వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గమనం వైపు వెళ్లడం ఏమిటా అనుకుంటున్నారా?.. ఈ సినిమా ట్రైలర్ ను ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. శ్రియ శరణ్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ తోపాటు అనేకమంది అగ్ర నటీనటులతో గమనం చిత్రం తెరకెక్కింది. ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు నిర్మాతలు. ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు సుజనరావు దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ట్రైలర్ ల ప్రారంభాన్ని అగ్రనటులతోనే ప్రారంభించారు. తెలుగు ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. హిందీ ట్రైలర్ ను సోనూ సూద్, తమిళం జయం రవి, కన్నడం శివరాజ్ కుమార్, మలయాళం ఫాహద్ ఫాజిల్ ప్రారంభించారు. మొత్తం మూడు కథలతో ఈ చిత్రం తెరకెక్కింది. చంటి బిడ్డలతో శ్రియ పడే కష్టాలు, క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకునే యువకుడితో ఓ ముస్లం యువతి ప్రేమాయణం, రోడ్డుపై చెత్త ఏరుకునే అనాథ బాలల జీవితం.. ఇలాంటి కథలతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
హైదరాబాద్ లో ఓ రోజు రాత్రి కురిసిన భారీ వర్షం వీరి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందన్నదే కథ. ‘నాకు వినపడకపోయినా గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా.. నీకు కూడా వినపడదని నాకేం తెలుసు’ అనే శ్రియ పలికే డైలాగ్ లోనే ఈ సినిమా డెప్త్ ఏమిటో అర్థమవుతోంది. సమకాలీన జీవితాలకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.