు చేసేవారు కూడా ఇందులో ఎక్కువే. ఇంకో ప్రమాదం కూడా ఉందండోయ్.. గేలు తెలుసు కదా.. అదేనండీ స్వలింగ సంపర్కులు.. వారికి ఇదే వేదిక. వారికి దొరికిపోతే ఏం జరుగుతుందో ఇక చెప్పడానికి ఏముంటుంది.
ఇలా చేశారో.. ఇంతే సంగతులు?
ఈరోజు మన గాలానికి ఎవరు చిక్కుతారా అనుకుని డేటింగ్ యాప్ ఓపెన్ చేస్తారు. ఓ అందమైన అమ్మాయి అప్పటికే మీకు లైక్ కొట్టి ‘హాయ్’ అని పెట్టి ఉంటుంది. పైగా ఆమె మీకు దగ్గరలోనే ఉన్నట్లు కూడా పెడుతుంది. అంతేకాదండోయ్ ఏకంగా ఆమె నంబరే అందులో పెట్టేస్తుంది. మీరు ఎగిరి గంతేస్తారు. దాంతో యాప్ క్లోజ్ చేసి ఏకంగా వాట్సాప్ ఓపెన్ చేస్తారు. ఆమెకు హాయ్ చెబుతారు. ఆమె కూడా రెచ్చిపోతుంది. ‘వీడియో కాల్ చేస్తా.. న్యూడ్ గా కనిపిస్తా’ అంటుంది. ఇక మీరు ఆగుతారా రంగంలోకి దిగిపోతారు. ఆమె కాల్ చేసి న్యూడ్ గా కనిపిస్తుంది.
ఆ తర్వాత మిమ్మల్ని కూడా న్యూడ్ గా కనిపించమంటుంది. వెంటనే మీరు ఆ పనిచేసేస్తారు. ఆమెకు అంతకన్నా కావలసింది ఏముంటుంది. మీ జుట్టు ఆమె చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీకు ఆమె న్యూడ్ కాల్ చేసినప్పుడు కనిపించేది ఆమె కాదు. ఆమె అలాంటి వీడియో ఒకటి డౌన్ లోడ్ చేసుకుని దాన్ని మీకు చూపిస్తుంది. మీరు అది నమ్మేసి మీరు న్యూడ్ గా కనిపిస్తారు. దాన్ని ఆమె స్క్రీన్ రికార్డర్ లో రికార్డు చేసేసుకుంటుంది. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. బ్లాక్ మెయిలింగ్ మొదలు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడంటే ఇదే.
మీరేం చేయాలో తెలుసా?
యంత్రాలను నమ్మడం మానేసి మనుషుల్ని నమ్మండి. ఈ యాప్ లలో దొరికేవారిలో జన్యూన్ కేసులు 20 శాతం కూడా ఉండవు. సాధారణంగా ఇందులో కనిపించే వారిలో ఎక్కువమంది కాలక్షేపం బ్యాచ్. లవ్ బ్రేక్ అప్ అయినవారు ఏమీ దొరక్క ఇందులోకి వస్తారు. ధనవంతుల్ని బుట్టలో వేసుకోవడానికి వచ్చే బాపతులు ఇంకొందరు. ఎక్కువగా అందంగా లేనివారే ఇందులో ఎక్కువగా ఉంటారు. భర్తకు విడాకులిచ్చేసి తోడు కోసం వెతుక్కునేవారు ఇంకొందరు. ఒక విధంగా ఇది రైలు ప్రయాణం లాంటిదే. రైలులో ఉన్నంత వరకే వారు మీతో ఉంటారు. ఈ యాప్ ల ప్రయాణం కూడా తాత్కాలికమే. ఇవి ఎక్కువ కాలం కొనసాగవు.
మ్యాట్రిమోని సైట్లకూ, డేటింగ్ యాప్ లకూ పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే మాట్రిమోని సైట్లు కొంతసేఫ్. ఇక మూడో రకం కూడా ఉన్నాయి. అవి సామాజిక మాధ్యమ పరిచయాలు. ఇక్కడ ఛాటింగ్ తో పరిచయం కాస్తా డేటింగుగా మారుతుంది. ఉత్తరాదిలో మాత్రం ఈ డేటింగ్ ఇంకా శ్రుతిమించిందని చెప్పొచ్చు. అక్కడ వన్ నైట్ స్టాండ్ ఉంటుంది. సాధారణంగా డేటింగ్ అంటే కలిసిమెలిసి తిరగడానికే పరిమితం. వన్ నైట్ స్టాండ్ అంటే వారితో ఒకరాత్రి గడపడం.
డేటింగ్ యాప్ లలో ఛాటింగ్ జరిగేటప్పుడే ‘గో ఫర్ వన్ నైట్ స్టాండ్’ అని పెడుతుంటారు. చివరికి ఏ బార్ లోనో, పబ్ లోనో కలిసి ఆ తర్వాత గెస్ట్ హౌస్ కు వెళ్లి రాత్రి గడిపేస్తారు. అంతర్జాలం వచ్చాక ఇలాంటి మాయాజాలం పెరిగిపోయింది. మన సంస్కృతి సంప్రదాయాలకు విలువలేకుండా పోయింది. ఇలాంటి వాటికి చిక్కితే మీ మనుగడకే ముప్పు. మీ టైమ్, మనీ.. ఎవ్విర్ థింగ్ వేస్ట్. బీ కేర్ ఆఫ్ డేటింగ్ యాప్స్… బివేర్ ఆఫ్ దిస్ డర్టీ డాగ్స్.
– హేమసుందర్ పామర్తి











