మొక్కలు నాటడంలో ఎవరికి వారే తమ ప్రత్యేకతను చూపించేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఏ ముహూర్తంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారోగానీ సినీ ప్రముఖుల నుంచి దీనికి విశేషంగా స్పందన లభిస్తోంది. అక్కినేని నాగ చైతన్య విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన టాలీవుడ్ అందగత్తె రకుల్‌ప్రీత్ సింగ్ జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం అనేది అందరి బాధ్యత అన్నారు.

అందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బాలీవుడ్ నటి నభా నటేష్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించారు. బెంగళూరులోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ ఛాలెంజ్ ను ఇలాగే కొనసాగించాలని పిలుపు నిచ్చారు. అనూ ఇమ్మాన్యుయేల్, నిధి అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ లకు కూడా ఇలా మొక్కలు నాటాలని ఆమె ఛాలెంజ్ విసిరారు. ఇలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పెరుగుతుందని, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు.