వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీని తెలంగాణలో విస్తరించే విషయంలో జగన్ అభిప్రాయంతో షర్మిల ఏకీభవించలేదని, భిన్నాభిప్రాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. వైఎస్ జగన్ –షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల పార్టీ వ్యవహారం ఆమె అభిప్రాయం మాత్రమేనని, కోట్లాది మంది గుండె చప్పుడు వైఎస్ ముద్దుల కుమార్తెగా షర్మిలకు గుర్తింపు ఉందన్నారు.
తమ పార్టీ నుంచి మద్దతు ఉండదు..
కాగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి మద్దతు, పొత్తుల్లాంటివి ఏ పార్టీతోనూ ఉండవన్నారు. తెలంగాణలో పార్టీ పెడుతున్న అంశంపై షర్మిల కూడా ప్రకటించలేదని, కేవలం అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటున్నారన్నారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం తరువాత ఉన్న పరిస్థితులు, కాంగ్రెస్ నుంచి బయటకు గెంటే ప్రయత్నం చేయడంతో తొలుత జగన్, విజయమ్మ బయటకు వచ్చారని, ఆ తరువాత చాలా మంది వచ్చారన్నారు. అక్రమ కేసుల్లో జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. తద్వారా అంతా తమకు అండగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ ఇవ్వకుండా
ఈ మధ్య కొందరు వ్యక్తులు దుర్భుద్దితో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారన్నారు. అన్యాయంగా రాష్ట్ర విభజన చేశారని, ఏపీని దారుణంగా చేశారన్నారు. గుండెకాయ లాంటి హైదరాబాద్‌ను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. గతంలో తమ పార్టీని తెలంగాణలో విస్తరించాలనే ప్రతిపాదన వచ్చిందని, చాలాసార్లు దీనిపై చర్చ నడిచిందన్నారు. తెలంగాణలో వైఎస్ అభిమానులు చాలామంది ఉన్నారని, అక్కడా వైఎస్ కలలు గన్న సమాజం నిర్మాణం కావాలని కోరుకున్నామన్నారు. అయితే జగన్ ఆలోచన వేరుగా ఉందని, రాష్ట్ర విభజన తరవాత రెండు ప్రభుత్వాలు సహకరించుకుని వెళ్లాలని, ఉమ్మడి ప్రయోజనాలు, మనస్పర్ధలూ ఉంటాయని, వాటిని పరిష్కరించుకునేలా వ్యవహరించాలని సీఎం జగన్ భావించారన్నారు. అక్కడ పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తే సెంటిమెంట్ తెరపైకి వస్తుందని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో వైఎస్ జగన్ దూరంగా ఉన్నారన్నారు. వ్యాక్యూమ్ కూడా ఉందని తెలిసినా..తమ స్టాండ్ మార్చుకోలేదని వ్యాఖ్యానించారు. అందువల్ల వైసీపీ తెలంగాణలో విస్తరణకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు.
రెండు నెలల ముందే తెలుసు..
వైఎస్ షర్మిల తెలంగాణలో అభిప్రాయ సేకరణకు ప్రయత్నిస్తున్నారన్న విషయం తమకు రెండు నెలల ముందే తెలుసని వ్యాఖ్యానించారు. మంగళవారం ఇలా సమావేశం పెడుతుందని ఊహించలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వైసీపీని ఎందుకు విస్తరించడం లేదన్న విషయంపైనే జగన్‌కి, షర్మిలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. పార్టీ పెడితే వచ్చే ఇబ్బందులు, లాభ నష్టాలను బేరీజు వేసుకోవాలన్నారు.
ప్రచారం అవాస్తవం..
పార్టీ వ్యవహారం విషయంలో జగన్‌కి, షర్మిలకి విబేధాలున్నాయన్న ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని, భిన్నాభిప్రాయం మాత్రమేనని వ్యాఖ్యానించారు. సహజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నలుగురి గ్రూప్ కాదని, పూర్తి నిర్మాణాత్మక పార్టీ అని, వ్యక్తిగత నిర్ణయాలకు పార్టీ ప్రాధాన్యం ఇవ్వదన్నారు. కోట్లాది మందికి వైఎస్సార్ పార్టీ జవాబుదారీగా ఉండాలన్నారు. ప్రస్తుతం షర్మిల వ్యక్తి మాత్రమేనన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినా.. ఏపీ ప్రయోజనాలకే వైసీపీ ప్రాధాన్యం ఇస్తుందని వ్యాఖ్యానించారు. తమ పార్టీ విధానం ఎప్పుడూ పబ్లిక్ లైన్ మాత్రమేనని, హిడెన్ అజెండా, లోపాయకారీ వ్యూహం ఉండదన్నారు.
జగన్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే..
ఏపీ సీఎం వైఎస్ జగన్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం పెద్ద కష్టం కాదని, అయితే, తమ లక్ష్యం అది కాదన్నారు. తమకు ఇంతకంటే పెద్ద ఇబ్బందులే వచ్చాయని, తట్టుకుని నిలబడ్డామన్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాల్లేవని, పార్టీ విస్తరణ గురించి భిన్నాభిప్రాయాలు మాత్రమేనని చెప్పారు. ఫ్యామిలీలో ఎలాంటి చర్చలు జరిగాయో తెలియదన్నారు. వైఎస్ షర్మిలను ఎదగనీయలేదనే అభిప్రాయం వాస్తవం కాదన్నారు. వైఎస్ ఫ్యామిలీలో పదవుల కోసం వివాదాలు వచ్చాయనే ప్రచారం హాస్యాస్పదమన్నారు. ఒకవేళ షర్మిలకు పదవి ఇస్తే..మళ్లీ ఫ్యామిలీకే పదవులా అనే విమర్శలు వచ్చేవన్నారు. రాజకీయాల్లో మొసళ్లు ఉంటాయని, షర్మిల ఎలా తట్టుకుంటుందనే అంశంపై జగన్‌కి కొంత టెన్షన్ ఉందని వ్యాఖ్యానించిన సజ్జల…షర్మిలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. గతంలో వైసీపీకి తెలంగాణలో6శాతం ఓట్లు పడ్డాయని, అభిమానులు ఉన్నా.. ఓట్లు వస్తాయని చెప్పలేమని వ్యాఖ్యానించారు. గాంధీ మహాత్ముడి మీద అభిమానం ఉన్నా..ఓటేయమంటే ఎంతమంది వేస్తారో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని వ్యాఖ్యానించారు. మొత్తం మీద వైఎస్ షర్మిల మంగళవారం నిర్వహించిన ఆత్మీయుల సమావేశంపై సజ్జల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.











