విజయవంతమైన పరభాషా చిత్రాలను తెలుగులో అనువాదం చేయడం కొత్తేమీకాదు. ఈ కోవలోనే మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా తెలుగులోకి రీమేక్ కానుంది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ కలసి నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇద్దరు వ్యక్తుల ఇగో క్లాషెస్.. హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సాచి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 50 కోట్లకు పైగా వసూల్ చేసింది. దీంతో ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకొంది. తెలుగు నేటివిటీ కోసం ఈ కథను మొదట ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాల ఫేమ్ వెంకీ కుడుములకు బాధ్యతలను అప్పగించారు. కానీ ఆ పాత్రల్ని తెలుగులో ఏ హీరోలు పోషిస్తారు అనే విషయంలో క్లారిటీ రాలేదు.
బిజూ మీనన్ పాత్రలో నందమూరి బాలకృష్ణను తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ ఈ కథకు బాలయ్య నో చెప్పేశాడు. ఆ తరువాత మాస్ మహారాజా రవితేజను కూడా సంప్రదించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ ఈ సినిమా కోసం డేట్స్ ను అడ్జెస్ట్ చేయలేకపోయారు. దీంతో చిత్ర యూనిట్ ఓ సరికొత్త ఆలోచన చేసిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేయాలని నిర్మాతల ఆలోచనగా ఉంది. ఈ మేరకు పవన్ కు ఈ సినిమా స్క్రీనింగ్ వేశారట. పవర్ స్టార్ కూడా ఈ సినిమాని చాలా ఆసక్తిగా చూశారని తెలుస్తోంది. పవన్ కోసం కథలో మార్పులు చేర్పులు చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతిలో పెట్టారట నిర్మాతలు. త్రివిక్రమ్ తనదైన శైలిలో కాస్తంత హ్యూమరస్ టచ్ ఇచ్చి..తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా స్క్రిప్ట్ ను తీర్చిదిద్దుతున్నాడని వినికిడి. త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావచ్చని నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో దగ్గుబాటి రానా నటించనున్నారు. ఈ సినిమాపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది.