వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరికోరి మరీ కొత్తగా ప్రవేశపెట్టిన పథకం గ్రామ సచివాలయ వ్యవస్థ. ఇందులో ఇతర ఉద్యోగులున్నా… గ్రామ, వార్డు వలంటీర్లకే కీలక భూమిక. సంక్హేమ పథకాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే తీసుకొస్తామని ప్రకటించిన జగన్… అందులో భాగంగానే వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అవసరం వచ్చినప్పుడల్లా.. పార్టీ కార్యకర్తలుగా కూడా ఉపయోగపడతారని పథకం రచించిన జగన్ కు ఇప్పుడు వలంటీర్లు చుక్కలు చూపించేందుకు సిద్ధమైపోయారు. మొత్తంగా తాను కోరి తెచ్చిన పథకం జగన్‌కు లాభాలను కాకుండా భారీ నష్టాలను, అష్ట కష్టాలను తీసుకొస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని జనానికి చేరవేస్తూ..
ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందజేస్తామని ఘనంగా ప్రకటించిన జగన్… అందుకోసమంటూ ప్రత్యేకంగా వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామాలతో పాటు పట్టణాలు, నగరాల్లోనూ ఇన్నేసి ఇళ్లకు ఓ వలంటీర్ అంటూ లెక్కకు మిక్కిలి వలంటీర్లను జగన్ సర్కారు నియమించింది. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని వలంటీర్లు జనానికి చేరవేస్తూ కీలక భూమికే పోషిస్తున్నారు. వారికి నెలకు రూ.5 వేలు ఇస్తున్నట్లుగా ప్రకటించిన జగన్ సర్కారు.. మున్ముందు దానిని మరింతగా పెంచుతామంటూ ప్రకటించింది. వలంటీర్ల వ్యవస్థ ఏర్పడి ఇప్పటికే ఏడాదిన్నర పూర్తి అవుతున్నా.. వారికి పనిభారం పెరిగింది గానీ వారి వేతనాల పెంపును మాత్రం సర్కారు పట్టించుకోలేదు. సరేలే.. ఉన్న ఊళ్లోనే పనిచేస్తున్నాం కదా… ఎలాగోలా సర్దుకుపోదాంలే… ప్రభుత్వం తమ వేతనాలను పెంచకపోతుందా? అన్న భావనతో వలంటీర్లు కూడా పని చేసుకుంటూ పోతున్నారు.

ఆందోళనతో రేషన్ వాహనాల డ్రైవర్ల జీతాల పెంపు
ఇలాంటి తరుణంలో జగన్ సర్కారు మరో కొత్త పథకం ఇంటి వద్దకే రేషన్‌ను ప్రారంభించేసింది. దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా అమలు చేయని రీతిలో లబ్ధిదారుల ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేస్తున్నట్లుగా జగన్ సర్కారు భారీ ప్రకటనలు గుప్పించింది. పథకంలో భాగంగా రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేర్చేందుకు వేలాది వాహనాలను కొనుగోలు చేసింది. వాటిని నడిపేందుకు, సరుకులను లబ్ధిదారులకు ఇచ్చేందుకు డ్రైవర్లను నియమించింది. వారికి నెలకు రూ.16 వేలు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. పథకం ప్రారంభమైన వెంటనే… రేషన్ డోర్ డెలివరీ ఎంత కష్టమో డ్రైవర్లకు తెలిసి వచ్చింది. అంతేకాకుండా ఎలాగోలా ఒప్పుకున్న పని చేద్దామన్నా… తమకు ప్రభుత్వం ఇస్తున్న వేతనం ఏమాత్రం సరిపోదని వారు ఓ నిర్ధారణకు వచ్చారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాల డ్రైవర్లు ఆందోళనకు దిగగా… వెనువెంటనే దిగివచ్చిన జగన్ సర్కారు.. బాబ్బాబు మీ వేతనాలకు అదనంగా మరో రూ.5 వేలను చేర్చి మొత్తంగా రూ.21 వేలను అందజేస్తామంటూ ప్రకటించింది. ఈ ప్రకటనతో డ్రైవర్లు డ్యూటీలోకి వచ్చేయగా.. ఆ మరునాడే వలంటీర్లు ఒక్కసారిగా ఫైరైపోయారు.
సర్కారుకు అల్టిమేటం ఇచ్చిన వలంటీర్లు
వాహనాల్లో రేషన్ సరుకులను వేసుకుని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లే డ్రైవర్లు… వాహనంలోని సరుకులను వాహనం దిగకుండానే… లబ్ధిదారుల సంచుల్లో నింపేయడంతోనే నెలకు రూ.21 వేలను తీసుకుంటున్నారు. మరి ప్రభుత్వం అప్పజెప్పిన అన్ని పనులను పూర్తి చేస్తున్న తమకు మాత్రం కేవలం రూ.5 వేలతోనే సరిపెడతారా? అంటూ వలంటీర్లు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఈ భావన వచ్చినంతనే… తొలుత తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వలంటీర్లంతా సమావేశమై… తమ వేతనాలను పెంచితేనే డ్యూటీలు చేస్తామని, లేదంటే సామూహికంగా సమ్మెలోకి వెళతామంటూ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. ఆ మరునాడే… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో వలంటీర్లు నిరసన బాట పట్టారు. వెరసి జగన్ ఏరికోరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వలంటీర్లే ఇప్పుడు ఆయన సర్కారుపై నిప్పులు చెరుగుతూ ఊగిపోతున్నారు. వేతనాలను పెంచుతారా? లేదంటే సమ్మెలోకి వెళ్లమంటారా? అంటూ రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు సోమవారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో ఏం చేయాలో పాలుపోక జగన్ సర్కారు తల పట్టుకుని కూర్చుంది. మొత్తంగా తనకు ఇష్టమైన వ్యవస్థగా ప్రకటించుకున్న జగన్‌కు ఆ పథకమే మెడకు చుట్టుకుని పోయిందన్న మాట.











